ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. అధికారం కోసం ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. కానీ బీజేపీని బెంగాల్‌లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఈసారి తీర్పు భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. ఏం చేయకూడదు అని గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం.
ఎట్టకేలకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ చీకటి దినాల్లో తప్పనిసరిగా అవసరమైన ప్రారంభం ఇది. ఏం చేయకూడదు అని మనం గుర్తించినట్లయితేనే మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. సాధారణ ఎన్నికల రాజకీయాల గణాంకాలను దాటి చూస్తే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు నిజంగానే అద్భుతమని చెప్పాలి. సాధారణ సమయాల్లో ఒక జనరంజక ముఖ్యమంత్రి మూడోసారి కూడా అధికారంలోకి రావడం గొప్ప విశేషమేమీ కాదు. కానీ బీజేపీ ఓటు షేర్ పెరగడం గొప్ప ముందంజ గానే గుర్తించాల్సి ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న ఒక రాజ కీయ పార్టీ నిజమైన ప్రతిపక్ష పార్టీగా అవతరించడంపై వేడుకలు జరుపుకోవడాన్ని పూర్తిగా సమర్థించవచ్చు.
కాని ఇది సాధారణ ఎన్నికలు కావు. అధికారాన్ని కొల్లగట్టడానికి ఇంత తీవ్రాతితీవ్రమైన ప్రయత్నం ఈ మధ్యకాలంలో ఏ రాష్ట్రం లోనూ జరిగి ఉండదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని స్థిరపర్చుకోవాలంటే బెంగాల్ ఆ పార్టీ దాటవలసిన చివరి సరిహద్దుగా ఉండింది. అందుకే సర్వతోముఖ దాడి ప్రారంభించడానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎంచుకుంది. డబ్బు, మీడియా, సంస్థాగత యంత్రాంగం, చివరకు నరేంద్ర మోదీ.. ఇలా దేన్నీ, ఎవరినీ బీజేపీ వదిలిపెట్టకుండా రంగంలోకి దింపింది. ఎన్నికల కమిషన్‌కు ఉన్న పవిత్రత నుంచి, కేంద్ర భద్రతా బలగాల తటస్థత, కోవిడ్ నిబంధనల వరకు ప్రతి అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మల్చుకుంది. బీజేపీ నేతలు తమ విజయాలను ఏకరువు పెట్టడం బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఎక్కడా జరగలేదు. అయినప్పటికీ బీజేపీని బెంగాల్‌లో ప్రజలు ఓడించారు. ఘోరావమానాల పాలు చేశారు. ఆధునిక కాలంలో ఒక రాజకీయ అశ్వమేధ యజ్ఞం భగ్నమైంది. ఒక ఇంద్రజాల ప్రదర్శన మధ్యలోనే విచ్ఛిన్నమైపోయింది. బెంగాల్‌ని బీజేపీ కనుక కైవసం చేసుకుని ఉంటే ఏం జరిగి ఉండేదో కాస్త ఊహించండి మరి. వేడుకలు, విజయధ్వానాలు మరోవైపు ప్రతిపక్షంలో భయాందోళనలు.. కాని మన గణతంత్ర ప్రజాస్వామ్యం ఒక్క రోజులోనే తన స్థానాన్ని, ఔన్నత్యాన్ని గొప్పగా ప్రకటించుకుంది.
కేంద్రపాలకులకు ఇంత భంగపాటు కలగడంతో అనూహ్య అవకాశాలకు వీలుకల్పించినట్లయింది. మనం ఇప్పుడు కరోనా మహమ్మారి సుడిగుండంలో ఎంతగా చిక్కుకుపోయామంటే, మోదీ వీర భక్తాగ్రేసరులు కూడా ప్రస్తుత కేంద్ర పాలనపై అనుమానాస్పద దృష్టితో చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభన నుంచి ఇంకా మనం బయటపడలేదు. పైగా సెకండ్ వేవ్ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరమైన పరిస్థితుల్లో కూరుకుపోవచ్చు. పైగా చారిత్రాత్మక రైతాంగ నిరసనకు మనం సాక్షీభూతులుగా ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి తీర్పు రావడం అనేది ప్రస్తుత కేంద్రపాలకులు అఖండులు, అజేయులు కాదనే సత్యాన్ని తిరుగులేనివిధంగా దేశంముందు నిలి పింది. ఇక కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రతిపక్షాల స్థానాన్ని మరింతగా బలోపేతం చేసింది. గత ఏడేళ్లుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశానికి ఈ తీర్పు తిరిగి ఊపిరి పోసినట్లయింది. ఇది మోదీ పాలన అంతానికి నాందీ వాచకం కానుంది.
కేంద్రపాలకుల పతనం మొదలు కావచ్చు. కానీ ఈ గొప్ప అవకాశానికి మనం ఎలా స్పందిస్తాం అన్నదాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ముందుగా ఈ తీర్పు దేనికి వ్యతిరేకమో గుర్తించడం చాలా అవసరం. ఈ తీర్పు మతతత్వ రాజకీయాలకు తిరస్కృతి కాదు. పైగా బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనతో ఉంటున్న ముస్లిం ఓటర్ల సమీకరణను లౌకిక రాజకీయాలకు సంకేతంగా చెప్పలేం. అలాగే కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అనేక తప్పులకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు కాదిది.
కేరళను మినహాయిస్తే స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల అంశంగా కాలేదు. పెద్దనోట్ల రద్దు ఉదంతంలో లాగే ప్రజలు తమ ఆర్థిక బాధల పర్యవసానాలకు కారణాలపై ఇంకా అనుసంధానం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాల అసమర్థతపై కూడా ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం అనేది వామపక్ష భావజాలం పట్ల విస్తృత ప్రజానీకం ఆమోదం అని చెప్పడానికి వీల్లేదు. అలాగే బీజేపీకి వ్యతిరేక ప్రచారంలో రైతు సంఘాలు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాల పట్ల రైతుల వ్యతిరేకతను కూడా ఈ తీర్పు పెద్దగా ప్రతిబింబించలేదు.
అయినా సరే.. ఈ అసాధారణ అవకాశాన్ని మనం వినయపూర్వకంగానే అంగీకరించాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చెందిన విజయగాధగా చెప్పడానికి వీల్లేని అనేకానేక రోజువారీ సంభవించే కారణాల ప్రతిఫలనంగానే బీజేపీ ప్రస్తుత తిరోగమనం సంభవించింది. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రులకున్న ప్రజాదరణ ఒక కీలకాంశంగా పనిచేసింది. కానీ ఇది సుపరిపాలనపై ప్రజాతీర్పు కాదు. అదే నిజమైతే తమిళనాడులో ఏఐడీఎంకే చిత్తుగా ఓడిపోవలసి ఉండాలి. అలాగే అస్సోంలో సోనోవాల్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. అలాగే మమతా బెనర్జీ పాలనా రికార్డుకూడా తగుమాత్రమే ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్‌లో, అస్సోంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ విజయానికి నిర్దిష్టమైన ఎన్నికల నిర్వహణే కీలకపాత్ర పోషించింది. ఈ అవకాశం ఎవరికి సంబంధించనిది అనే అర్థ సత్యాన్ని మనం బహిరంగంగా అంగీకరించాల్సిన సమయం ఇది. మమతా బెనర్జీ లేక ప్రశాంత్ కిషోర్, పినరయి విజయన్ లేక సీపీఎం, హేమంతా బిశ్వాస్ శర్మ లేదా సోనోవాల్.. ఇలా ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలు అనే అంశంపై చాలా మంది తామే కారణమని ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు పరాజితులెవ్వరు అనే విషయంపై రెండు అభిప్రాయాలు లేవు. అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్. రాహుల్ గాంధీ కేరళ నుంచి తొలిసారి ఎంపీ అయ్యాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కాంగ్రెస్ పోగొట్టుకోకూడదు. అలాగే ఏడాది క్రితం పౌరసత్వ సవరణ చట్టంపై భారీ స్థాయి నిరసనలు చెలరేగిన అస్సాంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ రానివ్వకుండా ఉండాల్సింది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయింది. బెంగాల్‌లో ఊసులేకుండా పోయింది. ప్రజా తీర్పు సందేశం అత్యంత స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం వహించలేదు.
మోదీ అజేయత్వానికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పదే పదే తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. కానీ రాష్ట్రాల స్థాయిల్లో వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తి జాతీయ వ్యాప్త సెంటిమెంట్‌గా మారడంలో వైఫల్యం చోటు చేసుకుంటోంది. ఈసారి తీర్పు మాత్రం భిన్నమైంది. ప్రతిపక్షాలకు ఇది ఒక మార్గాన్ని చూపింది. 2022 మొదట్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ఇలాగే సాగితే మోదీ పాలన ముగింపునకు అది ప్రారంభం కాగలదు. మోదీ పరాజయం పొందవచ్చు. కానీ అది కాంగ్రెస్ చేత కాదు. మోదీ పట్ల పచ్చి వ్యతిరేకత వల్ల కూడా కాకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఒక అవకాశం ఉంది. ఒక సవాలు కూడా ఉంది.
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ ఇండియా సంస్థాపకులు
Comments
Please login to add a commentAdd a comment