ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధించేందుకు 30 వేల మంది వాలంటీర్లను రంగంలోకి దించామని
సింగపూర్: ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధించేందుకు 30 వేల మంది వాలంటీర్లను రంగంలోకి దించామని ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఢిల్లీలో తాము తిరోగమనం చెందిన మాట వాస్తవమేనని అన్నారు. అది తీవ్రమైన ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ముందుగా కోలుకోవాలన్నది తమ ప్రణాళిక అని యాదవ్ చెప్పారు. సింగపూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన ఐఐఎంప్యాక్ట్2014లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన యోగేంద్ర యాదవ్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని పునర్వ్యవస్థీకరించామని, 30వేల మంది వాలంటీర్లను భర్తీ చేసుకున్నామని పార్టీ ప్రధాన ప్రతినిధి కూడా అయిన యాదవ్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు 36కన్నా అధికంగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిత్యం ప్రజలమధ్యే ఉంటున్నారని, మొహల్లా సభల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల అభివృద్ధి పథకాల ద్వారా ఫ్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
గత ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 20 శాతం మేరకు ఓట్లను అధికంగా పొందినట్లు ఓ రాజకీయ పరిశీలకుడు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ఐదేళ్లలో జాతీయ పార్టీగా ఎదిగేందుకు కిందిస్థాయి నుంచి కృషి చేస్తామని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కోసం తామొక స్పష్టమైన మార్గదర్శక ప్రణాళికను రూపొందించుకున్నామని సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌తో పాటు అదనంగా మరో నాలుగైదు రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకుంటామని, ప్రత్యామ్నాయంగా రూపొందుతామని యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి దేశవ్యాప్తంగా లక్ష మంది వాలంటీర్ల మద్దతు ఉందని చెప్పారు.