గాంధీనగర్: గుజరాత్‌లో అధికార బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుపై కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మరునాడే దీనిపై స్పందించారు. యూసీసీని దేశవ్యాప్తంగా కాకుండా గుజరాత్‌లోనే అమలు చేస్తామని చెప్పడంలో బీజేపీ ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు గిమ్మిక్కుగా దీన్ని అభివర్ణించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే ప్రశ్నలేవనెత్తారు. యూసీసీని అమలు చేయాలనుకుంటే దేశవాప్తంగా తీసుకురావాలన్నారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ఇలాగే హడావిడి చేసిందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. యూసీసీ అమలుకు కమిటీని ఏర్పాటు చేసిందని, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే అదే అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు.
ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని భావిస్తున్న కేజ్రీవాల్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ పర్యటనలకు వెళ్తున్నారు. ఆదివారం కూడా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి భావ్‌నగర్, రాజ్‌కోట్ జిల్లాల్లో ర్యాలీల్లో పాల్గొననున్నారు.
చదవండి: శాసనసభ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment