అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్. గుజరాత్ రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచి ఈ రెండు పార్టీల మధ్యే పోటీ. ఈసారి మాత్రం కొత్తగా ఆప్ ఎన్నికల బరిలో దూకి తొడగొడుతోంది. గుజరాత్ మరో పంజాబ్ కానుందని ఎలుగెత్తి చాటుతోంది. ఆప్‌కు అంత సత్తా ఉందా? బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలేమిటి?
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రాజకీయం బాగా వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోరే రివాజుగా వస్తుండగా ఆప్ రంగప్రవేశంతో తొలిసారిగా త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. ఆప్‌కు లభించే ఆదరణ, అది ఎవరి ఓట్లను చీలుస్తుందన్న దానిపైనే పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. 2017లో తొలి ప్రయత్నంలో ఒక్క సీటూ గెలవకపోయినా గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆప్ బాగానే బలపడింది. గతేడాది మున్సిపల్ ఎన్నికల్లో సూరత్‌లో 27 స్థానాలు గెలిచి బోణీ కొట్టింది.
ఢిల్లీ, పంజాబ్ మాదిరిగా గుజరాత్‌లోనూ పాగా వేయాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పట్టుదలగా ఉన్నారు. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నాయకుడిగా మారొచ్చని భావిస్తున్నారు. ఒక్క జూలైలోనే తన డిప్యూటీ మనీశ్ సిసోడియాతో కలిసి ఐదుసార్లు గుజరాత్‌లో పర్యటించి రాజకీయ వేడి పెంచారు. ఢిల్లీ, పంజాబ్ మోడళ్లను కలగలిపి ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, 300 యూనిట్ల విద్యుత్ వంటి పలు హామీలిచ్చారు. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్థుల జాబితా విడుదల చేసి దూకుడు ప్రదర్శించారు. మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కేజ్రివాల్ వ్యూహాత్మకంగా బీజేపీ వ్యతిరేక ఓటుపైనే దృష్టి పెట్టకుండా తమ విధానాల పట్ల మొగ్గేలా పలు వర్గాలను లక్ష్యంగా చేసుకొని సొంత ఓటు బ్యాంకు తయారు చేసుకునే పనిలో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఓటర్లను ఆకర్షించే ఆప్ వ్యూహాలు
పట్టణ ఓటర్లతో పాటు పలు వర్గాలు ఆప్‌కు మద్దతుగా ఉన్నట్టు ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో తేలింది. అందుకే గుజరాత్‌లో ఆప్ మహిళలు, దళితులు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు వంటి ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. 48 శాతమున్న మహిళా ఓటర్లను ఆకర్షించడానికి 18 ఏళ్లు దాటిన అమ్మాయిలకు నెలకు రూ.1,000 అలవెన్స్ ప్రకటించింది. 16% ఆదివాసీ జనాభాపై కన్నేసి భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ)తో చేతులు కలిపింది. పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం, గిరిజన వర్సిటీల స్థాపన వంటి హామీలిచ్చింది. గుజరాత్‌లో బడా పారిశ్రామికవేత్తలంతా బీజేపీవైపే. అందుకే కేజ్రీవాల్ చిరు వ్యాపారులపై దృష్టి పెట్టారు. 10 రోజుల్లోనే వారితో మూడుసార్లు భేటీ అయ్యారు. వ్యాట్ రిబేట్లు, జీఎస్టీ సరళీకరణ, అవినీతి నిర్మూలన వంటి హామీలిచ్చారు.
కష్టాల కాంగ్రెస్
ఇక కాంగ్రెస్‌ను అనేకానేక కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో 1995 నుంచి ఇప్పటిదాకా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 2017లో మాత్రం పటీదార్ల రిజర్వేషన్ ఉద్యమంతో కాస్త లాభపడింది. 77 స్థానాలు గెలిచి గట్టి ప్రతిపక్షంగా అవతరించింది. కానీ ఐదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇంటి పోరు ముదిరింది. దాంతో 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. మరో 10 మంది గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రచారంలోనూ కాంగ్రెస్ వెనకబడింది. సెప్టెంబర్ 5 నుంచి బరిలో దిగనుంది. రాష్ట్రానికి చెందిన దిగ్గజ నాయకుడు అహ్మద్ పటేల్ లేకుండా కాంగ్రెస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.
బీజేపీకి సవాలే..
గుజరాత్‌లో బీజేపీ 27 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగానే కన్పిస్తోంది. ఎన్నికల గణాంకాలూ అదే చెబుతున్నాయి. మొత్తం 182 అసెంబ్లీలో స్థానాల్లో బీజేపీ 2002లో 127 స్థానాల్లో నెగ్గితే 2007లో 117, 2012లో 116 స్థానాల్లో గెలిచింది. 2017 ఎన్నికల్లో 99కి తగ్గింది. మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో బీజేపీకి గుజరాత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ ప్రధాన బలమైన పట్టణ ఓటర్లను ఆప్ కొల్లగొడుతుందన్న అంచనాలున్నాయి. దాంతో 9 నెలల కింద సీఎంగా భూపేంద్ర పటేల్‌ను బీజేపీ పీఠమెక్కించింది. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఆర్‌సీ పటేల్‌ను ఎంపిక చేసింది. సంస్థాగతంగా పలు మార్పులు చేసింది. 12 శాతమున్న పటీదార్ల ఓట్లను ఆకర్షించడానికి హార్దిక్ పటేల్‌ను అక్కున చేర్చుకుంది. రెణ్నెల్ల కింద ఇద్దరు దళిత నాయకులకు మంత్రి పదవులిచ్చింది. గత మార్చిలో యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ కనీసం 10 సార్లు గుజరాత్‌లో పర్యటించారు. ప్రతిసారీ వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment