గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యంగా ఎప్పుడూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండేది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో నిలుస్తుండడంతో త్రిముఖ పోరు తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా శాసించిన కాంగ్రెస్ హస్త వాసి ఈసారైనా కలిసోస్తుందా? 1995 నుంచి వరుసగా 6 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారన్ని బీజేపీకి వదిలేసింది. వరుస ఓటములకు బ్రేకులేస్తూ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవాలని చూస్తోన్న కాంగ్రెస్ కల నెరవేరుతుందా? గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరోహోరీగా పోరాడింది కాంగ్రెస్. 182 సీట్లలో 77 స్థానాలు గెలవగా.. బీజేపీకి 99 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి గుజరాత్‌ను దక్కించుకోవడం అంత సులభమేమీ కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రూపంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది.
కాంగ్రెస్ బలాలు..
► కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. థాకూర్, కోలి వంటి ఓబీసీ కమ్యూనిటీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ వైపే ఉన్నారు.
► వరుసగా ఆరుసార్లు ఓటమిపాలైనప్పటికీ.. తన 40 శాతం ఓటింగ్ షేర్‌ను కొనసాగిస్తూ వస్తోంది.
► క్షత్రియ, హరిజన్, ఆదవాసీ, ముస్లీం ఓట్లపై ప్రధానంగా దృష్టిసారిస్తే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది.
బలహీనతలు..
► గుజరాత్‌లో కాంగ్రెస్‌కు రాష్ట్ర స్థాయి నేతలు లేకపోవటం పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
► రాష్ట్ర నాయకత్వంలో గ్రూపులు, అంతర్గత కలహాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
► రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుపొందని 66 అర్బణ్, సెమీ అర్బణ్ స్థానాలు కీలంగా మారాయి.
► రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కేంద్ర నాయకత్వం నిమగ్నమైన నేపథ్యంలో రాష్ట్రంలో నేతలను కాపాడుకునేందుకే గుజరాత్‌కు చెందిన క్యాడర్ ఇబ్బందులు పడుతోంది.
► గత 10 ఏళ్లలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అందులో కీలమైన పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
► బీజేపీకి విజయాలు సాధించి పెడుతున్న ‘మోడీ’ ఫ్యాక్టర్ సైతం మరోమారు ప్రభావం చూపితే బీజేపీ ముందంజలో ఉండనుంది.
అవకాశాలు..
► 2002 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూసుకుంటే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తుండటం కాస్త ఊరటకలిగించే అంశం.
► ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముమ్మర ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ పార్టీ బీజేపీ అర్బణ్ ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.
► గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రమంలో కలిసొస్తుందని నేతలు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022 Schedule: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment