Vote bank
-
ముస్లింల గడ్డపై బీజేపీ జెండా.. లాలు, అఖిలేష్ రాజకీయాలకు అడ్డుకట్ట?
లక్నో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గల రామ్‌గఢ్, యూపీలోని మొరాదాబాద్ జిల్లాలోని కుందర్కి సీటు ఒక ప్రత్యేకతను దక్కించుకున్నాయి. ముస్లింల ప్రాబల్యం కలిగిన ఈ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది.ఈ పరిణామంపై పలువురు రాజకీయ నిపుణులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇది దేశంలో మారుతున్న ఓటర్ల సెంటిమెంట్‌ను తెలియజేసే విజయమని వారంటున్నారు. అలాగే రానున్న కాలంలో ఎన్నికల రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు. రామ్‌గఢ్ సీటు మేవాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా అత్యధికం. అలాగే పంజాబీ, రాజ్‌పుత్, బనియా, సిక్కు, ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలన్నీ హిందూ-ముస్లిం వాదనపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక కుందర్కి కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇక్కడ జనాభాలో 60 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ సీటును చివరిసారిగా 1993లో బీజేపీ గెలుచుకుంది. ముస్లిం మహిళల్లో గణనీయమైన వర్గం బీజేపీకి ఓటు వేస్తున్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి.దేశ రాజకీయాల్లో అఖిలేష్ యాదవ్, లాలూ యాదవ్, మమతా బెనర్జీలు తమ తమ రాష్ట్రాల్లోని ముస్లిం ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు నేతలు ఉంటున్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా అధికంగానే ఉంది. కాగా యూపీ, బీహార్‌లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల పార్టీలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల రాజకీయాలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. మైనారిటీ ఆధిపత్య స్థానాలపై బీజేపీ సాధించిన విజయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో అఖిలేష్, లాలూల రాజకీయాలకు తాళం పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
‘ఓట్ బ్యాంక్’ నుంచి ‘ఓట్ ట్రాన్స్ఫర్’ వరకూ...
తాజాగా ముగిసిన 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కొన్ని మౌలిక అంశాలు అనివార్యంగా చర్చకు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఇటీవల యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ మాజీ డిప్యుటీ రిజిస్ట్రార్ జనరల్ ఎన్ రామారావు రాసిన వ్యాసాన్ని ఇక్కడ ప్రస్తావించడం ఎంతైనా అవసరం. ‘‘మనదేశంలో 2011 జనగణన తర్వాత మళ్ళీ పదేళ్ళకు 2021లో అది జరగాల్సి ఉంది. కానీ అది వాయిదా పడడంతో, మన అన్ని అవసరాలకు పాత జనాభా లెక్కల మీద ఆధారపడాల్సి వస్తున్నది. అందువల్ల సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి’’ అంటున్నారు. గతంలో వీరు ‘సెన్సెస్ అండ్ ట్యాబ్యులేషన్’ విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఇంకా ఆయన– ‘‘ఇటీవల బడ్జెట్లో ఇందుకు కేటాయించిన నిధులను చూసినప్పుడు, ఇవి ఎప్పుడు జరుగుతాయో అనే అనుమానాలనే కలిగిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఇంకా జాప్యం అంటే మాత్రం, అది ప్రమాదం అవుతుంది’’ అంటున్నారు. తాజా గణాంకాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి, అనే ఆవేదనలో మరో మాటకు తావులేదు, అది నిజం. అయితే, 2019–2024 మధ్య రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని అధిగమించి మరీ సంక్షేమ పథకాలను అమలుపరచి రికార్డు సృష్టించింది. ఎలా అంటే అది– ‘సంతృప్త స్థాయి’ని ప్రాతిపదిక చేసుకుని అటువంటి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇందులో మళ్ళీ లబ్ధిదారుల ఎంపిక అనేది లేకుండా, అర్హులైన అందరికీ... అనేది ప్రాతిపదిక కావడంతో, ఏ స్థాయిలోనూ ‘మేనేజ్’ చేయడం అనే అవసరం పంచాయతీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకూ ఎక్కడా రాలేదు.పథకం ఏదైనా అర్హత ఉంటే చాలు అని అందరికీ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు మళ్ళీ పాత పద్ధతిలో గతంలో మాదిరిగా– ‘ఎస్సీ కార్పొరేషన్’ లను ప్రారంభించాలి, అంటూ తిరుపతిలో అందోళన చేసినట్టుగా జులై చివరిలో వార్తలు వచ్చాయి. ఈ కార్పొరేషన్లు లేకపోవడం వల్లనే ఎస్సీ లకు సంక్షేమ పథకాలు అందడం లేదు, అనే వాదనను ఆ పార్టీ తెరపైకి తెస్తున్నది. రాష్ట్రాల్లో ‘ఈ– గవర్నెన్స్’ నడుస్తున్నకాలంలో దేశానికి ‘కంప్యూటర్లను’ పరిచయం చేసిన పార్టీ 2024లో చెయ్యాల్సిన డిమాండ్ ఎంతమాత్రం కాదిది. అయినా సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు విషయంలో దేశానికి ఒక కొత్త– ‘సిలబస్’ ఇచ్చిన వైఎస్సార్సీపీ నమూనా దేశమంతా ఏదో ఒక రూపంలో చలామణిలోకి వచ్చాక, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకువెళ్ళడం గురించి ఎవరు మాట్లాడినా అది పేలవంగా తేలిపోతుంది. దాన్ని కొనసాగించలేక, ఆ విషయం నేరుగా ప్రకటించలేక, ఏపీలో ఎన్డీఏ కూటమి పడుతున్న ఆపసోపాలు బహిరంగమైన పరిస్థితుల్లో, కాంగ్రెస్ వంటి పార్టీల ఉనికి పోరాటానికి– ‘ఎస్సీ కార్పొరేషన్లు కావాలి...’ వంటి దేశవాళీ ‘డిమాండ్లు’ ఆ పార్టీలకు రాజకీయంగా పనికిరావొచ్చు. అయితే, ఈ సందర్భంగానే– 2024 ఎన్నికల్లో ‘దళిత్ వోట్’పై ‘లోక్ నీతి’–‘సీఎస్డీఎస్’ కో డైరెక్టర్ ప్రొ‘‘ సంజయ్ కుమార్ బృందం చేసిన విశ్లేషణను గమనించడం ఎంతైనా అవసరం. ఎన్నికలు అనేసరికి ఒకప్పుడు ‘ఓటు బ్యాంక్’ అనే స్థిమిత స్థితి ఉండడం మనకు తెలుసు. అయితే, ఇప్పుడు ఆ స్థానంలోకి ‘ఓటు ట్రాన్స్ఫర్’ అనే అనిశ్చిత స్థితి రావడంతో– ‘లిక్విడ్ పాలిటిక్స్’ (ద్రవ రాజకీయాలు) అనే సరికొత్త రూపాన్ని మన రాజకీయాలు తీసుకుంటున్నాయి. చంద్రబాబు ఒకేసారి రెండు భిన్నమైన రాజకీయ కూటములతో మైత్రి కొనసాగిస్తూ ఈ తరహా ‘ద్రవ రాజకీయాలకు’ దేశంలోనే ఎత్తైన ప్రతినిధిగా నిలుస్తారు. ఇప్పుడు క్రమంగా ప్రజలు కూడా కొందరు నాయకులు అనుసరిస్తున్న ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రొ‘‘సంజయ్ కుమార్ బృందం చేసిన విశ్లేషణలో మనకు కనిపి స్తున్నది అదే. ఆంధ్రప్రదేశ్‌లో దళిత్ ఓటు వైఎస్సార్సీపీ– తెలుగు దేశం పార్టీ మధ్య సమానంగా చీలిందంటారాయన. ఇక్కడ 48 శాతం టీడీపీకి పడితే, 50 శాతం వైఎస్సార్సీపీకి, కేవలం 2 శాతం కాంగ్రెస్‌కు వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాలు 2014 తర్వాత అక్క ణ్ణించి పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైపుకు బదిలీ అయితే, 2024లో తిరిగి కొంతమేర అవి టీడీపీకి బదిలీ అయ్యి చివరికి అది గెలిచింది. రాబోయే ఐదేళ్ళు వైఎస్సార్సీపీ చేయబోయే రాజకీయాలకు దానికి మిగిలిన నైతిక బలం దానికొచ్చిన 40 శాతం ఓట్లు అయితే, అందులోని 50 శాతం ‘దళిత్ ఓటు’ అయింది. టీడీపీకి బదిలీ అయిన 48 శాతం దళిత్ ఓటు, ఎన్ని కల హామీల అమలు వైఫల్యంతో ఎంత వేగంగా మళ్ళీ వెనక్కి వైఎస్సార్సీపీ వద్దకు వస్తుంది అనేదాన్నిబట్టి ఇకముందు జరగ బోయే రాజకీయాలు ఉంటాయి. -జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు ఏమైంది..?
ఏ పార్టీకైనా సొంతగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది. అందుకే ప్రతి పార్టీ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది. అధికారంలో ఉన్నపుడు తమకు అనుకూలంగా ఉన్నవర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయడం కూడా సహజమే.తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయిందా? అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మథనం మొదలైంది. ఇంతకీ బీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందా? లేదా? ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ పార్టీకి నిబద్దతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓట్ బ్యాంక్‌గా భావిస్తారు. అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుంది. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి..2014 తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ 23 ఏళ్ళుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది. కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు, రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది.గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 16.68 శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి. అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన 21 శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మళ్ళాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా..మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి. దీనికి కారణం బీఆర్ఎస్కు బలమైన, సుస్ధిర ఓటు బ్యాంక్ లేకపోవమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.గులాబి బాస్ కేసీఆర్‌కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై అవగాహన వుంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంక్‌గా మలచుకోవచ్చని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి తెలంగాణ సెంటిమెంట్‌ను అస్త్రంగా మలుచుకున్నారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో వున్న తెలంగాణ పేటెంట్‌ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి.కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్‌గా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఏ ఒక్క సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ వాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా వుంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వారంతా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యారు.మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. -
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్డీఎస్ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు. -
Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
పాటలీపుత్ర/ఘాజీపూర్: విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విమర్శనా్రస్తాలు సంధించారు. విపక్ష కూటమి బానిసగా మిగిలిపోయిందని, ముస్లిం ఓటు బ్యాంక్‌ను సంతృప్తిపర్చడానికి ముజ్రా(వేడుకల్లో అతిథులను అలరించడానికి చేసే నృత్యం) చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటానని తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల జోలికి వస్తే సహించబోనని హెచ్చరించారు. శనివారం బిహార్‌లోని పాటలీపుత్ర, కారాకాట్, బక్సర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పొరుగు దేశాన్ని చూపించి మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడడం లేదని, పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని, అవినీతిని, నక్సలైట్ల హింసాకాండ అంతం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి బిహార్ కొత్త దిశను ఇచి్చందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు ‘‘పంజాబ్, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులో డీఎంకే నేతలు, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బిహార్ వలస కూలీలను దూషిస్తూ మాట్లాడారు. తద్వారా బిహారీలను కించపర్చారు. బిహారీలను అవమానిస్తే కనీసం నిరసన తెలిపే ధైర్యం ఆర్జేడీకి లేకుండాపోయింది. ఆర్జేడీ నాయకులకు లాంతర్ పట్టుకొని ముజ్రా డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఓటు జిహాద్‌కు పాల్పడుతున్నవారిపై విపక్షాలు ఆధారపడుతున్నాయి, వారి మద్దతు పొందుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చొక్కాలు చించేసుకుంటారు మన సైనికులు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పొందకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనికులకు మేలు జరిగింది. పనులు ఆలస్యం చేయడంతో, హక్కులు లాక్కోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. ‘ఇండియా’ కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష నాయకులు పరస్పరం చొక్కాలు చించేసుకుంటారు. ఎన్నికల్లో ఓటమికి రాజకుటుంబం(సోనియా గాంధీ కుటుంబం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేను బాధ్యుడిని చేస్తుంది. అనంతరం విదేశాలకు విహారానికి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి ఒక గాలిబుడగ. అది ఇప్పటికే పేలిపోయింది’’ అని ప్రధాని మోదీ తేలి్చచెప్పారు. -
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్‌ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ జోడో యాత్ర @ 100 రోజులు: మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి?
జైపూర్: భారత్ దక్షిణ కొన నుంచి ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ శుక్రవారం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. కన్యాకుమారినుంచి కశ్మీర్‌దాకా సాగే 3,500 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ యాత్రలో రాహుల్‌కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ఈ ప్రజాదరణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్ శాసనసభ ఎన్నికలు పార్టీకి మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. అయితే, యాత్ర ఫలితం వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసే అవకాశముంది. దీర్ఘకాలంలో చూస్తే యాత్ర.. పార్టీకి పూర్వవైభవాన్ని తెస్తుందని ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ ఝా విశ్లేషించారు. ‘ ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ మరోసారి క్షేత్రస్థాయిలో బలపడుతోంది. తన ఇమేజ్‌పై బీజేపీ కురిపిస్తున్న నకిలీ, తప్పుడు కథనాలను పటాపంచలు చేస్తూ కొత్త రాజకీయ బ్రాండ్‌గా రాహుల్‌గాంధీ ఎదుగుతున్నారు’ అని ఆయన అన్నారు. కాగా, యాత్రలో రాహుల్ ఆహార్యం, విమర్శలపై కాంగ్రెస్, బీజేపీ వాగ్భాణాలు సంధించుకున్నాయి. నెరిసిన గడ్డంతో ఇరాన్ నియంత సద్దాం హుస్సేన్‌లా ఉన్నాడంటూ రాహుల్‌పై బీజేపీ నేత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం, వివాదాస్పద క్రైస్తవ బోధకుడితో రాహుల్ భేటీ, పాదయాత్రకు కోట్లాది మంది ప్రజానీకం మద్దతు వంటి భిన్న అంశాలతో పాదయాత్ర ముందుకుసాగుతోంది. మోదీ మౌనం వెనక ఉద్దేశమేంటి? దౌసా: చైనా సైనికుల చొరబాటు యత్నంపై చర్చించకుండా మోదీ సర్కార్ తప్పించుకుంటోందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా ఆరోపించారు. రాజస్తాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా దౌసాలో మీడియాతో మాట్లాడారు. ‘చైనా అంశంలో ప్రధాని మోదీ మౌనం వెనుక ఉద్దేశమేంటి? ఒకవేళ మాట్లాడాల్సి వస్తే చైనాకు క్లీన్చిట్ ఇస్తారు. మోదీ గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చైనా మాండరీన్ భాషను ప్రవేశపెట్టాలనుకున్నారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగేలా జమ్మూకశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో స్మార్ట్‌మీటర్లు బిగించే బాధ్యత మోదీ ఒక చైనా కంపెనీకి కట్టబెట్టారు. గుజరాత్లో స్థానిక సంస్థలను కాదని చైనా కంపెనీలకు భూమి కేటాయించారు. పీఎం కేర్స్ ఫండ్‌కు చైనా కంపెనీలు విరాళాలు పంపాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే ’ అని అన్నారు. -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుందా?
గుజరాత్లో అధికార పీఠం కోసం మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎడాపెడా హామీలతో ప్రచార పర్వాన్ని ఇప్పటికే రక్తి కట్టించాయి. రేపు తొలి దశకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న రెండో, తుది దశ పోలింగ్‌తో అన్ని పార్టీల భవితవ్యమూ ఈవీఎంల్లోకి చేరనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వేటికవే గెలుపుపై ధీమా వెలిబుచ్చుతున్నా అంతర్గతంగా మాత్రం ఇప్పటికే లోతుగా విశ్లేషణల్లో మునిగిపోయాయి. మూడో పక్షంగా బరిలోకి దిగిన ఆప్ ఈసారి గట్టిగా ఉనికి చాటుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ గట్టిగా గండి కొట్టొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు...! గుజరాత్లో ఈసారి ఆప్ ఏకంగా 22 శాతం ఓట్లు సాధిస్తుందని సీఎస్డీఎస్ లోక్‌నీతి ఇటీవల చేసిన సర్వేలో తేలడం విశేషం! పరిస్థితులు కలిసొస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుందని కూడా సర్వేను పర్యవేక్షించిన భాను పర్మార్ అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్‌కు కచ్చితంగా ఆందోళనకర పరిణామమేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుంది. కనుక ఆప్ దెబ్బ గట్టిగా పడేది బహుశా కాంగ్రెస్ మీదే. అందుకే ఈసారి ఆ పార్టీకి నష్టం భారీగానే ఉండొచ్చు’’ అని విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ ప్రదర్శన ఈ అభిప్రాయాలను బలపరిచేదిగానే ఉంది. వాటిలో పార్టీకి 13.28 శాతం ఓట్లు దక్కాయి. సూరత్‌లో అదే జరిగింది... రాష్ట్రంలో సూరత్ ప్రాంతంలో ఆప్‌కు ఆదరణ బాగానే ఉంది. సూరత్ కార్పొరేషన్ ఎన్నికల్లో 120 సీట్లకు ఆప్ 27 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టింది కూడా! ఈ ప్రాంతంలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి 7 నుంచి 8 గెలుస్తామని ఆప్ నేత కేజ్రీవాల్ ధీమా చెబుతున్నారు. సూరత్‌తో పాటు సౌరాష్ట్ర ప్రాంతంపైనా ఆప్ గట్టిగానే దృష్టి సారించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి ఈసారి ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. వీరితో పాటు దశాబ్దాలుగా ఓడుతున్న కాంగ్రెస్ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ లాయలిస్టులు, బీజేపీపై ఆగ్రహంగా ఉన్న వర్గాల ఓట్లు కూడా రాబట్టగలిగితే ఆప్ అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకుడు ధవల్ వాస్వాడా అభిప్రాయపడ్డారు. ‘‘దీనికి తోడు గ్రామీణ గుజరాత్ ఓటర్లు బీజేపీ కంటే కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఆప్ వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది! పట్టణ ప్రాంతాల్లో యువత, విద్యాధికుల్లో పార్టీకి ఎటూ ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. అది అదనపు లాభంగా కలిసొస్తుంది’’ అని ఆయన విశ్లేషించారు. తొలి దశ ప్రచారానికి తెర 89 అసెంబ్లీ స్థానాలకు రేపే పోలింగ్ అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభకు సంబంధించిన తొలి దశ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం ముగిసింది. తొలి దశలో దక్షిణ గుజరాత్, కచ్–సౌరాష్ట్ర పరిధిలోని 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉండగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దూకి త్రిముఖపోరుగా మార్చేసింది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏసుదాన్ గడవీ పోటీ చేస్తున్న దేవభూమి ద్వారాక జిల్లాలోని ఖంభాలియా నియోజకవర్గంలో సైతం తొలి దఫాలోనే పోలింగ్ జరగనుంది. డిసెంబర్ ఒకటో తేదీన పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పురుషోత్తం సోలంకీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన కున్వర్జీ బవలియా, మోర్బీ ‘హీరో’ కాంతీలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా, గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా తదతరులూ తొలి దఫాలోనే అదృష్టం పరీక్షించుకోనున్నారు. 89 మంది బీజేపీ, 89 మంది కాంగ్రెస్, 88 మంది ఆప్ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ తొమ్మిది మంది, కాంగ్రెస్ ఆరుగురు, ఆప్ ఐదుగురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 718 మంది పురుషులు, 70 మంది మహిళలున్నారు. 2,39,76,670 మంది ఓటేయనున్నారు. 9 వేలకుపైగా పట్టణ ప్రాంతాల్లో, 16వేలకుపైగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Polls: వరుసగా ఆరుసార్లు ప్రతిపక్షంలోనే.. ‘కాంగ్రెస్’ పరిస్థితేమిటి?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ముఖ్యంగా ఎప్పుడూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉండేది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో నిలుస్తుండడంతో త్రిముఖ పోరు తప్పదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా శాసించిన కాంగ్రెస్ హస్త వాసి ఈసారైనా కలిసోస్తుందా? 1995 నుంచి వరుసగా 6 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారన్ని బీజేపీకి వదిలేసింది. వరుస ఓటములకు బ్రేకులేస్తూ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవాలని చూస్తోన్న కాంగ్రెస్ కల నెరవేరుతుందా? గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరోహోరీగా పోరాడింది కాంగ్రెస్. 182 సీట్లలో 77 స్థానాలు గెలవగా.. బీజేపీకి 99 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి గుజరాత్‌ను దక్కించుకోవడం అంత సులభమేమీ కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రూపంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. కాంగ్రెస్ బలాలు.. ► కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు నుంచి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. థాకూర్, కోలి వంటి ఓబీసీ కమ్యూనిటీలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ వైపే ఉన్నారు. ► వరుసగా ఆరుసార్లు ఓటమిపాలైనప్పటికీ.. తన 40 శాతం ఓటింగ్ షేర్‌ను కొనసాగిస్తూ వస్తోంది. ► క్షత్రియ, హరిజన్, ఆదవాసీ, ముస్లీం ఓట్లపై ప్రధానంగా దృష్టిసారిస్తే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది. బలహీనతలు.. ► గుజరాత్లో కాంగ్రెస్‌కు రాష్ట్ర స్థాయి నేతలు లేకపోవటం పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ► రాష్ట్ర నాయకత్వంలో గ్రూపులు, అంతర్గత కలహాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ గెలుపొందని 66 అర్బణ్, సెమీ అర్బణ్ స్థానాలు కీలంగా మారాయి. ► రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కేంద్ర నాయకత్వం నిమగ్నమైన నేపథ్యంలో రాష్ట్రంలో నేతలను కాపాడుకునేందుకే గుజరాత్‌కు చెందిన క్యాడర్ ఇబ్బందులు పడుతోంది. ► గత 10 ఏళ్లలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అందులో కీలమైన పటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్, 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ► బీజేపీకి విజయాలు సాధించి పెడుతున్న ‘మోడీ’ ఫ్యాక్టర్ సైతం మరోమారు ప్రభావం చూపితే బీజేపీ ముందంజలో ఉండనుంది. అవకాశాలు.. ► 2002 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూసుకుంటే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తుండటం కాస్త ఊరటకలిగించే అంశం. ► ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముమ్మర ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ పార్టీ బీజేపీ అర్బణ్ ఓటు బ్యాంకును కొల్లగొట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ► గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన క్రమంలో కలిసొస్తుందని నేతలు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Gujarat Assembly Elections 2022 Schedule: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల -
దళితుల చేతిలోనే.. పంజాబ్ అధికార దండం
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా పంజాబ్‌లో అత్యధికంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. కానీ వీరి చేతిలో 2.3 శాతం భూమి మాత్రమే ఉండటం గమనార్హం. ఛండీఘడ్: పంజాబ్‌లో రాజకీయం పంచముఖ పోరుగా మారడం, కాంగ్రెస్‌కు మారుపేరుగా నిలిచిన కెప్టెన్ అమరీందర్‌సింగ్ హస్తం పార్టీకి గుడ్‌బై కొట్టి... బీజేపీతో జట్టుకట్టడంతో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మరోవైపు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకున్న శిరోమణి అకాలీదళ్–కొత్తగా మాయావతి పార్టీ బీఎస్పీతో పొత్తపెట్టుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ... దళిత ఎమ్మెల్యే హర్బాల్ సింగ్ (దిర్బా నియోజకవర్గం)ను అసెంబీల్లో ఆప్ పక్ష నేతగా నియమించడం... ఇలా ఇప్పుడు పంజాబ్ రాజకీయమంతా దళితుల చుట్టూనే తిరుగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే... పంజాబ్ రాజకీయాల్లో జాట్ సిక్కులదే ఆధిపత్యమైనప్పటికీ... ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర జనాభాలోని 60 శాతం సిక్కుల్లో జాట్ల వాటా 21 శాతమే అయినప్పటికీ అదే ఆధిపత్య వర్గం. రాజకీయ నాయకత్వమంతా దశాబ్దాలుగా ఈ వర్గం చేతిలోనే కేంద్రీకృతమవుతోంది. ఆయా పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు దళితుల ఓట్లు తోడైతేనే ఏ పార్టీ అయినా ప్రస్తుతం పంజాబ్ సీఎం పీఠాన్ని అందుకోగలుగుతుంది. ఎందుకంటే పంజాబ్ జనాభాలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 32 శాతం మంది దళిత ఓటర్లు ఉన్నారు. మూడింటి ఒకవంతున్న దళిత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయపక్షాలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 10 నెలల కిందటే మొదలుపెట్టిన బీజేపీ మూడు నూతన వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దీర్ఘకాలిక భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయేను వీడటంతోనే కమలదళం అప్రమత్తమైంది. ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో (ఫిబ్రవరి 20న జరగనున్నాయి) తాము గెలిస్తే దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని గత ఏప్రిల్‌లోనే ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ వర్గంలో కొత్త ఆశలు రేకెత్తించింది. అమరీందర్ సింగ్– సిద్ధూల మధ్య గొడవ తలకుమించిన భారం కావడంతో కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబరులో తెగించేసింది. జాట్ సిక్కు అయిన కెప్టెన్ అమరీందర్ స్థానంలో రవిదాసియా వర్గానికి చెందిన దళితుడైన చరణ్‌జిత్‌సింగ్ చన్నీని సీఎంగా నియమించి అందరికంటే ముందుగానే దళిత ఛాంపియన్ అనిపించుకునే ప్రయత్నం చేసింది. గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని... ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న కాకుండా మరో ఆరురోజులు ముందుకు జరిపి ఈ నెల 20 నిర్వహించాలని పంజాబ్ సీఎం చన్నీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయపక్షాలన్నీ ఆయన డిమాండ్‌కే మద్దతు పలకడంతో ఈసీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ చర్య దళితుల్లో చన్నీ గ్రాఫ్‌ను అమాంతంగా పెంచేసిందని రాజకీయ పండితులు విశ్లేషణ. అయితే అధికార వ్యతిరేకతను అధగమించడం, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కొట్టే సిక్సర్లను తట్టుకోవడం లాంటి పనులతోనే పాపం చన్నీ బిజీగా గడపాల్సి వస్తోంది. దళితుల్లోనూ మళ్లీ రెండు వర్గాలు పంజాబ్‌లోని దళితుల్లో... హిందు దళితులు, సిక్కు దళితులుగా రెండు వర్గాలున్నాయి. హిందు దళితుల శాతం ఎప్పటికప్పుడు మారుతూ ఉండటానికి కారణం... వీరిలో చాలా మంది సిక్కు మతంలోకి మారిపోవడం, రవిదాసియా, ఆది ధర్మిలు మాత్రం తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనే డిమాండ్లు వినిపిస్తున్నారు. 2018 సామాజిక సాధికార శాఖ గణాంకాల ప్రకారం పంజాబ్ దళితుల్లో మొత్తం 39 ఉపకులాలున్నాయి. వీటిలో ఐదు ప్రముఖమైనవి. రాష్ట్రంలోని 32 శాతం దళిత జానాభాలో వీటి వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. మజ్హబీ సిక్కులు అత్యధికంగా 30 శాతం ఉండగా... తర్వాత రవిదాసియాలు 24 శాతం మేరకు ఉంటారు. కాగా ఆది ధర్మీలు 11 శాతం ఉంటారు. ఇక ప్రాంతాల వారీగా చూస్తే... దౌబాలో 37 శాతం, మాల్వాలో 31 శాతం, మజ్హాలో 29 శాతం దళితులున్నారు. మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్‌లో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వు చేశారు. 2017లొ ఈ 34 స్థానాల్లో కాంగ్రెస్ ఏకంగా 21 నెగ్గగా, ఆప్ 9 సీట్లు గెల్చుకుంది. డేరాల ప్రభావం క్షీణించినట్లేనా! గతంలో దళిత ఓటర్లపై డేరా సచ్చా సౌదా (సమానత్వాన్ని ప్రబోధించే ధ్యాన కేంద్రా)ల ప్రభావం తీవ్రంగా ఉండేది. డేరాసచ్చా సౌదా అధిపతి రామ్‌రహీమ్ సింగ్ అత్యాచారం, హత్య కేసులో అరెస్టయి జైల్లో ఉండటంతో దళితులపై ఈ డేరాల ప్రభావం మునుపటి స్థాయిలో లేదు. 69 సీట్లున్న మాల్వా ప్రాంతంలో గత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ తీవ్రంగా దెబ్బతింది. అకాలీ దళిత ఓటు బ్యాంకు కాస్తా కాంగ్రెస్ బదిలీ అయింది. ఐక్యత లేదు.. పంజాబ్‌లో జనాభాలో దళితులు ఏకంగా 32 శాతం ఉన్నప్పటికీ... వారి మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఐక్యత లేకపోవడమే వీరిని దెబ్బతీస్తోంది. ఏదో ఒక ఆధ్యాత్మిక బోధకుడి సూక్తులకు కట్టుబడి ఉండకపోవడం, భిన్నమైన ఆచారాలు, సంస్కృతులు ఉండటం మూలంగా పంజాబ్ దళితుల్లో ఐక్యత లోపించి బీఎస్సీ ఇక్కడ దారుణంగా విఫలమైందని, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కనీసం ఒక్క సీటును కూడా గెలవకపోవడానికి ఇదే కారణమని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
Congress Party: ‘హుజురాబాద్’ ఫలితం.. 60 వేల నుంచి 3 వేలకు..
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఫలితం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో వాడివేడిగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సాగింది. సమావేశానికి కోమటిరెడ్డి, జగ్గారెడ్డి హాజరుకాలేదు. సమావేశం మధ్యలోనే జానారెడ్డి వెళ్లిపోయారు. రేవంత్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హుజురాబాద్ :1978 నుంచి కాంగ్రెస్‌కు నో చాన్స్.. హుజూరాబాద్‌లో పడిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ఘోర పరాభవాన్ని చవి చూపించింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాదాపు 30 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ మంగళవారం దారుణ పరాజయం పాలయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బల్మూరి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు (1.5 శాతం) మాత్రమే పోలయ్యాయి. కనీసం డిపాజిట్ దక్కించుకునేందుకు దరిదాపుల్లో కూడా లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలను నివ్వెర పరిచింది. శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సందర్భంగా సీనియర్లు చేసిన పలు వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసంతృప్తిని మరోసారి బహిర్గతం చేశాయి. చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్ చిచ్చు: ‘బల్మూర్ వెంకట్‌ని బలి పశువు చేశారు’ టీఆర్ఎస్, బీజేపీల నడుమ హోరాహోరీ అన్నట్టుగా సాగిన ఈ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాలు ఎవరికీ లేకున్నా గత ఎన్నికల్లో 60 వేల పైచిలుకు ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి కనీసం అందులో సగమైనా వస్తాయని భావించారు. కానీ పూర్తి నిరాశాజనకంగా కేవలం 3 వేల ఓట్లకు మాత్రమే పార్టీ పరిమితం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని రాజకీయ వర్గాలంటున్నాయి. దారుణ ఓటమికి కారణాలెన్నో.. ఇంతటి ఘోర పరాజయానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్థి ఎంపికలో విపరీత జాప్యం, కేడర్‌కు భరోసా ఇవ్వడంలో వైఫల్యం, మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, అసలు తాము పోటీలో ఉన్నామనే భావనను అక్కడి ఓటర్లలో కలిగించడంలో విఫలం కావడంతోనే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని పొందిందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారం పేరుతో గ్రామాలను చుట్టి వస్తుంటే పార్టీ నేతలు కనీసం హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడకుండా వేరే ప్రాంతాల్లో బహిరంగసభలు, సమావేశాలు పెట్టి కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో ఆయన ప్రభావం ఎక్కడా కనిపించలేదు. చిత్తుగా ఓటమిపై రచ్చ ఉప ఎన్నికలో పార్టీ ఘోర వైఫల్యంపై సీనియర్ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. మంగళవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక, సాగర్‌లలో పనిచేసినట్టు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పనిచేయలేదనిఅన్నారు. ఈ ఎన్నికను రేవంత్ వదిలేశారని విమర్శించారు. ఉప ఎన్నికపై పార్టీ అధిష్టానానికి నివేదిక ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా టీఆర్ఎస్ ఓడిపోయినందుకు పండుగ చేసుకుందామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో బల్మూరిని బలిపశువుని చేశారని వ్యాఖ్యానించారు. రేవంత్, భట్టిలు కలిసి తీసుకున్న నిర్ణయం వర్కవుట్ కాలేదన్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై సీరియస్‌గా చర్చ ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ తీర్పు ఊహించినట్టుగానే వచ్చిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సి ఉందని చెప్పారు. -
ప్రగతిభవన్‌లో ద్రోహులు.. రోడ్డున ఉద్యమకారులు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ నల్లగొండ టూటౌన్: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంక్షేమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం పార్టీతో చెట్టపట్టాలేసుకుని ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులు రోడ్లపై ఉంటే, ఉద్యమద్రోహులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారని ధ్వజమెత్తారు. హన్మకొండ, నల్లగొండలో శనివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారాయని విమర్శించారు. సచివాలయానికి రావడం లేదంటే సచివాలయాన్నే కూల్చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఒక్క ఆసుపత్రి కట్టలేదని, కేసీఆర్ కట్టడు, కేంద్రం కడతామంటే సహకరించరని ఆరోపించారు. 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైల్వే ఓవర్ హాలింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. బీబీనగర్‌లోని మెడికల్ కాలేజీకి ప్రభుత్వం భూములను ఇవ్వలేదని, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను తెచ్చామని, దాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే అర్హతలేదని, ఇష్టారాజ్యంగా కొందరు మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. వరంగల్ మామునూరులో స్థలాన్ని ఇస్తే వెంటనే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్‌రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌లో ఉనికి కోల్పోయిన టీడీపీ
సాక్షి, వరంగల్: ఒకప్పుడు ఒంటిచేత్తో జిల్లాను ఏలిన రాజకీయ పార్టీలు క్రమంగా ప్రాభవం కోల్పోతున్నాయి. అధికార పీఠాలతో.. ప్రజా పోరాటాలతో ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత క్రమక్రమంగా పోటీకి దూరమవుతున్నాయి. జిల్లాలో 1984 నుంచి వరంగల్ పార్లమెంట్‌కు 11 పర్యాయాలు ఎన్నికలు జరిగితే.. టీడీపీ అభ్యర్థులు ఏడు సార్లు గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా పలువురు ఇతర పార్టీల్లోకి వెళ్లగా ఈ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను బరిలో దింపలేని పరిస్థితి నెలకొంది. 35 ఏళ్లుగా అనేక మంది నాయకులను అందించిన టీడీపీ ప్రస్తుతం పోటీ పడలేని పరిస్థితికి దిగజారి పోయింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమి చేయాలో తెలియక అంతర్మథనంలో పడ్డారు. వరంగల్ నుంచి ఏడు సార్లు 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ ఇక్కడ పాగా వేసింది. వరంగల్ పార్లమెంట్‌కు 1984 నుంచి 2015 వరకు ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఏడు పర్యాయాలు గెలుపొందారు. 1984లో తొలిసారి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ టి.కల్పనాదేవిని బరిలోకి దింపగా.. ఆమె కాంగ్రెస్ దిగ్గజం కమాలొద్దీన్ అహ్మద్‌పై ఘన విజయం సాధించింది. 1989, 1991 ఎన్నికలు మినహాయిస్తే 1996 నుంచి 1999 వరకు వచ్చిన మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ క్రమంలో కల్పనాదేవి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున 1998 ఎన్నికల్లో పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బోడకుంటి వెంకటేశ్వర్లు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన డాక్టర్ కల్పనపై గెలుపొందాడు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.రవీందర్‌నాయక్ టీడీపీ అభ్యర్థి బోడకుంటి వెంకటేశ్వర్లుపై గెలుపొందాడు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికలో ప్రస్తుత పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి.రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందాడు. అనంతరం మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2009లో ఉధృతం కాగా.. చంద్రబాబు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ‘యు’టర్న్ తీసుకోవడంతో ఆ పార్టీకి ఉద్యమాల ఖిల్లా వరంగల్‌లో పుట్టగతులు లేకుండా పోయాయి. 2009లో కాంగ్రెస్, 2014, 2015 ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. వరంగల్‌లో పూర్తిగా ఉనికి కోల్పోయిన టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉందిట. టీడీపీ తమ్ముళ్ల దారెటు? సంప్రదాయ ఓటింగ్‌పై సర్వత్రా చర్చ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైంది. చాలా మంది నాయకులు పార్టీ మారారు. అధిక శాతం మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ బరి నుంచి తప్పుకోవడంతో తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమితో కలిసి నడిచిన టీడీపీ ఆ తర్వాత ఇంకా పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ వైపు వెళ్తారా? లేదా తమ విచక్షణ మేరకు ఓటేస్తారా? అనే చర్చ మొదలైంది. గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న టీడీపీ ఓటర్లు తమకు సానుకూలంగానే ఉంటారనే భావన ఒక వైపు ఉన్నా.. ఇంకో వైపు చేజారవచ్చన్న గుబులు కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అటు పార్టీ అధిష్టానం టీడీపీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపకపోవడం.. ఇటు వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఓటేయడమో స్పష్టత ఇవ్వకపోవడంతో ఏమీ చేయాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ క్యాడర్ ఉంది. -
వెనుకబడిన కులాలకూ వెన్నుపోటు
సాక్షి, చీరాల (ప్రకాశం): బీసీలు ఎన్నికల్లో పోటీచేసేందుకు పనికిరారా? టీడీపీ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తోందా? జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా అవకాశం కల్పించకపోవడంతో ఆ పార్టీ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతపై సర్వత్రా చర్చ నడుస్తోంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు హయాంలో బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించి సీట్లు కేటాయించారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబునాయుడు లాగేసుకున్నప్పటి నుంచి పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. చివరకు అత్యధికంగా బీసీలు ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా బీసీలకు దక్కని దుస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ బీసీలది అని వల్లె వేసే చంద్రబాబు బెత్తెడు చోటు కూడా లేకుండా చేయడంపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్టీఆర్ హయాంలో జిల్లాకు చెందిన చిమాటా సాంబు, మారుబోయిన మాలకొండయ్య, పాలేటి రామారావు లాంటి యాదవ సామాజిక వర్గ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు. పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాక యాదవ సామాజికవర్గంపై చిన్నచూపు చూడటం మెదలుపెట్టారు. అందుకు 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా యాదవ సామాజికవర్గానికి కేటాయించకపోవడమే నిదర్శనం. ఓట్లు కావాలి.. కానీ సీట్లివ్వరా ? జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 17 లక్షల మంది బీసీలు ఉండగా వారిలో 4 లక్షల మందికి పైగా యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. జిల్లాలో కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, మార్కాపురం, చీరాల, ఒంగోలు నియోజవర్గాల్లో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే సామర్థ్యం వారికి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క యాదవ నేతకు కూడా రాజకీయ ప్రాధ్యాన్యత కల్పించకపోవడంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన తమను కరివేపాకులా తీసేయడం దారుణమని యాదవ సామాజికవర్గీయులు అంటున్నారు. బీసీలకు వెన్నుదన్నుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా యాదవులకు అన్ని జిల్లాలో సముచిత స్థానం కల్పించింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రాధాన్యత కల్పించింది. కనిగిరి నియోజకవర్గం నుంచి 2014తో పాటు 2019లో కూడా అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. గతంతో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా యాదవ సామాజికవర్గానికి చెందిన నూకసాని బాలాజీకి అవకాశం కల్పించింది. కానీ ఆయన టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలో చేరారు. బీసీలు బాబు వెంట లేరు చీరాల అసెంబ్లీ సీటు తమకే ఇవ్వాలని బీసీలు చంద్రబాబును కోరితే.. వారిని హెచ్చరిస్తూ ‘మూడుసార్లు బీసీలకు ఇస్తే మీరు గెలిచారా.. ఓసీలపై బీసీలను నిలబెడితే బీసీలు ఎలా గెలుస్తారు’ అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీసీలు టీడీపీ వైపు లేరని అర్థమవుతోంది. బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని కులాలకు న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కనిగిరి సీటును యాదవులకు కేటాయించడం బీసీలపై జగన్‌కు ఉన్న నమ్మకమన్నారు. – చిమటా సాంబు, మాజీ ఎంపీ జగన్ బీసీ డిక్లరేషన్‌పై నమ్మకముంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీలు అభివృద్ధి చెందుతారన్న విశ్వాసం కలుగుతోంది. బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లతో సబ్‌ప్లాన్ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. 139 కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానన్నారు. చిరు వ్యాపారులు, కులవృత్తిదారులకు వడ్డీలేని రుణం ఇస్తామన్న హామీ, రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో సగం కేటాయింపు ద్వారా బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం ఉంది. వైఎస్సార్‌లానే ఆయన కొడుకు జగన్ కూడా ఇచ్చిన మాట మీద నిలబడతాడని మేము నమ్ముతున్నాం. – కేవీఎస్ కొండయ్య, బీసీ సంఘం నాయకుడు, గిద్దలూరు ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్ వేశారు బీసీ కార్పొరేషన్‌కు తక్కువ నిధులు కేటాయించి అవి కూడా మంజూరు చేయలేదు. సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేటికీ అందించలేదు. కుల వృత్తిదారులకు వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఎన్నికల ముందు హడావుడి చేసి 5 శాతం మందికి మాత్రమే ఇచ్చారు. రూ.లక్ష సబ్సిడీ ఇవ్వాల్సిన స్థానంలో రూ.10 వేల వస్తువులు ఇచ్చి ఆదరణ పేరుతో బీసీలకు బిస్కెట్ వేసేందుకు ప్రయత్నించారు. బీసీల అభ్యన్నతిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. జిల్లాలో టీడీపీ బీసీలకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. – ఎన్.రవికుమార్‌యాదవ్, ఎంపీపీ, అర్ధవీడు -
ప్రతీ పైసా లబ్ధిదారుడికే
తాల్చేర్/ఝార్సుగూడ/జాంజగీర్–చంపా: కాంగ్రెస్ హయాంలో పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకుందని, ఇప్పుడు ప్రతీ పైసా పేదలకు అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దాదాపుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యంతో ముందుకు.. ‘నక్సలైట్లు, పేలుళ్లు, రక్తపాతానికి పేరుపడ్డ ఛత్తీస్‌గఢ్.. బీజేపీ హయాంలో అన్ని సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాల నడుమ స్థానాన్ని సంపాదించుకుంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు అందే నిధులు సక్రమంగా ఖర్చయ్యేవి కాదని, ఇప్పుడు ప్రతీ పైసా లబ్ధిదారుడికి చేరుతోందని అన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసమో లేదా ఓటు బ్యాంకు కోసమో పథకాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఓటు బ్యాంకు కోసం కాకుండా అందరి లబ్ధికే మా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 1607 కోట్లతో నిర్మించనున్న బిలాస్పూర్–పత్రపాలి రహదారికి, రూ. 1,697 కోట్లతో బిలాస్పూర్–అనుప్పుర్ మూడో రైల్వే లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి ఒడిశాలోని తాల్చేర్‌లో రూ.13 వేల కోట్ల ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘ఆయుష్మాన్ భారత్‌తో ఒడిశా ప్రజల్ని అనుసంధానం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద ప్రజలు పథకం లబ్ధిని కోల్పోతారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన పథకమే మెరుగైనదిగా పేర్కొంటూ ఆయుష్మాన్ భారత్‌లో ఒడిశా చేరలేదు. వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పర్సంటేజ్, కమిషన్ల రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఝార్సుగూడలో వీర్ సురేంద్ర సాయ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. డబ్బులివ్వకపోతే మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకే చేరడం లేదని విమర్శించారు. తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో బొగ్గు నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ ద్వారా వేపపూతతో కూడిన యూరియాను తయారుచేస్తారు. మోదీకి అరటి శాలువా జాంజగీర్ సభలో ప్రధాని మోదీకి స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు అరటి, అవిసె చెట్ల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన జాకెట్, శాలువాను బహూకరించారు. ఆ జాకెట్ ధరించే సభలో మోదీ ప్రసంగించారు. -
కర్షకులను మోసగించిన కాంగ్రెస్
మలౌత్(పంజాబ్): రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, దేశానికి వెన్నెముకలాంటి రైతులను ఆ పార్టీ ఓటు బ్యాంకులా చూసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల విధానాల కారణంగా రైతులు నిరాశ, నిరుత్సాహంతో జీవితాలను గడపాల్సి వచ్చేదని చెప్పారు. ‘గత కొన్నేళ్లుగా మీరు పెట్టిన పెట్టుబడికి 10 శాతం లాభమే ఎందుకు పొందుతున్నారో నాకు తెలుసు. దీని వెనుక ఉన్న విషయం ఏమిటో తెలుసు. రైతులు దేశానికి ఆత్మవంటి వారు. వారే మన అన్నదాతలు. అయితే కాంగ్రెస్ పార్టీ వారిని అన్నివేళలా మోసం చేసింది.రైతులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసింది’’అని చెప్పారు. బుధవారం పంజాబ్‌లోని మలౌత్‌లో నిర్వహించిన ఓ రైతు ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఇటీవల ఖరీఫ్ పంటలకు కేంద్రప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని పెంచిన నేపథ్యంలో బీజేపీ ఈ ర్యాలీచేపట్టింది. కిసాన్ కల్యాణ్ ర్యాలీ పేరిట నిర్వహించిన బహిరంగ సభకు హరియాణా సీఎం ఖట్టర్, పంజాబ్ మాజీ సీఎం బాదల్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్‌బాదల్ తదితరులు హాజరయ్యారు. నాలుగేళ్లుగా రికార్డు స్థాయి ఉత్పత్తి ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. గత నాలుగేళ్లుగా రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నారని, వారికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. వరి, గోధుమ, పత్తి, చెరకు, పప్పులు ఏ పంటలైనా గత రికార్డులను బద్ధలు కొడుతున్నాయన్నారు. తన ప్రసంగం సందర్భంగా కొన్ని మాటలను పంజాబీలో మాట్లాడి రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పంజాబీలు సరిహద్దుల్లో పోరాడుతున్నారని, పంజాబ్ దేశానికి స్ఫూర్తిని అందిస్తుందని చెప్పారు. రైతులు కోతలు పూర్తయిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టవద్దని సూచించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కోసం రూ.50 కోట్లు కేటాయించామని చెప్పారు. వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ కోసం యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. -
అప్పుడు బీజేపీని దెబ్బకొట్టినోళ్లే...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బీజేపీ మాత్రం అత్యధిక సీట్లను గెల్చుకుని హస్తానికి షాక్ ఇచ్చింది. బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ ముఖ్యభూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వేరుపడి సొంతకుంపట్లతో పార్టీని దెబ్బ కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కీలకంగా వ్యవహరించటం విశేషం. 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు స్థాపించుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారు. గత ఎన్నికల్లో యెడ్యూరప్ప పార్టీ కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) 9.8 శాతం ఓటింగ్‌తో ఆరు సీట్లు గెలుచుకోగా, శ్రీరాములు పార్టీ బదగర శ్రామిక రైతల కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. చివరకు బీజేపీ 20 శాతం ఓటింగ్‌తో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకుంది. యెడ్యూరప్ప, శ్రీరాములు దెబ్బకి బీజేపీకి లింగాయత్, గిరిజన తెగల ఓట్లు అప్పుడు దూరం అయ్యాయి. అంటే ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడి ఉంటే సీట్ల సంఖ్య పెరిగి ఉండేది. దీనికితోడు మిగతా ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలకు పోలైన ఓట్లు, అన్ని కలుపుకుని బీజేపీకిమళ్లి ఉండిఉంటే సీట్లు కనీసం 80 వరకు గెలుచుకుని ఉండేదని విశ్లేషకులు ఆనాడు అభిప్రాయపడ్డారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు శాతం పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ఈ ఇద్దరు దోహదపడ్డారు. లింగాయత్ వర్గానికి సిద్ధరామయ్య ఇచ్చిన హామీని అంతగా పట్టించుకోని ప్రజలు, యెడ్డీ వైపే మొగ్గు చూపగా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలు కావటం గమనార్హం. -
ఓటేయవచ్చు కానీ.. పోటీ చేయొద్దా?
యువతరం రాజకీయాల్లోకి రావాలి... అన్ని పార్టీల నాయకులు తరచూ చెప్పే మాట. ఆచరణకు వస్తే... యువతను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే... పాలనలో వారిని భాగస్వాములను చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు. మన దేశ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్లలోపు వారే. లోక్‌సభకు పోటీచేయాలంటే 25 ఏళ్లు నిండి ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 (బి) చెబుతోంది. ఓటు హక్కు వచ్చే వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు కుదించి ముప్పై ఏళ్లవుతోంది. ఎన్నికల్లో పోటీకి కనీస వయసును కుదించే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. హర్దిక్ పటేల్... గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని గత ఏడాది బలమైన ఉద్యమం నిర్మించారు. 6 కోట్ల గుజరాత్ జనాభాలో దాదాపు 12 శాతం ఉన్న పటేళ్లకు నేతగా ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టతో ముడిపడి ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్డె దింపుతానని సవాల్ చేస్తున్నారు. దానికోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. పటీదార్ల ఉద్యమనేతగా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ వయసు 24 ఏళ్లే. వచ్చే ఏడాది జులై 20తో అతనికి 25 ఏళ్లు నిండుతాయి. ఎన్నికల్లో పోటీచేసే అర్హత సాధిస్తాడు. అలాగే యూనివర్శిటీల్లో వివక్షపై, ప్రభుత్వ విధానాలపై ఎందరో యువ నేతలు బలమైన గళం వినిపిస్తున్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో దేశద్రోహం అభియోగాలను ఎదుర్కొన్న కన్హయ్య కుమార్, షెహ్లా రషీద్ లాంటి యువ నేతలు దేశం దృష్టిని ఆకర్షించారు. తమ వాక్పటిమ, రాజకీయ పరిపక్వతతో గుర్తింపు పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యువత గొంతువిప్పుతోంది. వాదిస్తోంది, నిరసిస్తోంది... అధికారంలో ఉన్నవారిని నిగ్గదీస్తోంది. ప్రశ్నిస్తోంది. సమాధానం కావాలంటోంది. లోపాలను ఎత్తిచూపుతోంది. అర్థవంతమైన చర్చలు చేస్తోంది. మరి వీరే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉంటే! యువ గళానికి ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాలు... పోటీ చేసే కనీస వయసును ఎప్పుడో కుదించాయి. కొన్నిదేశాల్లో అయితే 18 ఏళ్లకే పార్లమెంటులో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉంది. వివిధ దేశాల్లో అసెంబ్లీలకు, పార్లమెంటుకు పోటీచేసే కనీస వయసు ఎలా ఉందో చూద్దాం... ================================== దేశం దిగువసభ ఎగువసభ ================================== భారత్ 25 30 బ్రిటన్ 21 21 స్కాట్లాండ్ 16 - ఫ్రాన్స్ 18 24 ఇజ్రాయెల్ 21 - జర్మనీ 18 - ఆస్ట్రేలియా 18 18 ఇండోనేషియా 21 - అమెరికా 25 30 –ఫ్రాన్స్‌లో 18 ఏళ్లు నిండితే దేశాధ్యక్షుడు కూడా కావొచ్చు. – ఇరాన్లో 21 ఏళ్లు నిండితే అధ్యక్షపదవికి పోటీచేయొచ్చు. – 2014లో ఎన్నికైన భారత పదహారో లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 54 ఏళ్లు. – 30 ఏళ్ల లోపు వారు 12 మంది మాత్రమే పదహారో లోక్‌సభకు ఎన్నికయ్యారు. – గుజరాత్లో తొలిదశలో 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబరు 9న పోలింగ్ జరగనుంది. 2.12 కోట్ల మంది ఓటర్లు ఉండగా... ఇందులో 35 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే. అంటే తొలిదశ ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్లలో దాదాపు 17 శాతానికి ఎన్నికల్లో నిలబడే అర్హత లేదు. అంటే అంతశాతం మంది తరఫున గళం వినిపించే వారుండరు. దీన్ని ఎంతవరకు సబబు అనగలం? భారత్‌లోనూ ఎన్నికల్లో పోటీకి వయసును కుదించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడేళ్ల కిందటే డిమాండ్ చేసింది. వర్శిటీల్లోనూ ఈ మేరకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. 18 ఏళ్లు మరీ చిన్నవయసు అనుకుంటే... పోటీకి కనీస వయసు 20 లేదా 21 ఏళ్లుగా నిర్ణయించవచ్చు. 20 ఏళ్ల వయసులో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. టీనేజ్లోనే మలాలా నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. మరి భారతదేశ జనాభాలో 50 శాతం 25 ఏళ్లలోపు ఉన్నప్పుడు ఆ యువతకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ఉండాలి కదా. అభ్యర్థి గుణగణాలు, పరిపక్వతను ఓటర్లు బేరీజు వేసుకొని... బాగా పనిచేస్తాడనుకుంటేనే గెలిపిస్తారు. అభ్యర్థి యువకుడైనా తనను తాను రుజువు చేసుకొని ఉంటేనే ప్రజామోదం లభిస్తుంది కాబట్టి పోటీకి కనీస వయసును కుదించే అంశంపై ఎన్నికల కమిషన్, దేశంలోని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బడుగులను ఓటు బ్యాంకుగా చూస్తోంది
సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తోందని బీజేపీ అధ్య క్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ వర్గాల పురోభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికలకు ముందు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీనిచ్చి వీటి అమల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసుల్లో మార్పునకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ భిక్కునాథ్ నాయక్, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతా సాంబ మూర్తి, ఎస్.మల్లారెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్పీ వ్యూహం ‘దళిత్–ముస్లిం’
-
బీఎస్పీ వ్యూహం ‘దళిత్–ముస్లిం’
దాదాపు సగం సీట్లు ఆ వర్గాలకే.. లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధిక శాతం ఉన్న దళితులు, ముస్లింల ఓటు బ్యాంక్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా దాదాపు సగం సీట్లను ఆయా వర్గాలకు కేటాయించింది. 300 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. ఆదివారం మరో 101 స్థానాల్లో పోటీ చేసే వారి జాబితాను విడుదల చేసింది. ఇందు లోనూ 12 మంది ముస్లింలే కావడం గమ నార్హం. మిగిలిన రెండు స్థానాలను జనరల్ లేదా ఎస్టీలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 403 స్థానాల్లో 97 ముస్లింలకు, 87 దళితులకు కేటాయిం చారు. ముస్లిం ఓటర్లు 20% ఉండటం.. 2012లో వీరు ఎస్పీ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎస్పీలో రగడ నేపథ్యంలో ఇప్పుడు ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని బీఎస్పీ ఎత్తు వేస్తోంది. -
ముస్లింలు మనవాళ్లే!
♦ ఓటు బ్యాంకు కాదు: బీజేపీ జాతీయ మండలి ముగింపు సమావేశంలో ప్రధాని ♦ సిద్ధాంతమే బీజేపీకి బలమని ప్రకటన ♦ కాంగ్రెస్ వల్లే దైన్యంగా దళితుల పరిస్థితని వ్యాఖ్య కోజికోడ్: సెక్యులరిజం అనే పదానికి పార్టీలు అర్థాన్ని మార్చేశాయని.. ముస్లింలను ఓటుబ్యాంకుగా కాకుండా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్లుగా మన వారిగా చూడాలని ప్రధాని మోదీ తెలిపారు. కోజికోడ్‌లో బీజేపీ జాతీయ మండలి సమావేశాల ముగింపు ప్రసంగంలో నేతలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా.. దేశంలో చివరి వ్యక్తి వరకు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలన్న తీర్మానానికి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గతంలో దీన్‌దయాళ్ ముస్లింల గురించి చెప్పిన ‘వారికి కానుకలు ఈయొద్దు, అలాగని ఛీత్కరించవద్దు. వారికి సాధికారత కల్పించండి. వాళ్లు విద్వేషానికి ప్రతీకలో, ఓటుబ్యాంకు మార్కెటో కాదు. వారిని మీ వారిగా చూడండి’ అన్న వ్యాఖ్యలను మోదీ గుర్తుచేశారు. పశ్చిమభారతం లాగే.. ఈశాన్య ప్రాంతం కూడా పురోగతి బాట పట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. తన సిద్ధాంతం కోసం బీజేపీ ఎప్పుడూ రాజీపడలేదని.. అలా చేయాలనుకుని ఉంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారమన్నారు. కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా మోదీ ఖండించారు. సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయని.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ పాలన కారణంగానే దేశంలో దళితుల పరిస్థితి దైన్యంగా మారిందన్నారు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతోందన్నారు. అంతకుముందు.. ఉదయం కోజికోడ్‌లోని శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కశ్మీర్‌ను ఎప్పటికీ విడదీయలేరు: షా కశ్మీర్‌ను భారత్ నుంచి ఎప్పటికీ విడదీయలేరని.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఉడీ ఉగ్రదాడితో దీర్ఘకాల యుద్ధానికి దిగేలా భారత్‌ను పాక్ ప్రేరేపించిందన్నారు. ‘కశ్మీర్ మాది.. దాన్ని తీసుకోవాలని కలలు కనొద్దు. బీజేపీ ఉండగా అది ఎన్నటికీ జరగదు’ అని అన్నారు. సోమవారం సాయంత్రం ఐక్యరాజ్యసమితిలో జరిగే సుష్మస్వరాజ్ ప్రసంగాన్ని చూడాలని కార్యకర్తలకు చెప్పారు. జనవరి 7-8 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు. మాపై నిందమోపుతున్నారు: పాక్ తాము ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నామంటూ భారత ప్రధాని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పాక్ ఆరోపించింది. కశ్మీర్ సమస్య నుంచి దృష్టి మరల్చేందుకే ఈ వ్యాఖ్యలని వ్యాఖ్యానించింది. ఉడీ ఘటన కశ్మీర్లో పరిస్థితిపై అక్కడి ప్రజల ప్రతిస్పందన కావచ్చన్న పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తీవ్రంగా మండిపడ్డారు. పారిస్ ఒప్పందానికి2న ఆమోదం గతేడాది పారిస్‌లో జరిగిన పర్యావరణ మార్పుల ఒప్పందంపై అక్టోబర్ 2న భారత్ తన ఆమోదాన్ని తెలపనుందని మోదీ చెప్పారు. భూతాపాన్ని తగ్గించేం దుకు అంతర్జాతీయ ప్రమాణాలను అమలుచేయనున్నట్లు తెలిపారు. కాగా, మోదీ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. -
ఓటు బ్యాంకుగానే అగ్ర కులాలు
నిరుపేదలందరికీ రిజర్వేషన్లు వర్తింపజేయాలి ∙ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి భీమారం : అనాదిగా పాలకులు ఓసీలను ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నారని అగ్రకులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నల్లా భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ల సాధనకు అగ్రకులాలను ఏకం చేసే దిశగా కార్యాచరణ రూపొందించేందుకు భీమారంలోని బాలాజీ గార్డెన్స్‌లో ఓసీ మహాగర్జన సభ బుధవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కేవలం పదేళ్ల వరకే తొలుత రిజర్వేషన్లు కల్పిస్తే.. రాజకీయ పార్టీల నేతల స్వార్థం వల్ల వాటిని పొడిగిస్తున్నారని విమర్శించారు. తద్వారా ఓసీల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. అన్ని కులాలు, మతాల వారికి రిజర్వేషన ్లతో గుర్తింపునిస్తున్న ప్రభుత్వం అగ్రవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆర్థికస్థితిగతులను ప్రామాణికంగా తీసుకుని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, వ్యక్తిగత కక్షలకు ఉపయోగపడుతున్న అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తొలుత ఓసీ జేఏసీ జెండాను ఆవిష్కరించారు. ఓసీ సం క్షేమ సంఘాల సమా ఖ్య జిల్లా ఇన్చార్జీ పోలాడి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోçßæన్‌శర్మ, డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఓసీ జేఏసీ నాయకులు నాగమళ్ల సురేష్, వీసం సురేందర్‌రెడ్డి, పోరెడ్డి కిషన్‌రెడ్డి, పాడి గణపతిరెడ్డి, వీసం కరుణాకర్‌రెడ్డి, చల్లా అమరేందర్‌రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, చందుపట్ల నర్సింహారెడ్డి, గూడూరు స్వామిరెడ్డి, రజిత, వీణావాణి, వాణిశ్రీ, సరళ తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా నిర్వహించరేం? : కె.లక్ష్మణ్
సెప్టెంబర్ 17పై ప్రభుత్వానికి కె.లక్ష్మణ్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యమ పార్టీగా ఉంటూ అధికారంలోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎంఐఎంను బుజ్జగించేందుకే ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని శనివారం విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్నే టీఆర్ఎస్ చేస్తోందని, బీజేపీ మినహా మరే పార్టీ ఎంఐఎం మతఛాందస రాజకీయాలను ఎండగట్టే సాహసం చేయడం లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడిన ఈ అంశాన్ని విలీనమా, విమోచనా, విద్రోహమా అన్న సందేహాలను వెలిబుచ్చుతూ కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆగడాలు, దాని వారసత్వంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతో అధికారికంగా నిర్వహించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందన్నారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. -
కాంగ్రెస్‌ది చెక్కు చెదరని కేడర్
♦ ప్రజా సమస్యలపై పోరాడింది కాంగ్రెస్సే ♦ వాగ్దానాలను అమలు చేయని టీఆర్ఎస్ ♦ డీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో భట్టి, శ్రీధర్‌బాబు ఖమ్మం : ‘కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన కేడర్ చెక్కు చెదరలేదు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలిరావడం దీనికి నిదర్శనం. కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. ప్రజా సమస్యల కోసం పాటుపడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ తొమ్మిది అనుబంధ సంఘాలతో పార్టీ బలోపేతం, తీరుతెన్నులు, ప్రజా సమస్యలపై స్పందన తదితర అంశాలపై గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పార్టీ పరిస్థితులు, కేడర్ పెంపొందించేందుకు ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తేనే.. కేడర్ వెంట ఉంటుందని సూచించారు. తొలుత గ్రామస్థాయి నుంచి మండల, బ్లాక్, నియోజకవర్గం, జిల్లాస్థాయి వరకు పార్టీ బాధ్యుల నియామకంతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను కూడా వేయాలని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి శ్రీధర్‌బాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ మాట్లాడుతూ.. తొమ్మిది అనుబంధ సంఘాలకు.. ఒక్కో సంఘంలో 15వేల మంది చొప్పున నాయకులను తయారు చేసి 1.50లక్షల మంది నాయకులతో బలమైన కేడర్‌గా ఆవిర్భవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, యర్రం బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.