అధికారికంగా నిర్వహించరేం? : కె.లక్ష్మణ్
సెప్టెంబర్ 17పై ప్రభుత్వానికి కె.లక్ష్మణ్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబర్ 17ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యమ పార్టీగా ఉంటూ అధికారంలోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఎంఐఎంను బుజ్జగించేందుకే ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని శనివారం విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్నే టీఆర్‌ఎస్ చేస్తోందని, బీజేపీ మినహా మరే పార్టీ ఎంఐఎం మతఛాందస రాజకీయాలను ఎండగట్టే సాహసం చేయడం లేదని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడిన ఈ అంశాన్ని విలీనమా, విమోచనా, విద్రోహమా అన్న సందేహాలను వెలిబుచ్చుతూ కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆగడాలు, దాని వారసత్వంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే భయంతో అధికారికంగా నిర్వహించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందన్నారు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని చెప్పారు.