‘ఓట్‌ బ్యాంక్‌’ నుంచి ‘ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌’ వరకూ... | Johnson Choragudi Guest Column On Vote Transfer | Sakshi
Sakshi News home page

‘ఓట్‌ బ్యాంక్‌’ నుంచి ‘ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌’ వరకూ...

Published Fri, Aug 23 2024 9:31 AM | Last Updated on Fri, Aug 23 2024 9:56 AM

Johnson Choragudi Guest Column On Vote Transfer

తాజాగా ముగిసిన 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కొన్ని మౌలిక అంశాలు అనివార్యంగా చర్చకు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఇటీవల యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ మాజీ డిప్యుటీ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎన్‌ రామారావు రాసిన వ్యాసాన్ని ఇక్కడ ప్రస్తావించడం ఎంతైనా అవసరం. ‘‘మనదేశంలో 2011 జనగణన తర్వాత మళ్ళీ పదేళ్ళకు 2021లో అది జరగాల్సి ఉంది. కానీ అది వాయిదా పడడంతో, మన అన్ని అవసరాలకు పాత జనాభా లెక్కల మీద ఆధారపడాల్సి వస్తున్నది. అందువల్ల సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి’’ అంటున్నారు. గతంలో వీరు ‘సెన్సెస్‌ అండ్‌ ట్యాబ్యులేషన్‌’ విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఇంకా ఆయన– ‘‘ఇటీవల బడ్జెట్‌లో ఇందుకు కేటాయించిన నిధులను  చూసినప్పుడు, ఇవి ఎప్పుడు జరుగుతాయో అనే అనుమానాలనే కలిగిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఇంకా జాప్యం అంటే మాత్రం, అది ప్రమాదం అవుతుంది’’ అంటున్నారు.   

తాజా గణాంకాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి, అనే ఆవేదనలో మరో మాటకు తావులేదు, అది నిజం. అయితే, 2019–2024 మధ్య రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీన్ని అధిగమించి మరీ సంక్షేమ పథకాలను అమలుపరచి రికార్డు సృష్టించింది. ఎలా అంటే అది– ‘సంతృప్త స్థాయి’ని ప్రాతిపదిక చేసుకుని అటువంటి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇందులో మళ్ళీ లబ్ధిదారుల ఎంపిక అనేది లేకుండా, అర్హులైన అందరికీ... అనేది ప్రాతిపదిక కావడంతో, ఏ స్థాయిలోనూ ‘మేనేజ్‌’ చేయడం అనే అవసరం పంచాయతీ నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గం వరకూ ఎక్కడా రాలేదు.

పథకం ఏదైనా అర్హత ఉంటే చాలు అని అందరికీ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్‌ వంటి రాజకీయ పార్టీలు మళ్ళీ పాత పద్ధతిలో గతంలో మాదిరిగా– ‘ఎస్సీ కార్పొరేషన్‌’ లను ప్రారంభించాలి, అంటూ తిరుపతిలో అందోళన చేసినట్టుగా జులై చివరిలో వార్తలు వచ్చాయి. ఈ కార్పొరేషన్లు లేకపోవడం వల్లనే ఎస్సీ లకు సంక్షేమ పథకాలు అందడం లేదు, అనే వాదనను ఆ పార్టీ తెరపైకి తెస్తున్నది. రాష్ట్రాల్లో ‘ఈ– గవర్నెన్స్‌’ నడుస్తున్నకాలంలో దేశానికి ‘కంప్యూటర్లను’ పరిచయం చేసిన పార్టీ 2024లో చెయ్యాల్సిన డిమాండ్‌ ఎంతమాత్రం కాదిది. 

అయినా సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు విషయంలో దేశానికి ఒక కొత్త– ‘సిలబస్‌’ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ నమూనా దేశమంతా ఏదో ఒక రూపంలో చలామణిలోకి వచ్చాక, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకువెళ్ళడం గురించి ఎవరు మాట్లాడినా అది పేలవంగా తేలిపోతుంది. దాన్ని కొనసాగించలేక, ఆ విషయం నేరుగా ప్రకటించలేక, ఏపీలో ఎన్డీఏ కూటమి పడుతున్న ఆపసోపాలు బహిరంగమైన పరిస్థితుల్లో, కాంగ్రెస్‌ వంటి పార్టీల ఉనికి పోరాటానికి– ‘ఎస్సీ కార్పొరేషన్లు కావాలి...’  వంటి దేశవాళీ ‘డిమాండ్లు’ ఆ పార్టీలకు రాజకీయంగా పనికిరావొచ్చు. అయితే, ఈ సందర్భంగానే– 2024 ఎన్నికల్లో ‘దళిత్‌ వోట్‌’పై ‘లోక్‌ నీతి’–‘సీఎస్‌డీఎస్‌’ కో డైరెక్టర్‌ ప్రొ‘‘ సంజయ్‌ కుమార్‌ బృందం చేసిన విశ్లేషణను గమనించడం ఎంతైనా అవసరం. ఎన్నికలు అనేసరికి ఒకప్పుడు ‘ఓటు బ్యాంక్‌’ అనే స్థిమిత స్థితి ఉండడం మనకు తెలుసు. అయితే, ఇప్పుడు ఆ స్థానంలోకి ‘ఓటు ట్రాన్స్‌ఫర్‌’ అనే అనిశ్చిత స్థితి రావడంతో– ‘లిక్విడ్‌ పాలిటిక్స్‌’ (ద్రవ రాజకీయాలు) అనే సరికొత్త రూపాన్ని మన రాజకీయాలు తీసుకుంటున్నాయి. చంద్రబాబు ఒకేసారి రెండు భిన్నమైన రాజకీయ కూటములతో మైత్రి కొనసాగిస్తూ ఈ తరహా ‘ద్రవ రాజకీయాలకు’ దేశంలోనే ఎత్తైన ప్రతినిధిగా నిలుస్తారు. 

ఇప్పుడు క్రమంగా ప్రజలు కూడా కొందరు నాయకులు అనుసరిస్తున్న ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రొ‘‘
సంజయ్‌ కుమార్‌ బృందం చేసిన విశ్లేషణలో మనకు కనిపి స్తున్నది అదే. ఆంధ్రప్రదేశ్‌లో దళిత్‌ ఓటు వైఎస్సార్‌సీపీ– తెలుగు దేశం పార్టీ మధ్య సమానంగా చీలిందంటారాయన. ఇక్కడ 48 శాతం టీడీపీకి పడితే, 50 శాతం వైఎస్సార్‌సీపీకి, కేవలం 2 శాతం కాంగ్రెస్‌కు వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాలు 2014 తర్వాత అక్క ణ్ణించి పూర్తిగా జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ వైపుకు బదిలీ అయితే, 2024లో తిరిగి కొంతమేర అవి టీడీపీకి బదిలీ అయ్యి చివరికి అది గెలిచింది. రాబోయే ఐదేళ్ళు వైఎస్సార్‌సీపీ చేయబోయే రాజకీయాలకు దానికి మిగిలిన నైతిక బలం దానికొచ్చిన 40 శాతం ఓట్లు అయితే, అందులోని 50 శాతం ‘దళిత్‌ ఓటు’ అయింది. టీడీపీకి బదిలీ అయిన 48 శాతం దళిత్‌ ఓటు, ఎన్ని కల హామీల అమలు వైఫల్యంతో ఎంత వేగంగా మళ్ళీ వెనక్కి  వైఎస్సార్‌సీపీ వద్దకు వస్తుంది అనేదాన్నిబట్టి ఇకముందు జరగ బోయే రాజకీయాలు ఉంటాయి. 
-జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement