వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న 2000లో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అప్పటికి ఆర్థిక సంస్కరణల అమలు మొదలై పదేళ్ళు అయింది. ఇది జరిగిన పదేళ్లకు ఈ కొత్త రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఈ కాలంలోనే – ‘రీ మ్యాపింగ్ ఇండియా’ అంశంపై ‘అకడమిక్’ చర్చ మొదలైంది. దేన్నయినా మొత్తంగా ‘చూస్తూ’ చేసే నిర్ధారణల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అటువంటిదే – ప్రొఫెసర్ లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంథం. ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజీలో ‘ఇండియా ఇన్‌స్టిట్యూట్’తో పాటుగా కేంబ్రిడ్జి – ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటీల్లో పొలిటికల్ సైన్స్ బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్‌గా పనిచేశారు. మన రాష్ట్ర విభజన జరిగిన 2014 నాటికి ఈ రచన వెలువడింది. అందులో ముందుమాట లోనే ఆమె– ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్థిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీ ఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి? అనేది నిర్ధారిస్తాయి’ అంటారు.
ఉత్తర, మధ్య ఇండియాలో ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాల్లో జరిగిన సామాజిక రాజకీయ పునరేకీకరణ విషయంలో– ఆ తర్వాత పదేళ్లకు ఏర్పడిన కొత్త రాష్ట్రంగా మనకొక నిరంతరాయ స్పృహ తప్పదు. ప్రొ‘‘ లూయిస్ అంటున్నట్టుగా ఇందులో– ‘ఏవి, ఎవరి చేజారి ఎవరి చేతిలోకి పోతున్నాయి...’ అనేది అతి కీలకమైన అంశం. గడచిన వందేళ్ళలో కొన్ని సంప్రదాయ వర్గాల ఆధిపత్యం చేజారిపోయిందనే వాదన ఉంది. కానీ అది నిజమా? అంటే కాదు. వాళ్ళు స్థిరాస్తులుగా ఉన్న తమ భూముల్నీ, పారంపర్య ఆచార బాధ్యతల్నీ విడిచి జ్ఞాన రంగాలకు వెళ్ళి అక్కడ ఆధిపత్య స్థాయిలో స్థిరపడ్డారు. టెక్నాలజీ పరంగా ‘అప్ డేట్’ అవుతూ ఉన్నారు.
అలా పైకి వెళ్ళిన వర్గాల చేతుల్లోనే గడచిన డెబ్బై ఐదు ఏళ్ల రాజకీయ ఆధిపత్యం ఉంది. వీరే ఏదో ఒక పార్టీ పేరుతో అధికార ప్రతిపక్షాల్లో ఉంటూ, తమ స్థిరాస్తుల భద్రత చూసుకుంటూ అభివృద్ధి అంటూ వారు తమ ఆస్తుల విలువ పెంచే ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే 1989–90 మధ్య ప్రధాని వీపీ సింగ్ ‘మండల్ కమిషన్’ నివేదిక అమలు మొదలైతే, వాటి వెనుక మరో ఏడాదికి తెలుగు ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు అమలులోకి తెచ్చారు. గమనిస్తే– ‘మండల్’ నుంచి ‘ఆర్థిక సంస్కరణలు’ దాటి వచ్చిన ‘విభజన’ వరకు ఈ పాతికేళ్ళ కాలంలో ఇందులో ఒక ‘ప్రాసెస్’ను చూస్తాం. వాటిలో– ఒకదానిలో ‘ప్రజలు’ ఉంటే మరొకదానిలో ‘ప్రాంతం’ కనిపిస్తుంది.
అయితే, వీటిలో మొదటిదైన వీపీ సింగ్ ‘మండల్’ అమలు నిర్ణయం జరగకుండా, రెండవదైన పీవీ ఆర్థిక సంస్కరణల అమలును గానీ, పోరాడి మరీ మన నుంచి తెలంగాణ విడిపోవడాన్నిగానీ ఊహించగలమా? అదే కనుక జరక్క పోయి ఉంటే, సంస్కరణల మౌలిక సూత్రమైన– ‘ప్రపంచీకరణ’– ‘ప్రైవేటీకరణ’–‘సరళీకరణ’ల అమలు ఇక్కడ సాధ్యమయ్యేవా? వాటి వలన పెరిగిన అసమానతలు మాట ఏమిటి అనేది మళ్ళీ వేరే చర్చ.
అయితే ఇక్కడే– ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్థిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీ ఉంది? సంపదపై ఆధిపత్యం ఎవరిది? ఏవి ఎవరి చేజారి ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి’ అనే ప్రశ్నే మళ్ళీ మళ్ళీ తలెత్తుతున్నది. భూముల పైన, సాంఘిక జీవనం పైన ఆధిపత్యం వదులుకుని, జ్ఞానరంగం వైపు వెళ్ళినవారు గతంలో కంటే మెరుగైన స్థాయిలో ఉండడం మనకు తెలియదా? తెలిసీ విభజన తర్వాత కూడా మళ్ళీ ‘భూమి’ కేంద్రంగా దాని చుట్టూనే అధికార రాజకీయాలు సాగాలి అన్నప్పుడు, జరగాల్సింది ఏమిటి? మళ్ళీ–‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ జరగాలి.
ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళనూ, వచ్చే పర్యవసానాలనూ పాలకులు ఎదుర్కోవాలి. అలాగని అదేమీ ఐదేళ్ళ వ్యవధిలో మొదలై పూర్తి అయ్యేది కాదు. ఆ విషయం దిగువకు చివరివరకు చేరేది అంతకంటే కాదు. గత ప్రభుత్వం 13 జిల్లాలను 25 చేసి మన్య ప్రాంతాన్ని 26వ జిల్లాగా చేసింది. అంత మాత్రాన పని పూర్తి అయిందని కాదు. గత ప్రభుత్వం ‘మ్యాప్’ పైన చేసింది కేవలం ఆరంభపు ‘మార్కింగ్’ మాత్రమే. తర్వాత జరగాల్సింది సూక్ష్మ స్థాయికి పరిపాలన చేరడం.
మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? అటువంటి చివరి సమాజాలకు పరిపాలన చేరడం అనేది ఇక్కడ లక్ష్యం. ఆ క్రమంలో మనది అనుకున్నది మన తర్వాతి వారికి–‘చేజారి పోవడం’ అనేది తప్పదు.
– జాన్‌సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment