యువతరం రాజకీయాల్లోకి రావాలి... అన్ని పార్టీల నాయకులు తరచూ చెప్పే మాట. ఆచరణకు వస్తే... యువతను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్పితే... పాలనలో వారిని భాగస్వాములను చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు. మన దేశ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్లలోపు వారే. లోక్‌సభకు పోటీచేయాలంటే 25 ఏళ్లు నిండి ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 (బి) చెబుతోంది. ఓటు హక్కు వచ్చే వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు కుదించి ముప్పై ఏళ్లవుతోంది. ఎన్నికల్లో పోటీకి కనీస వయసును కుదించే ప్రయత్నం మాత్రం జరగడం లేదు.
హర్దిక్ పటేల్... గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని గత ఏడాది బలమైన ఉద్యమం నిర్మించారు. 6 కోట్ల గుజరాత్ జనాభాలో దాదాపు 12 శాతం ఉన్న పటేళ్లకు నేతగా ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టతో ముడిపడి ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్డె దింపుతానని సవాల్ చేస్తున్నారు. దానికోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. పటీదార్ల ఉద్యమనేతగా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ వయసు 24 ఏళ్లే. వచ్చే ఏడాది జులై 20తో అతనికి 25 ఏళ్లు నిండుతాయి. ఎన్నికల్లో పోటీచేసే అర్హత సాధిస్తాడు. అలాగే యూనివర్శిటీల్లో వివక్షపై, ప్రభుత్వ విధానాలపై ఎందరో యువ నేతలు బలమైన గళం వినిపిస్తున్నారు.
ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో దేశద్రోహం అభియోగాలను ఎదుర్కొన్న కన్హయ్య కుమార్, షెహ్లా రషీద్ లాంటి యువ నేతలు దేశం దృష్టిని ఆకర్షించారు. తమ వాక్పటిమ, రాజకీయ పరిపక్వతతో గుర్తింపు పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యువత గొంతువిప్పుతోంది. వాదిస్తోంది, నిరసిస్తోంది... అధికారంలో ఉన్నవారిని నిగ్గదీస్తోంది. ప్రశ్నిస్తోంది. సమాధానం కావాలంటోంది. లోపాలను ఎత్తిచూపుతోంది. అర్థవంతమైన చర్చలు చేస్తోంది. మరి వీరే ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో ఉంటే! యువ గళానికి ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాలు... పోటీ చేసే కనీస వయసును ఎప్పుడో కుదించాయి. కొన్నిదేశాల్లో అయితే 18 ఏళ్లకే పార్లమెంటులో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉంది. వివిధ దేశాల్లో అసెంబ్లీలకు, పార్లమెంటుకు పోటీచేసే కనీస వయసు ఎలా ఉందో చూద్దాం...
==================================
దేశం దిగువసభ ఎగువసభ
==================================
భారత్ 25 30
బ్రిటన్ 21 21
స్కాట్లాండ్ 16 -
ఫ్రాన్స్ 18 24
ఇజ్రాయెల్ 21 -
జర్మనీ 18 -
ఆస్ట్రేలియా 18 18
ఇండోనేషియా 21 -
అమెరికా 25 30
–ఫ్రాన్స్‌లో 18 ఏళ్లు నిండితే దేశాధ్యక్షుడు కూడా కావొచ్చు.
– ఇరాన్‌లో 21 ఏళ్లు నిండితే అధ్యక్షపదవికి పోటీచేయొచ్చు.
– 2014లో ఎన్నికైన భారత పదహారో లోక్‌సభలో ఎంపీల సగటు వయసు 54 ఏళ్లు.
– 30 ఏళ్ల లోపు వారు 12 మంది మాత్రమే పదహారో లోక్‌సభకు ఎన్నికయ్యారు.
– గుజరాత్‌లో తొలిదశలో 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబరు 9న పోలింగ్ జరగనుంది. 2.12 కోట్ల మంది ఓటర్లు ఉండగా... ఇందులో 35 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే. అంటే తొలిదశ ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్లలో దాదాపు 17 శాతానికి ఎన్నికల్లో నిలబడే అర్హత లేదు. అంటే అంతశాతం మంది తరఫున గళం వినిపించే వారుండరు. దీన్ని ఎంతవరకు సబబు అనగలం?
భారత్‌లోనూ ఎన్నికల్లో పోటీకి వయసును కుదించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడేళ్ల కిందటే డిమాండ్ చేసింది. వర్శిటీల్లోనూ ఈ మేరకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. 18 ఏళ్లు మరీ చిన్నవయసు అనుకుంటే... పోటీకి కనీస వయసు 20 లేదా 21 ఏళ్లుగా నిర్ణయించవచ్చు. 20 ఏళ్ల వయసులో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. టీనేజ్‌లోనే మలాలా నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. మరి భారతదేశ జనాభాలో 50 శాతం 25 ఏళ్లలోపు ఉన్నప్పుడు ఆ యువతకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ఉండాలి కదా. అభ్యర్థి గుణగణాలు, పరిపక్వతను ఓటర్లు బేరీజు వేసుకొని... బాగా పనిచేస్తాడనుకుంటేనే గెలిపిస్తారు. అభ్యర్థి యువకుడైనా తనను తాను రుజువు చేసుకొని ఉంటేనే ప్రజామోదం లభిస్తుంది కాబట్టి పోటీకి కనీస వయసును కుదించే అంశంపై ఎన్నికల కమిషన్, దేశంలోని రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment