
పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.
గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు.
అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదారాయన. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: కన్నకూతురిని పాతికసార్లు పొడిచాడు!
Comments
Please login to add a commentAdd a comment