కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.
ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్‌ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది.
అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్!
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది.
గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి.
పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్‌ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు.
50 స్థానాల్లో ప్రభావం
కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment