ఏడు జిల్లాలు, 50 అసెంబ్లీ స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజేతను తేల్చడంలో కీలకంగా ఉంటోంది. బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకైన లింగాయత్‌లు అధికంగా ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జేడీ(ఎస్) ఉనికి ఇక్కడ కూడా నామమాత్రమే..
సాక్షి, బెంగళూరు: బ్రిటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ పేరిట 2021లో ముంబై కర్ణాటక పేరును కిత్తూరు కర్ణాటకగా మార్చారు. ఇక్కడ ఉత్తర కన్నడ మినహాయించి మిగతా ఆరు జిల్లాల్లోనూ లింగాయత్‌లదే ప్రాబల్యం. దశాబ్దాలుగా వారు బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు.
ఆధిక్యం అటూ ఇటూ
♦ ముంబై కర్ణాటక తొలినాళ్లల్లో కాంగ్రెస్ కంచుకోట. 1990 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్ పక్షవాతం బారిన పడటంతో ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను తొలగించారు. దాంతో కాంగ్రెస్‌పై లింగాయత్‌లు భగ్గుమన్నారు. తర్వాత బీజేపీ లింగాయత్ నేత బీఎస్ యడియూరప్ప వెనక నడిచారు.
♦ క్రమంగా ఈ ప్రాంతం బీజేపీ కంచుకోటగా మారింది. అలా సాగిన బీజేపీ హవాకు యడియూరప్ప తిరుగుబావుట ఎగరేసి సొంత కుంపటి పెట్టుకోవడంతో 2013లో అడ్డుకట్ట పడింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 30 సీట్లు గెలిచింది.
♦ 2014 లోకసభ ఎన్నికల అనంతరం యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ముంబై కర్ణాటక మళ్లీ బీజేపీ పట్టులోకి వెళ్లింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 17 సీట్లు గెలిచాయి.
♦ యడియూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అంతటి లింగాయత్ నేతను బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది.
♦ అధికార బీజేపీ కూడా సరిగ్గా ఎన్నికలకు నెల ముందు లింగాయత్‌ల ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు వారి రిజర్వేషన్లను 2 నుంచి 4 శాతానికి పెంచింది. ఇది బాగా కలిసొస్తుందని ఆశిస్తోంది.
♦ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెళగావి, ధారవాడల్లో భారీ సభలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ బెళగావిలో యువ క్రాంతి, యువ సమావేశాలు నిర్వహించారు.
బెళగావిలో కీలక పోరు
♦ బెంగళూరు నగరం (28 సీట్లు) తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు (18)న్న బెళగావి జిల్లా ముంబై కర్ణాటక ప్రాంతంలోనే ఉంది. ఈ జిల్లా రాజకీయంగానూ చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 10, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి.
♦ రెండు పార్టీల్లోనూ గట్టి రాజకీయ కుటుంబాలున్నాయి. జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు చక్కెర సహకార సంఘాలున్నాయి. నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బెళగావి నుంచే ప్రజాధ్వని యాత్ర పేరిట ఎన్నికల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.
♦ ఉమేశ్ కత్తి, సవదత్తి మామని వంటి కీలక నేతల హఠాన్మరణంతో బీజేపీ ఇక్కడ కాస్త బలహీనపడింది. దీనికి తోడు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటి సీనియర్లు పార్టీని వీడటంతో మరింత డీలా పడింది. శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున బీజేపీకి సవాలు విసురుతున్నారు.
♦ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న శిగ్గావ్ స్థానం ముంబై కర్ణాటక కిందకే వస్తుంది. 2018 నుంచీ ఇక్కడ పలు జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సిద్ధరామయ్య బాగలకోటె జిల్లా బాదామి నుంచి గెలుపొందారు.
♦ విజయపుర జిల్లాలో బీజేపీ సీనియర్ నేత బసవనగౌడ పాటిల్ నోటి దురుసు పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో యడియూరప్పపై బహిరంగంగా విమర్శలతో పార్టీకి నష్టం చేసిన చరిత్ర ఆయనది. ఈసారీ సీఎం అభ్యర్థి తానేనంటూ హల్‌చల్ చేస్తున్నారు.
♦ ఇక 7 సీట్లున్న ధారవాడ జిల్లా కూడా బీజేపీకి కీలకమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment