కోలారు: కాంగ్రెస్, జేడీ(ఎస్) కుటుంబ పాలనే కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు కారణమంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అవి అవినీతిని పెంచి పోషించాయని, అస్థిరతను అవకాశంగా తీసుకుని రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చాయని మండిపడ్డారు. లూటీపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ‘కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు కర్ణాటకలో ప్రత్యర్థులుగా నటిస్తారు. ఢిల్లీలో మాత్రం కలిసే ఉంటారు. పార్లమెంటులో పరస్పరం సహాయం చేసుకుంటారు’’ అన్నారు. మోదీ ఆదివారం రామనగర జిల్లాలో జేడీ(ఎస్) కంచుకోట అయిన చెన్నపట్నలో బహిరంగసభలో ప్రసంగించారు.
‘‘జేడీ(ఎస్)కు పడే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చి రాష్ట్రాన్ని అస్థిరపరుస్తుంది. ఇక కాంగ్రెస్‌ది 85 శాతం కమిషన్ సర్కారు. ద్రోహానికి మరోపేరు. 2008లో తప్పుడు రుణమాఫీ తెచ్చింది. కాంగ్రెస్ నేతల సంబంధీకుల, అవినీతిపరుల రుణాలే మాఫీ అయ్యాయి. ఇదీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను విషసర్పంతో పోల్చినందుకు తనకేమీ బాధ లేదని మోదీ అన్నారు. ‘‘పాము శివుని మెడలో హారం. అవును. నేను ప్రజల మెడలో పామునే. వారిని రక్షిస్తూ ఉంటా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment