దేశ రాజధాని ఢిల్లీ అనగానే విశాలమైన రోడ్లు,ఎత్తయిన భవనాలే కళ్లముందు కదలాడతాయి.
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అనగానే విశాలమైన రోడ్లు,ఎత్తయిన భవనాలే కళ్లముందు కదలాడతాయి.కానీ, అక్కడ కూడా వందల సంఖ్యలో పేదల బస్తీలు, అనధికారిక కాలనీలు ఉన్నాయంటే నమ్మడం కాస్త కష్టమే.. ఢిల్లీ జనాభాలో 55 శాతానికిపైగా(సుమారు కోటి పైగా) జనం పేదరికంలో మగ్గుతున్నారన్నది గణాంకాలు చెబుతున్న నిజం. ఇప్పుడు వీరే దేశ రాజధానిని ఏ పార్టీ పాలించేది నిర్ణయించే భవిష్యత్తు నిర్ణేతలు. ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పేదల తీర్పే కీలకం కాబోతోందని అన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఢిల్లీలో మురికివాడలు, అనధికారిక కాలనీల సంఖ్య పెంచుతూ పోయిన కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడు వారే చావుదెబ్బతీసేలా ఉన్నారు. మధ్యతరగతి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న బీజేపీకి ఈ నష్టం అంతగా ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ వ్యక్తమవుతున్నాయి.
పేదల బస్తీలు పెంచిపోషించారు: పార్టీలు తమ అధికారదాహం కోసం ఢిల్లీ పరిసరాల్లోని 364 గ్రామాల ప్రజలకు మెరుగైన జీవనం కల్పిస్తామంటూ ఆశలు చూపి ఢిల్లీ వ్యాప్తంగా అనధికారిక కాలనీలు పెంచుతూ వచ్చాయి. స్థానిక జనాభాలో 55 శాతం మంది 1,218 అనధికారిక కాలనీలు, 45 జుగ్గీజోపిడీ కాలనీలు, 685 మురికివాడల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెడుతూ వారి ఓట్లతో పదిహేనేళ్లుగా ఢిల్లీ గద్దెను ఏలుతోంది కాంగ్రెస్. అందులో భాగంగానే అనధికారిక కాలనీల క్రమబద్దీకరణ అంశాన్ని తెర పైకి తెచ్చింది. ఇప్పటి వరకు 895 కాలనీలను క్రమబద్దీకరించడంతోపాటు 45 పునరావాస కాలనీలవాసులకు యాజమాన్యహక్కులు కల్పించారు. ఇలా జుగ్గీజోపిడీలను, అనధికారిక కాలనీలు పూర్తిస్థాయిలో తమ సంప్రదాయ ఓటుబ్యాంక్‌గా మార్చుకోవడంతో కాంగ్రెస్ నాయకులు సఫలయమ్యారు.
తాను తీసిన గోతిలోనే పడనున్న కాంగ్రెస్
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ కాంగ్రెస్‌నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న మురికవాడల్లో ఆ పార్టీ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కే జ్రీవాల్‌పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం పేదలను ఆలోచింపజేస్తోంది. మధ్యతరగతిలోనే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతుండడంతో పేదలంతా ఆలోచనలో పడ్డారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన నుంచి వాళ్లు మార్పు కోరుతున్నారు. సామాన్యుడి సమస్యలపై పోరాడుతామంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఈ సారి ఎన్నికల్లో నిలువునా చీలడం ఖాయం.