ముస్లింలు మనవాళ్లే!
♦ ఓటు బ్యాంకు కాదు: బీజేపీ జాతీయ మండలి ముగింపు సమావేశంలో ప్రధాని
♦ సిద్ధాంతమే బీజేపీకి బలమని ప్రకటన
♦ కాంగ్రెస్ వల్లే దైన్యంగా దళితుల పరిస్థితని వ్యాఖ్య
కోజికోడ్: సెక్యులరిజం అనే పదానికి పార్టీలు అర్థాన్ని మార్చేశాయని.. ముస్లింలను ఓటుబ్యాంకుగా కాకుండా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్లుగా మన వారిగా చూడాలని ప్రధాని మోదీ తెలిపారు. కోజికోడ్‌లో బీజేపీ జాతీయ మండలి సమావేశాల ముగింపు ప్రసంగంలో నేతలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా.. దేశంలో చివరి వ్యక్తి వరకు సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలన్న తీర్మానానికి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గతంలో దీన్‌దయాళ్ ముస్లింల గురించి చెప్పిన ‘వారికి కానుకలు ఈయొద్దు, అలాగని ఛీత్కరించవద్దు. వారికి సాధికారత కల్పించండి. వాళ్లు విద్వేషానికి ప్రతీకలో, ఓటుబ్యాంకు మార్కెటో కాదు. వారిని మీ వారిగా చూడండి’ అన్న వ్యాఖ్యలను మోదీ గుర్తుచేశారు.
పశ్చిమభారతం లాగే.. ఈశాన్య ప్రాంతం కూడా పురోగతి బాట పట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. తన సిద్ధాంతం కోసం బీజేపీ ఎప్పుడూ రాజీపడలేదని.. అలా చేయాలనుకుని ఉంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారమన్నారు. కేరళలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా మోదీ ఖండించారు. సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నాయని.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ పాలన కారణంగానే దేశంలో దళితుల పరిస్థితి దైన్యంగా మారిందన్నారు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతోందన్నారు. అంతకుముందు.. ఉదయం కోజికోడ్‌లోని శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కశ్మీర్‌ను ఎప్పటికీ విడదీయలేరు: షా
కశ్మీర్‌ను భారత్ నుంచి ఎప్పటికీ విడదీయలేరని.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఉడీ ఉగ్రదాడితో దీర్ఘకాల యుద్ధానికి దిగేలా భారత్‌ను పాక్ ప్రేరేపించిందన్నారు. ‘కశ్మీర్ మాది.. దాన్ని తీసుకోవాలని కలలు కనొద్దు. బీజేపీ ఉండగా అది ఎన్నటికీ జరగదు’ అని అన్నారు. సోమవారం సాయంత్రం ఐక్యరాజ్యసమితిలో జరిగే సుష్మస్వరాజ్ ప్రసంగాన్ని చూడాలని కార్యకర్తలకు చెప్పారు. జనవరి 7-8 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు.
మాపై నిందమోపుతున్నారు: పాక్
తాము ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నామంటూ భారత ప్రధాని చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పాక్ ఆరోపించింది. కశ్మీర్ సమస్య నుంచి దృష్టి మరల్చేందుకే ఈ వ్యాఖ్యలని వ్యాఖ్యానించింది. ఉడీ ఘటన కశ్మీర్‌లో పరిస్థితిపై అక్కడి ప్రజల ప్రతిస్పందన కావచ్చన్న పాక్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తీవ్రంగా మండిపడ్డారు.
పారిస్ ఒప్పందానికి2న ఆమోదం
గతేడాది పారిస్‌లో జరిగిన పర్యావరణ మార్పుల ఒప్పందంపై అక్టోబర్ 2న భారత్ తన ఆమోదాన్ని తెలపనుందని మోదీ చెప్పారు. భూతాపాన్ని తగ్గించేం దుకు అంతర్జాతీయ ప్రమాణాలను అమలుచేయనున్నట్లు తెలిపారు. కాగా, మోదీ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.