మోదీ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా సీరియస్
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ‘‘ ఇతర మతాలను కించపరచాలని మా మతం అస్సలు బోధించదు. హిందూ మహిళల మంగళసూత్రాలను ఏ ఒక్క ముస్లిం కూడా దోచుకోడు. అందరినీ సమానంగా చూడాలని ఇస్లాం ప్రభోదిస్తోంది. మేం నమ్మే మా మతం అన్ని మతాలకూ గౌరవం ఇవ్వాలనే చెబుతోంది. హిందూ తల్లి, సోదరి మంగళసూత్రాలను ముస్లిం దోచాడని నేను ఎక్కడా వినలేదు.
అలా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే అతను ముస్లిమే కాదు. అతను ఇస్లాంను సరిగా అర్థంచేసుకోలేదని అర్థం’’ అని అన్నారు. మంగళవారం రాజసాŠథ్‌న్‌లోని బాంసవాడా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడారు. ‘‘ ఒకరిని చంపితే మానవత్వాన్ని చంపేసినట్లేనని ఇస్లాం బోధనల్లో ఉంది. నేనూ ముస్లింనే. హిందువులను ద్వేషించాలని ఖురాన్‌లో ఎక్కడా లేదు. సిక్కులు, ముస్లింలను ఎంతగా ప్రేమిస్తానో హిందువుల పట్ల అంతే ప్రేమతో వ్యవహరిస్తా. ఇతర మతాల వాళ్లు అభివృద్ధిలోకి వస్తే వారితోపాటే మనమూ వృద్ధిలోకి వస్తాం.
అప్పుడే దేశమే అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది’’ అని అన్నారు. బీజేపీ 2047 విజన్‌పై ఫరూక్ ఆరోపణలు గుప్పించారు. ‘‘ విజన్ 2047పై బీజేపీ ఎప్పుడూ వల్లెవేస్తోంది. 2047ను ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు?. అప్పటికల్లా దేశంలో పారదర్శకమైన ఎన్నికలు అనేవే లేకుండా చేయడం బీజేపీ ఉద్దేశం. అధికారాన్ని హస్తగతం చేసుకుని నచ్చినట్లు దేశాన్ని ఏలాలని భావిస్తోంది. రష్యాలో పుతిన్‌లాగా మోదీని బతికున్నంతకాలం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ ఆశపడుతోంది’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. ‘‘ ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని తెల్సుకోండి. ఆ తర్వాత ఆ పార్టీకి మద్దతు అవసరమా లేదా అని ఆలోచించండి’ అని కశ్మీర్ ప్రాంత పార్టీల నేతలను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment