సాక్షి ప్రతినిధి, వరంగల్/ నల్లగొండ టూటౌన్: ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల సంక్షేమాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం పార్టీతో చెట్టపట్టాలేసుకుని ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణలో ఉద్యమకారులు రోడ్లపై ఉంటే, ఉద్యమద్రోహులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారని ధ్వజమెత్తారు. హన్మకొండ, నల్లగొండలో శనివారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, ఒవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారాయని విమర్శించారు.
సచివాలయానికి రావడం లేదంటే సచివాలయాన్నే కూల్చేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఒక్క ఆసుపత్రి కట్టలేదని, కేసీఆర్ కట్టడు, కేంద్రం కడతామంటే సహకరించరని ఆరోపించారు. 160 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైల్వే ఓవర్ హాలింగ్ పరిశ్రమ నిలిచిపోయిందన్నారు. బీబీనగర్‌లోని మెడికల్ కాలేజీకి ప్రభుత్వం భూములను ఇవ్వలేదని, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు చెల్లించలేదని ఆరోపించారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను తెచ్చామని, దాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే అర్హతలేదని, ఇష్టారాజ్యంగా కొందరు మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. వరంగల్ మామునూరులో స్థలాన్ని ఇస్తే వెంటనే ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్‌రెడ్డి, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిభవన్‌లో ద్రోహులు.. రోడ్డున ఉద్యమకారులు
Published Sun, Mar 7 2021 3:37 AM | Last Updated on Sun, Mar 7 2021 3:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment