
ఒత్తిళ్లలో విదేశాంగ విధానం
అందరూ ఊహించినట్టే అయింది. యూపీఏ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంది.
అందరూ ఊహించినట్టే అయింది. యూపీఏ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. శ్రీలంకలో మరో నాలుగురోజుల్లో జరగబోతున్న కామన్వెల్త్ దేశాల అధినేతల సదస్సు (చోగమ్)కు ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరుకావడంలేదు. ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తంచేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు లేఖ రాయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం లీకులిచ్చింది. చోగమ్‌కు ప్రధాని వెళ్లడం లేదా వెళ్లకపోవడంపై సాధారణంగా అయితే పెద్దగా పట్టించుకోనవసరంలేదు. చోగమ్ ఇప్పటిరూపంలో 1971లో రూపొందాక ఇంతవరకూ 21 సమావేశాలు జరగ్గా దాదాపు అరడజను సార్లు ప్రధాని బదులుగా కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నవారు పాల్గొన్నారు.
నిజానికి ప్రపంచ దేశాధినేతలందరూ ఒకచోట సమావేశం కావడం తప్ప చోగమ్ ఎప్పుడూ సాధించిందేమీలేదు. ఇప్పుడు మారిన ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే దాని పరిస్థితి మరింత నామమాత్రావశిష్టమైంది. చోగమ్‌కు వెళ్లకూడదనుకునే నిర్ణయం తీసుకునేముందు ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే మన్మోహన్‌సింగ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టాల్సిందేమీ లేదు. అయితే, ఆయన గైర్హాజరుకు తమిళనాడుకు చెందిన పార్టీలనుంచి వచ్చిన ఒత్తిళ్లు ప్రధాన కారణం. శ్రీలంక తమిళులపై రాజపక్స ప్రభుత్వం సాగించిన దమనకాండపై గత కొంతకాలంగా తమిళనాడులో అశాంతి నెలకొని ఉంది. దీనికి నిరసనగా చోగమ్ సమావేశాలను బహిష్కరించాలని అక్కడి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
శ్రీలంక సమస్యపై గతంలోనూ తమిళనాట నిరసనలు పెల్లుబికాయి. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్‌ను లంక సైన్యం అమానుషంగా హతమార్చిన వైనాన్ని వెల్లడించిన వీడియో బయటపడినప్పుడు కూడా తమిళనాడు ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. మొన్నీమధ్య ఒక మహిళా జర్నలిస్టును లంక సైన్యం నిర్బంధంలోకి తీసుకుని చిత్రహింసలపాలుజేసి చంపేసిన వైనం వెల్లడయ్యాక మరోసారి తమిళులు ఆగ్ర హోదగ్రులయ్యారు. శ్రీలంకలో జరిగే పరిణామాలపై ఇక్కడి తమిళులకు ఆగ్రహం కలగడంలో తప్పేమీ లేదు. వారు లేవనెత్తుతున్న అంశాలపై మన దేశం దౌత్యపరంగా చర్చించి లంకపై ఒత్తిళ్లు తేవాల్సిందే. అందులో రెండోమాటకు తావులేదు. కానీ, అలాంటి ఆందోళనలు ఒక పరిమితికి మించితే సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు లంకతో స్నేహాన్ని వదులుకోవాలని, ప్రత్యేక తమిళ ఈలం కోసం రిఫరెండం చేపట్టాలన్న డిమాండ్‌తో భద్రతామండలిలో తీర్మానం చేయాలని తమిళనాడు అసెంబ్లీ గతంలో కోరింది.
కొందరైతే లంక ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగి అక్కడి తమిళులను కాపాడాలని కూడా కోరారు. స్థానిక సమస్యలను రంగంలోకి తెచ్చి మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయాలని చూడటంవల్ల అంతర్జాతీయంగా మన దేశానికి ఎదురయ్యే సమస్యలు వేరే ఉంటాయి. లంకపై ఒత్తిడి తీసుకురావడం, అక్కడి తమిళుల సమస్యకు సానుకూలమైన పరిష్కారం కనుగొనేలా చూడటమే ముఖ్యమనుకుంటే ఆ రెండూ చోగమ్ సమావేశాల సందర్భంగా నెరవేరడానికే అవకాశాలుంటాయి. రాజపక్సతో మన్మోహన్ చర్చించి ఈమేరకు ఒత్తిళ్లు తీసుకురావడం, ఆయననుంచి ఏదో ఒక హామీని రాబట్టగలగడం సాధ్యమవుతుంది. వెళ్లకపోవడంవల్ల రెండు దేశాలమధ్యా అపోహలు, అపార్థాలు పెరగడం...ఆ పరిస్థితిని చైనావంటి దేశాలు తమకు అనుకూలంగా మలచుకోవడం మినహా సాధించేదేమీ లేదు.
అసలు శ్రీలంక తమిళుల సమస్యపై ఇప్పుడు ఇంతగా పట్టుబడుతున్న పార్టీలన్నీ 2009లో తమిళుల ఊచకోత సాగుతున్నప్పుడు ఏంచేశాయన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పట్లో శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలన్నీ సైనిక పదఘట్టనల్లో నెత్తురోడాయి. లక్షలాదిమంది తమిళులు ఎన్నో అగచాట్లకు గురయ్యారు. హత్యలు, అత్యాచారాలు నిర్నిరోధంగా కొనసాగాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఆ దారుణాలు కొనసాగుతున్నప్పుడే గొంతెత్తాయి. ఆ పరిణామాలపై తమిళనాటకూడా అప్పుడు ఆందోళన వ్యక్తమైంది. కానీ, ఈ పార్టీలన్నీ నామమాత్రంగానే స్పందించాయి. ఎల్‌టీటీఈ, దాని అధినేత ప్రభాకరన్ అంతమైతే చాలని ఆశించాయి. తీరా ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లంక తమిళుల శ్రేయస్సుపై తమకే శ్రద్ధ ఉన్నదని నిరూపించుకోవ డానికి పోటీపడుతున్నాయి. అందులో భాగంగా విదేశాంగ విధానాన్ని నిర్దేశించడా నికి ప్రయత్నిస్తున్నాయి. ఇందువల్ల లంక తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలు మరుగున పడుతున్నాయి.
ఉదాహరణకు 1987లో కుదిరిన భారత-శ్రీలంక ఒప్పందంలో రాష్ట్ర కౌన్సిళ్లను పునరుద్ధరించడంతోపాటు, వాటికి స్వయం పాలనాధికారాలు కట్టబెడతామని లంక హామీపడింది. కానీ, ఆ హామీని తుంగలో తొక్కి వాటిని నామమాత్రంచేసింది. ఉత్తర ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీవీ విఘ్నేశ్వరన్ ఇప్పుడు ఈ సమస్యలనే ప్రస్తావిస్తున్నారు. మన్మోహన్ వచ్చి వీటిపై రాజపక్సతో మాట్లాడాలని ఆయన కోరుతున్నారు. లంక అమానుషాలకు బాధ్యులైనవారిని శిక్షించడానికి కృషిచేయడంతోపాటు అక్కడి తమిళుల కడగండ్లను తీర్చడానికి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన్మోహన్ సర్కారుపై ఉంది. ఇరు దేశాల అధినేతలూ కలిసి మాట్లాడితేనే ఈ రెండూ తీరే అవకాశం ఉంటుంది. అందుకు చోగమ్ వేదిక ఆస్కారం కల్పిస్తున్నప్పుడు దాన్ని వదులు కోవడం ఏమి సబబు? దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతున్నప్పుడు అలాంటి మార్గాలను మూసేయడంలో ఔచిత్యం ఏముంది? ఈ విషయంలో తమిళ పార్టీలకు నచ్చజెప్పవలసిన కేంద్రం తాను సైతం ఎన్నికల ప్రయోజనాలవైపు మొగ్గుచూపింది. ఇది విచారకరం.