ఆ వర్గాల కోసం సమాన అవకాశాల కమిషన్ ఏర్పాటు
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
విద్య, ఉద్యోగాల్లో వివక్ష ఎదుర్కోకుండా ఏర్పాటు
న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మైనారిటీలను ఆకర్షించేందుకు యూపీఏ సర్కారు ప్రయత్నిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో మైనారిటీలు వివక్ష ఎదుర్కోకుండా సమాన అవకాశాల కమిషన్(ఈవోసీ)ను ఏర్పాటు చేసేందుకు గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో మైనారిటీ వర్గాలు.. ముఖ్యంగా ముస్లింలు వివక్షతను ఎదుర్కోకుండా ఈ కమిషన్ చూస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాసంస్థలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఈ కమిషన్ పరిశీలిస్తుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి రెహ్మాన్‌ఖాన్ కేబినెట్ భేటీ అనంతరం వెల్లడించారు.
ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేనందున వీటిని మినహాయించినట్టు చెప్పారు. జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల మేరకు దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు మేలు జరుగుతుందని, మత ప్రాతిపదికన ఏ మైనారిటీ కూడా వివక్షతకు గురికాకూడదనే లక్ష్యంతోనే ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సచార్ కమిటీ పరిశీలన సమయంలో దేశ జనాభాలో 18.5 శాతం మంది ముస్లింలు ఉంటే.. అధికార యంత్రాంగంలో వీరి సంఖ్య 2.5 శాతం మాత్రమే అని తేలింది. కాగా, మైనారిటీల సంక్షేమం దృష్ట్యా ప్రధానమంత్రి 15 సూత్రాల ప్రణాళికను కూడా విస్తృత పరచాలని కేబినెట్ నిర్ణయించింది. వివిధ శాఖల 10 పథకాలను కూడా దీని పరిధిలోకి తేనున్నారు. కేబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలివీ..
- బొగ్గు రంగానికి సంబంధించి అధికారిక ఉత్తర్వుల ద్వారా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ముడి బొగ్గు, శుద్ధి చేసిన బొగ్గు, శుద్ధి చేసే క్రమంలో వెలువడే బొగ్గు ఉప ఉత్పత్తుల ధరల నిర్ణయానికి సంబంధించిన నియమాలు, పద్ధతులను బొగ్గు నియంత్రణ సంస్థ నిర్ణయిస్తుంది. బొగ్గు నాణ్యత, గ్రేడింగ్‌కు సంబంధించిన పరీక్ష పద్ధతులను కూడా ఇదే నిర్ణయిస్తుంది. బొగ్గు నమూనాలు, గనుల ఆమోదం, మూసివేత తదితరాలను ఇది పర్యవేక్షిస్తుంది.
- మరో రెండు బొగ్గు గనులను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకూ రద్దు చేసిన గనుల సంఖ్య 28కి చేరింది.
- పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించడం, కొత్తగా అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం. ఇందుకోసం 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 13 వేల కోట్లు కేటాయింపు.
- 7,200 కి..మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడం. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో ఈ రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారులు 80 వేల కిలోమీటర్లు ఉన్నాయి.
- ఒడియాకు ప్రాచీన భాష హోదా కల్పించాలని నిర్ణయించింది. హిందీ, సంస్కృతం, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల సరసన ఒడియా కూడా చేరనుంది.
కేంద్రం మైనారిటీ మంత్రం
Published Fri, Feb 21 2014 1:22 AM | Last Updated on Thu, May 24 2018 2:09 PM
Advertisement