సంపాదకీయం: కొందరి గురించి కొన్ని అభిప్రాయాలు బలంగా స్థిరపడిపోతాయి. అవి అంత సులభంగా మారవు. కానీ, మంగళవారం పార్లమెంటు సెం ట్రల్ హాల్‌లో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వీక్షించినవారిలో చాలామంది ఒక కొత్త మోడీని... ఇన్నాళ్లూ తెలియని మోడీని చూసిన అనుభూతి చెందారు. ఆయనలో భావోద్వేగాలతో నిండిన మరో పార్శ్వం ఉన్న దని గమనించారు. ప్రసంగం వరకూ అక్కర్లేదు.... పార్లమెంటు భవ నం మెట్లెక్కే ముందు నుదురు తాకించి ఆయన అభివాదం చేసిన తీరే అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
అంతేకాదు... తన వంటి సామాన్యుడు ప్రధాని కావడానికి వీలుకల్పించిన రాజ్యాంగ నిర్మాత లనూ, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలో వ్యవస్థలు వేళ్లూనుకో వడానికి దోహదం చేసిన పెద్దలనూ తన ప్రసంగంలో ఆయన స్మరిం చుకున్నారు. బొటాబొటీ సంఖ్యాబలంతో... మిత్రపక్షాల దయాదాక్షి ణ్యాలతో మనుగడ సాగించే పరిస్థితిని అధిగమించి సొంతంగానే ప్రభు త్వం నడపగల సత్తాను పొందిన తరుణంలో బీజేపీపైనా, మోడీపైనా అనేకులకు అనేక అనుమానాలున్నాయి. ఇలాంటి స్థితి ఆ పార్టీ ‘సొంత ఎజెండా’ అమలుకు దోహదం చేస్తుందేమోనన్న భయాలున్నాయి. అయితే, అవన్నీ నిరాధారమైనవని... తాము బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేస్తామని తెలియపరచడానికి తన మాటల ద్వారా, చేతలద్వారా మోడీ ప్రయత్నించారు. రాగలరోజుల్లో ఇవన్నీ ఆచరణాత్మకంగా కూడా కనిపిస్తాయన్న భరోసా కల్పించడానికి చూశా రు. ఒక పెద్ద యుద్ధాన్ని ఒంటిచేత్తో జయించి వచ్చిన ధీరుడిలా కాక వినమ్రంగా, సామాన్యంగా కనిపించడానికి ఆయన ప్రయత్నించారు.
ఇన్నాళ్లూ అందరికీ కనబడిన నరేంద్ర మోడీ వేరు. 2002నాటి గుజరాత్ నరమేథంపై వచ్చిన విమర్శలకు ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉన్నా... ఎవరైనా ఒక మాటంటే పది మాటలతో జవాబు చెప్పే దూకుడు ప్రదర్శించినా, పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించినా ఆయన వ్యవహారశైలి వేరుగా ఉండేది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలన్నీ గమనించినవారికి అందులో ప్రత్యర్థులపట్ల నిర్దాక్షిణ్యత, కాఠిన్యమూ కనిపించాయి. ఆయనను హేళన చేయాలని, చిన్నబుచ్చాలని చూసినప్పుడల్లా...అలాంటి ప్రయత్నం చేసినవారిని తన మాటలతో మరుగుజ్జులుగా మార్చారు. చేతల విషయానికొచ్చినా అంతే. ఆయన గుజరాత్‌ను మరోసారి గెలుచుకొచ్చి ఢిల్లీ పీఠంపై మక్కువ ప్రదర్శించినప్పుడు పార్టీనుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రమే. అయినా పట్టు వీడలేదు. ఇక నిరుడు జూన్‌లో ఆయనను పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ప్రకటించినప్పుడు మొదలుకొని వారణాసిలో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వరకూ మోడీకి పార్టీలో ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. ఒకపక్క వెలుపలి ప్రత్యర్థులతో పోరాడుతూనే పార్టీలో అంతర్గతంగా తనను వ్యతి రేకిస్తున్నవారిని దారికి తెచ్చుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించారు.
అద్వానీ, మురళీమనోహర్ జోషి, సుష్మా స్వరాజ్‌వంటివారితో ఘర్షణకు దిగకుండానే తన మార్గాన్ని సుగమం చేసుకున్నారు. పరివార్ పెద్దల ఆశీస్సులు దండిగా ఉండబట్టే ఇదంతా సాధ్యమైందని చెప్పడం సులభమే. కానీ, రంగంలో ఉండి పోరాడవలసిన వ్యక్తిలో సమర్ధత కొరవడితే ఎవరైనా చేయగలిగిందేమీ ఉండదు. ఇందుకు కొంతకాలం క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నితిన్ గడ్కారీయే ఉదాహరణ. పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యాక ఆయన చేసిన ప్రసంగం విలక్షణమైనది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నేతలు చేసే ప్రసంగాలన్నీ ఒకేలా ఉంటాయి. ఆశలు రేకెత్తించడం, దేశం ముం దున్న సవాళ్లపై గంభీరమైన మాటలు చెప్పడం సర్వసాధారణం.
కానీ మోడీ చేసింది వేరు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందరం కలిసి కదలాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో తాను నిర్దాక్షిణ్యంగా తెగనాడిన యూపీఏ ప్రభుత్వంతోసహా గతంలో పని చేసిన వివిధ ప్రభుత్వాల పాత్రను ప్రస్తావించి వాటివల్లనే దేశ ప్రగతి సాధ్యపడిందని ప్రస్తుతించారు. వారు అనుసరించిన మంచి పనులన్ని టినీ స్వీకరిస్తానని చెప్పారు. నరేంద్ర మోడీ నుంచి ఇలాంటి ప్రసం గాన్ని ఆయన ప్రత్యర్థులు సరే... అనుకూలురు సైతం ఊహించివుం డరు. మెజారిటీ ఒక్కటే సర్వస్వమని, అన్నిటినీ అదే నిర్ణయిస్తుందని భావించడం రాజకీయంగా తెలివిమాలినతనం అనిపించుకుంటుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణధాతువు సంఖ్యాబలంలో కాదు...అందరినీ కలుపుకొని వెళ్లడంలో ఉంటుంది.
1984 ఎన్నికల్లో 415 స్థానాలను చేజి క్కించుకున్న రాజీవ్‌గాంధీ ఈ మౌలిక సూత్రాన్ని మరవబట్టే మూడేళ్లు తిరక్కుండా చిక్కుల్లోపడ్డారు. దీన్నుంచి ఏ గుణపాఠమూ గ్రహించలేని యూపీఏ సర్కారు వరసగా రెండోసారి అధికారం సంక్రమించాక కళ్లు నెత్తికెక్కి బొక్కబోర్లాపడింది. ఈసారి ఎన్నికల్లో కనీసం లోక్‌సభలో 10శాతం స్థానాలు కూడా సంపాదించుకోలేక ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. నరేంద్ర మోడీ ఈ ధర్మసూక్ష్మాన్ని చాలా చక్కగా గ్రహించారని ఆయన ప్రసంగం చెబుతోంది. అందరి సహకారమూ ఉంటేనే దేశ సమస్యల పరిష్కారం... ముఖ్యంగా తనపై నమ్మకం పెట్టు కుని ఉన్న కోట్లాదిమంది యువత ఆశలు నెరవేర్చడం సులభమ వుతుందని, దేశం మళ్లీ ప్రగతిబాట పట్టడం సాధ్యమవుతుందని మోడీ గ్రహించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆయన ప్రధాని పీఠం అధిష్టించబోతున్నారు. తాను చెప్పిన మాటలకు అనుగుణమైన చేతలను చూపగలిగితే దేశ చరిత్రలో నరేంద్రమోడీ విలక్షణ ప్రధానిగా నిలుస్తారనడంలో సందేహంలేదు.
మోడీ భావోద్వేగ ఝరి!
Published Thu, May 22 2014 12:38 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement