కాంగ్రెస్ది చెక్కు చెదరని కేడర్
♦ ప్రజా సమస్యలపై పోరాడింది కాంగ్రెస్సే
♦ వాగ్దానాలను అమలు చేయని టీఆర్‌ఎస్
♦ డీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో భట్టి, శ్రీధర్‌బాబు
ఖమ్మం : ‘కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన కేడర్ చెక్కు చెదరలేదు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలిరావడం దీనికి నిదర్శనం. కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. ప్రజా సమస్యల కోసం పాటుపడిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ తొమ్మిది అనుబంధ సంఘాలతో పార్టీ బలోపేతం, తీరుతెన్నులు, ప్రజా సమస్యలపై స్పందన తదితర అంశాలపై గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పార్టీ పరిస్థితులు, కేడర్ పెంపొందించేందుకు ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తేనే.. కేడర్ వెంట ఉంటుందని సూచించారు.
తొలుత గ్రామస్థాయి నుంచి మండల, బ్లాక్, నియోజకవర్గం, జిల్లాస్థాయి వరకు పార్టీ బాధ్యుల నియామకంతోపాటు అనుబంధ సంఘాల కమిటీలను కూడా వేయాలని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి శ్రీధర్‌బాబు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ మాట్లాడుతూ.. తొమ్మిది అనుబంధ సంఘాలకు.. ఒక్కో సంఘంలో 15వేల మంది చొప్పున నాయకులను తయారు చేసి 1.50లక్షల మంది నాయకులతో బలమైన కేడర్‌గా ఆవిర్భవించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, యర్రం బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.