యెడ్యూరప్ప.. శ్రీరాములు (జత చేయబడిన చిత్రం)
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బీజేపీ మాత్రం అత్యధిక సీట్లను గెల్చుకుని హస్తానికి షాక్ ఇచ్చింది. బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ ముఖ్యభూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వేరుపడి సొంతకుంపట్లతో పార్టీని దెబ్బ కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కీలకంగా వ్యవహరించటం విశేషం.
2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు స్థాపించుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారు. గత ఎన్నికల్లో యెడ్యూరప్ప పార్టీ కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) 9.8 శాతం ఓటింగ్‌తో ఆరు సీట్లు గెలుచుకోగా, శ్రీరాములు పార్టీ బదగర శ్రామిక రైతల కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. చివరకు బీజేపీ 20 శాతం ఓటింగ్‌తో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
యెడ్యూరప్ప, శ్రీరాములు దెబ్బకి బీజేపీకి లింగాయత్, గిరిజన తెగల ఓట్లు అప్పుడు దూరం అయ్యాయి. అంటే ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడి ఉంటే సీట్ల సంఖ్య పెరిగి ఉండేది. దీనికితోడు మిగతా ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలకు పోలైన ఓట్లు, అన్ని కలుపుకుని బీజేపీకిమళ్లి ఉండిఉంటే సీట్లు కనీసం 80 వరకు గెలుచుకుని ఉండేదని విశ్లేషకులు ఆనాడు అభిప్రాయపడ్డారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు శాతం పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ఈ ఇద్దరు దోహదపడ్డారు. లింగాయత్ వర్గానికి సిద్ధరామయ్య ఇచ్చిన హామీని అంతగా పట్టించుకోని ప్రజలు, యెడ్డీ వైపే మొగ్గు చూపగా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలు కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment