Karnataka Election Results 2018
-
అప్రమత్తం కావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. దాని ప్రభావంతో తెలంగాణలోనూ కొంత ఊపు వస్తుందన్న అంచనాలు తలకిందులు కావడం ఆ పార్టీ నేతలను నిరాశలో ముంచేసింది. దీంతో రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని.. పక్కా వ్యూహంతోనే కేసీఆర్‌ను ఎదుర్కోగలమనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాల్సి ఉంటుందని నేతలు పేర్కొంటున్నారు. కేసీఆర్‌ను తట్టుకునేదెలా..? టీపీసీసీ ముఖ్యులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. అక్కడి తెలుగు ప్రజలను కలసి కాంగ్రెస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. కానీ కర్ణాటకలో అధికారం కోల్పోయే పరిస్థితితోపాటు త్వరలో జరుగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. త్వరలోనే ఎన్నికలు జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అక్కడ ఫలితాల సరళిపై చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తే, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని... 2019 ఎన్నికలలో దీనిని ఆసరాగా తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతోందని.. తెలంగాణలో గెలిచి ఏం సాధిస్తుం దనే వాదనను ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని శక్తులూ కలవాల్సిందే.. కర్ణాటకలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్, జేడీఎస్ కలిస్తే ఫలితాలు వేరుగా ఉండేవనే అభిప్రాయం టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో అలాంటి తప్పిదం జరగకుండా చూసుకోవాల్సి ఉంటుందని పలువురు నేతలు అంటున్నారు. కేసీఆర్‌ను తట్టుకోవాలంటే ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. కర్ణాటక ఫలితం పునరావృతం అవుతుందని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటినుంచే ఎత్తులు, పొత్తుల విషయంలో, సామాజిక శక్తులను సమీకరించడంలో వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. బలమైన బృందం అవసరం కర్ణాటక ఫలితాల నేపథ్యంలో తెలంగాణ విషయంలో పకడ్బందీ ఎన్నికల బృందాన్ని నియమించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘‘ఎదుటి శత్రువు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నాడు. కానీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నాడు. శత్రువును ఎదుర్కోవాలంటే ఇప్పటినుంచే పకడ్బందీ కసరత్తు అవసరం. ఏ నాయకుడిని ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల బృందాన్ని నడిపించే నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పుడే తగిన ఫలితాలు వస్తాయి..’అని టీపీసీసీ ముఖ్యుడొకరు పేర్కొన్నారు. మొత్తంగా కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి కనిపిస్తోంది. -
మనకు మేలే!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలి తాల ప్రభావం జాతీ య స్థాయిలో ఎలా ఉంటుందనే దానిపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన, బెంగళూరు పర్యటన, జనతాదళ్ (ఎస్)కు మద్దతు ప్రకటించే నాటికి ముందు, తరువాత కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను సునిశితంగా విశ్లే షించే పనిలో పడ్డారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకుండా.. జేడీఎస్‌పై ఆధారపడేలా ఫలి తాలు ఉంటాయన్న అంచనాలు నిజమయ్యా యని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో ఎవరు సీఎం అయినా తెలంగాణ ఫలితాలపై పెద్దగా ప్రభావం ఉండదని.. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడమనేది మాత్రం ఇక్కడ టీఆర్ఎస్కు సానుకూల అంశమని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా సంకీర్ణ రాజకీయాల్లో జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి వస్తే.. ఫెడరల్ ఫ్రంట్‌కు కొంత ప్రయోజనమని పేర్కొన్నట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామి మరొకరు సీఎం అయ్యారనే సందేశం ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు కట్టడి పడినట్టే! కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికలపై ప్రభావం ఉండేదని కేసీఆర్ భావిస్తున్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్లు చాలా మాట్లాడేవాళ్లు. ఇప్పుడు మాట్లాడటానికి ఏముంటది? మాట్లాడాలంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు తప్పించుకుని పోవాల్సిందే..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఉంటే కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుందని.. బీజేపీకి తెలంగాణలో చేసేదేమీ ఉండదని పేర్కొన్నట్టు వెల్లడిస్తున్నారు. మంత్రులు, సిట్టింగుల ఓటమిపై దృష్టి కర్ణాటకలో 19 మంది మంత్రులు, మూడో వంతు సిట్టింగులు ఓడిపోవడంపై కేసీఆర్ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించినట్టు సమాచారం. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక సంక్షేమ పథకాలను అమలుచేసింది. అయినా ఓటర్లు ఎందుకు సంతృప్తి చెందలేదు, మంత్రులు, సిట్టింగులు ఓడిపోవడానికి కారణాలేమిటనే దానిపై లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని.. కొందరు పార్టీ ముఖ్యులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. ఓటర్ల మానసిక స్థితి, ఓటింగ్ ట్రెండు వంటివాటిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని.. కర్ణాటకలోని పరిస్థితులకు, తెలంగాణకు మధ్య చాలా తేడా ఉందంటున్నారు. -
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
-
కర్నాటకం
-
కార్యకర్తల చెమట చుక్కలతో కమలం వికసిస్తుంది
-
కర్ణాటక కార్యకర్తలకు సెల్యూట్: మోదీ
న్యూఢిల్లీ: సంచలనాత్మక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విజయం అసామాన్యమైనదిగా, వ్యక్తిగతంగా ఎంతో అపూర్వమైనదిగా అభివర్ణించారు. ఎండకు వెరవకుండా.. కష్టాన్ని లెక్కచేయకుండా.. బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టడంలో అహర్నిశలూ శ్రమించిన కర్ణాటక కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని, కర్ణాటక సమగ్ర అభివృద్ధిలో బీజేపీ తన సంపూర్ణ పాత్రను నిర్వహిస్తుందని అన్నారు. ఢిల్లీ అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కార్యకర్తల చెమట చుక్కలతోనూ కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాది పార్టీ కానేకాదు: ‘‘బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర.. హిందీ మాట్లాడే రాష్ట్రం కాదు. అలాగే గుజరాత్, గోవా, ఈశాన్య భారతం.. ఇలా హిందీయేతర ప్రాంతాల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. అయినాసరే, బీజేపీని హిందీ రాష్ట్రాల పార్టీగానో, ఉత్తరాదికి చెందిన పార్టీగానో కొందరు ముంద్రవేస్తారు. అలాంటి వికృత ప్రయత్నాలు చేసేవాళ్లకు చెంపపెట్టులాంటిది.. నేటి కర్ణాటక ఫలితం! స్వాతంత్ర్యానంతరం దేశంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ అవేవీ దేశాన్ని ఒక్కటి చేయలేకపోయాయి. ఒక్క బీజేపీ మాత్రమే ఆ పనిచేయగలిగింది. అందుకే నలుమూలల్లోని ప్రజలు మనల్ని(బీజేపీని) ఆదరిస్తున్నారు’’ అని మోదీ చెప్పారు. ఉత్తర-దక్షిణం, కేంద్రం-రాష్ట్రాలు అంటూ చిచ్చుపెడుతున్నారు: ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, మరికొన్ని పార్టీలు కేంద్ర-రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలనుకున్నాయని ఆరోపించారు. వచ్చిపోయే ఎన్నికల కోసం దేశ మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు తగవని హెచ్చరించారు. దేశం మోదీని అర్థం చేసుకుంటున్నది: ‘‘కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాకు అక్కడి భాష రాదు. కానీ నేను చెప్పిన విషయాలన్నింటినీ వాళ్లు గ్రహించారు. వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతృప్తినిచ్చిన అంశమిది. భాషలకు అతీతంగా ఈ దేశం మోదీని అర్థం చేసుకుంటోందన్న ఆనందరం అనిర్వచనీయమైనది’’ అని మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర హింసను ఆయన ఖండించారు. -
మోదీ ఓ కార్యకర్తలా పనిచేశారు
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో నయా జోష్ నింపాయి. దీంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభినందన సభను నిర్వహించింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక ఫలితంపై ప్రధాని మోదీకి అమిత్‌షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానిలా కాకుండా ఓ కార్యకర్తలా పనిచేశారంటూ మోదీపై షా ప్రశంసలు గుప్పించారు. వరుసగా విజయదుందుభి... ‘ఒక విజయం తర్వాత ఒక విజయం బీజేపీ సొంతం చేసుకుంటోంది. 2014 నుంచి వరుసగా 15 విజయాలు సాధించాం. ఇప్పుడు ఈ కర్ణాటక విజయం చాలా ప్రియమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌లో పాలుపంచుకున్న ప్రజలకు, యెడ్యూరప్ప ఆధ్వర్యంలో పని చేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు. ప్రధాని సందేశాన్ని కార్యకర్తలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మోదీ కూడా స్వయంగా పర్యటించి ప్రభావం చూపారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓ ప్రధాని మాదిరి కాకుండా పార్టీ కార్యకర్తలా పని చేస్తున్నారు. ఆయనకు అభినందనలు’ అని షా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మిమల్ని చిత్తుగా ఓడించారు... కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ కేవలం 7 స్థానాల దూరంలోనే నిలిచింది. వందకు పైగా సీట్లు(కాంగ్రెస్+జేడీఎస్) వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, మిమల్ని ప్రజలు చిత్తుగా ఓడించారన్న విషయం గుర్తించండి. మీ సీఎం(సిద్ధరామయ్య) ఓ స్థానంలో ఓటమిపాలై, మరో స్థానంలో చావుతప్పి గెలిచారు. ఈ ఓటమితో మీకు భయం పట్టుకుంది. స్వాతంత్ర్యం తర్వాత పూర్తి స్థాయి మెజార్టీ ఏర్పడ్డ ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వమే. 2019లోనూ మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావటం తథ్యం. 2022లో న్యూ ఇండియా కలను బీజేపీ సాకారం చేస్తుంది’ అని షా చెప్పుకొచ్చారు. వారికి ఇదో గుణపాఠం... ‘ఈ సందర్భంగా దేశానికి ఓ సందేశం ఇవ్వదల్చుకున్నా. దేశవ్యతిరేక కూటములతో కాంగ్రెస్ జతకట్టింది. లింగాయత్‌లకు మైనార్టీ హోదా అంటూ నాటకాలాడింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడయ్యాక ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని బీజేపీ రద్దు చేసిందంటూ ఓ అబద్ధపు ప్రచారం చేశారు. జాతులు, డబ్బు, బలప్రయోగాల ద్వారా గెలవాలని ప్రయత్నించారు. చివరకు నకిలీ ఓటర్ కార్డులు సృష్టించారు. కానీ, ఈవేవీ బీజేపీ గెలుపును అడ్డుకోలేకపోయాయి. ప్రజలు భారీగా ఓట్లేసి అభివృద్ధికి(బీజేపీ) పట్టం కట్టారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారికి ఇదో పాఠం. కుటిల యత్నాలు ఎన్ని చేసినా జనం పట్టించుకోరని గమనించండి’ అంటూ అమిత్ షా తన ప్రసంగం ముగించారు. -
కాంగ్రెస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించారు
-
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
-
ఈవీఎంకు సరికొత్త అర్థం
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు భిన్నంగా వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా సహా రాజకీయ అంశాలపై స్పందించే టాలీవుడ్ రైటర్ కమ్ మేకర్ కోన వెంకట్ తన ట్విటర్లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీజేపీ గెలవటానికి ఈవీఎంలే కారణమంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)ను ఓపెన్ చేశారో.. అప్పుడే ఫలితం ఈవీఎం అని తేలింది. ఇంతకీ ఈవీఎం అంటే మరేమిటో కాదు.. ‘ఎవ్రీబడీ ఓటెడ్ ఫర్ మోదీ’(ప్రతీ ఒక్కరూ మోదీకి ఓటేశారు) అంటూ కామెంట్ చేశారు. దానికి కొనసాగింపుగా.. నో కామెంట్ అంటూ తెలివిగా వ్యాఖ్యానించారు. ‘చేయాల్సిన కామెంట్ అల్రెడీ చేసేశారు కదా! మీ టైమింగ్ సూపర్’ అంటూ అని కొందరు రీట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం అది సెటైర్ అంటూ కోనపై మండిపడుతున్నారు. When they opened EVMs today in Karnataka (Electronic voting machines) ... The results are... EVM (Everybody Voted for Modi) ... No comments!! — kona venkat (@konavenkat99) 15 May 2018 -
కర్ణాటక గవర్నర్ కింకర్తవ్యం!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ, 37 సీట్లతో తృతీయ పార్టీగా అవతరించిన జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాయి. తమకు జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు ఉందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ముందు ప్రకటించుకున్నారు. ఇక జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని, తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ గవర్నరే. ఆయన విధుల్లో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగంలోని 361 అధికరణం కింద కోర్టులకు లేవు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే 1952లో మొదటిసారి స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్ విధులను నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా వర్తిస్తోంది. అయితే కోర్టులు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై తమ అభిప్రాయలను వ్యక్తం చేయవచ్చు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాల్లో ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన పార్టీకన్నా ఎక్కువ సీట్లు వస్తే, ఆ కూటమికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పలు సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. అలాలేని సందర్భాల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించడమే సమంజసమని, అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్దేనని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. 1989లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాజీవ్ గాంధీని అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించారు. 1996లో లోక్‌సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ ప్రభుత్వం ఏర్పాటుకు అటల్ బిహారి వాజ్‌పేయిని ఆహ్వానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాల్సిందిగా బీజేపీ కోరవచ్చు. ఇక్కడే బీజేపీకి పెద్ద సమస్య వచ్చి పడింది. గోవాలో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఎన్నికల అనంతరం ఇతర పార్టీ సభ్యుల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నందున తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో 13 సీట్లే వచ్చాయి. కోర్టులో కూడా ఇదే వాదనలు వినిపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల అనంతరం ఏర్పడిన పార్టీల కూటమిని కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ విధి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వాదించారు. గత ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లురాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్‌గా ఉన్న నజ్మా హెప్తుల్లా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 30 సీట్లకుపైగా మద్దతు ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 60 సీట్లుగల అసెంబ్లీలో ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 31 మంది సభ్యుల మద్దతు లభించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీలను ఉదాహరణగా తీసుకుంటే కర్ణాటక గవర్నర్ కూడా జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. అందుకని యడ్యూరప్ప తెలివిగా జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు తనకుందని మెలిక పెట్టారు. ఆ వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల ఫలితాలు : భారీగా పతనమైన రూపాయి
ముంబై : కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇటు స్టాక్ మార్కెట్లు, అటు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపాయి. నేడు విడుదలైన ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోయే సరికి ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2017 జనవరి నుంచి తొలిసారి 68 మార్కుకు కిందకి క్షీణించింది. గత ముగింపు కంటే 59 పైసలు ఢమాల్‌మని 68.11 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్‌కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ వద్ద పౌండ్ స్టెర్లింగ్ కూడా రూ.91.28/92.00 వద్ద క్లోజైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన కర్నాటక ఫలితాలు, క్షణక్షణం మారుతూ వచ్చాయి. ఓటింగ్ ప్రారంభమైనప్పుడు కమలం విజయం దిశగా దూసుకెళ్లగా మార్కెట్లు జోరున ఎగిశాయి. కానీ మధ్యాహ్నం సమయానికల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయి, బీజేపీకు చెక్ పెట్టేందుకు జేడీఎస్, కాంగ్రెస్ పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్‌కు ప్రారంభ లాభాలన్నీ ఆవిరైపోయి, చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంలో ముగిసింది. నిఫ్టీ కూడా 10801 వద్ద సెటిలైంది. ఇటు రూపాయి విలువ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. మరోవైపు గత కొన్ని రోజులుగా కూడా ముడి చమురు ధరలు పెరుగుతుండటం రూపాయి విలువను దెబ్బతీస్తూ ఉంది. -
జేడీఎస్‌లో వర్గపోరు.. బీజేపీకి పీఠం..??
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా జేడీఎస్ పార్టీలో బీజేపీ వర్గపోరు చిచ్చును రాజేసింది. దేవేగౌడ రెండో తనయుడు రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో కర్ణాటక రాజకీయాలు మరోమారు కీలక మలుపు తీసుకున్నాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌తో రేవణ్ణ వర్గం మద్దతు పార్టీకి ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో జేడీఎస్‌లో చీలిక తలెత్తుతుందోమోనేనే అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు కుమారస్వామి మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను కలుసుకోనున్నారు. -
‘బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే’
సాక్షి, అమరావతి: కర్ణాటక ఎన్నికల విజయం గురించి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని, అదే కర్ణాటకలో జరిగిందని అన్నారు. అక్కడ బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలని, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే అని తేల్చి చెప్పారు. బీజేపీకి వచ్చింది కేవలం 36 శాతం ఓట్లు మాత్రమేనని, ప్రజా వ్వతిరేఖ నిర్ణయాల వల్లే ఆ పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని పేర్కొన్నారు. కన్నడ ప్రజలు మోదీ నియంతృత్వ విధానాల పట్ల విసిగిపోయారని తెలిపారు. కానీ బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిసింది. ఎన్నికల ఫలితాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన తెలిపారు. కర్ణాటకలో బీజేపీ సంఖ్యా పరంగా గెలిచినా.. ఓట్ల పరంగా ఓటమిపాలైందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనుమల రామకృష్ణుడు అన్నారు. 60 శాతానికి పైగా కన్నడ ప్రజలు బీజేపీని వ్యతిరేఖించారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌ను దెబ్బతీసింది ఆయనే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక ఓటమికి రాహుల్ గాంధీనే కారణమని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏఎన్ఐతో స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘రాహుల్ అపరిపక్వ రాజకీయాలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన సవాళ్లు అసంబద్ధంగా, మూర్ఖంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేదు. రాహుల్ ఇంక లండన్ వెళ్లి స్థిరపడటం మంచిది. బీజేపీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని నేను ముందు నుంచే చెబుతున్నా. లింగాయత్ అంశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీ అవినీతి నిర్మూలన ఎజెండా కన్నడ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు బీజేపీకి ఓట్లేశారు’ అని స్వామి తెలిపారు. ఇక ఈవీఎంల మూలంగానే బీజేపీ విజయం సాధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్వామి నవ్వి ఊరుకున్నారు. మరోవైపు జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు అంశంపై స్పందించని స్వామి, తన మిత్రుడైన యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. BJP MP Subramanian Swamy's reaction when asked about Congress raising questions on EVMs #KarnatakaElections2018 pic.twitter.com/ZWGSrdwaD8 — ANI (@ANI) 15 May 2018 -
కాంగ్రెస్ కుట్రలను ఖండిస్తున్నాం : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధారామయ్య చాముండేశ్వరిలో దారుణంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని, గవర్నర్ తొలుత అతి పెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. కన్నడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఫలితాలను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అయినా కాంగ్రెస్ అధికారం కోసం సిగ్గులేకుండా పాకులాడుతోందని మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీకి ఇంతటి ఆశావాహ ఫలితాలను అందించిన కన్నడ ప్రజలకు యడ్యూరప్ప ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో నిరంతరం పాటు పడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌లకు కర్ణాటకను పాలించే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రజల తీర్పును కాలరాసేందుకు యత్నించడం గర్హనీయమంటూ విమర్శలు చేశారు. -
‘కాంగ్రెస్-జేడీఎస్‌ల గురించి మాట్లాడను’
సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్-జేడీఎస్‌ల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన అనంతరం భవిష్యత్ ప్రణాళికను రచిస్తామని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. గవర్నర్ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. కాగా, యడ్యూరప్ప కూడా ఈ సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇంకోవైపు కర్ణాటకను చేజారకుండా కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి సమ్మతం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రతిపాదనను పంపింది. ఈ మేరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఢిల్లీ పయనం వాయిదా పడినట్లు సమాచారం. -
అప్పుడు బీజేపీని దెబ్బకొట్టినోళ్లే...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే బీజేపీ మాత్రం అత్యధిక సీట్లను గెల్చుకుని హస్తానికి షాక్ ఇచ్చింది. బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ ముఖ్యభూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వేరుపడి సొంతకుంపట్లతో పార్టీని దెబ్బ కొట్టిన ఈ ఇద్దరూ.. ఇప్పుడు కీలకంగా వ్యవహరించటం విశేషం. 2012లో బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు స్థాపించుకున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బకొట్టారు. గత ఎన్నికల్లో యెడ్యూరప్ప పార్టీ కర్ణాటక జనతా పక్ష(కేజేపీ) 9.8 శాతం ఓటింగ్‌తో ఆరు సీట్లు గెలుచుకోగా, శ్రీరాములు పార్టీ బదగర శ్రామిక రైతల కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. చివరకు బీజేపీ 20 శాతం ఓటింగ్‌తో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకుంది. యెడ్యూరప్ప, శ్రీరాములు దెబ్బకి బీజేపీకి లింగాయత్, గిరిజన తెగల ఓట్లు అప్పుడు దూరం అయ్యాయి. అంటే ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడి ఉంటే సీట్ల సంఖ్య పెరిగి ఉండేది. దీనికితోడు మిగతా ప్రాంతాల్లోనూ ఆయా పార్టీలకు పోలైన ఓట్లు, అన్ని కలుపుకుని బీజేపీకిమళ్లి ఉండిఉంటే సీట్లు కనీసం 80 వరకు గెలుచుకుని ఉండేదని విశ్లేషకులు ఆనాడు అభిప్రాయపడ్డారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు శాతం పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ఈ ఇద్దరు దోహదపడ్డారు. లింగాయత్ వర్గానికి సిద్ధరామయ్య ఇచ్చిన హామీని అంతగా పట్టించుకోని ప్రజలు, యెడ్డీ వైపే మొగ్గు చూపగా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలు కావటం గమనార్హం. -
బెంగళూరులో బీజేపీ సంబరాలు