సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. దాని ప్రభావంతో తెలంగాణలోనూ కొంత ఊపు వస్తుందన్న అంచనాలు తలకిందులు కావడం ఆ పార్టీ నేతలను నిరాశలో ముంచేసింది. దీంతో రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని.. పక్కా వ్యూహంతోనే కేసీఆర్‌ను ఎదుర్కోగలమనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓట్లన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పక్కా వ్యూహాలతో ముందుకెళ్లాల్సి ఉంటుందని నేతలు పేర్కొంటున్నారు.
కేసీఆర్‌ను తట్టుకునేదెలా..?
టీపీసీసీ ముఖ్యులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని.. అక్కడి తెలుగు ప్రజలను కలసి కాంగ్రెస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. కానీ కర్ణాటకలో అధికారం కోల్పోయే పరిస్థితితోపాటు త్వరలో జరుగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది.
త్వరలోనే ఎన్నికలు జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అక్కడ ఫలితాల సరళిపై చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ప్రతికూల ఫలితాలు వస్తే, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని... 2019 ఎన్నికలలో దీనిని ఆసరాగా తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతోందని.. తెలంగాణలో గెలిచి ఏం సాధిస్తుం దనే వాదనను ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో అన్ని శక్తులూ కలవాల్సిందే..
కర్ణాటకలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్, జేడీఎస్ కలిస్తే ఫలితాలు వేరుగా ఉండేవనే అభిప్రాయం టీపీసీసీ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో అలాంటి తప్పిదం జరగకుండా చూసుకోవాల్సి ఉంటుందని పలువురు నేతలు అంటున్నారు.
కేసీఆర్‌ను తట్టుకోవాలంటే ఎన్నికల కంటే ముందే టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. కర్ణాటక ఫలితం పునరావృతం అవుతుందని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటినుంచే ఎత్తులు, పొత్తుల విషయంలో, సామాజిక శక్తులను సమీకరించడంలో వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
బలమైన బృందం అవసరం
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో తెలంగాణ విషయంలో పకడ్బందీ ఎన్నికల బృందాన్ని నియమించుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘‘ఎదుటి శత్రువు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నాడు. కానీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నాడు.
శత్రువును ఎదుర్కోవాలంటే ఇప్పటినుంచే పకడ్బందీ కసరత్తు అవసరం. ఏ నాయకుడిని ఎక్కడ, ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల బృందాన్ని నడిపించే నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పుడే తగిన ఫలితాలు వస్తాయి..’అని టీపీసీసీ ముఖ్యుడొకరు పేర్కొన్నారు. మొత్తంగా కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment