
మీడియాతో మాట్లాడుతున్న యడ్యూరప్ప
సాక్షి, బెంగుళూరు : కాంగ్రెస్-జేడీఎస్‌ల గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన అనంతరం భవిష్యత్ ప్రణాళికను రచిస్తామని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు.
గవర్నర్ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. కాగా, యడ్యూరప్ప కూడా ఈ సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇంకోవైపు కర్ణాటకను చేజారకుండా కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది. జేడీఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయడానికి సమ్మతం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రతిపాదనను పంపింది. ఈ మేరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఢిల్లీ పయనం వాయిదా పడినట్లు సమాచారం.