పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీని కన్నడ ప్రజలు తిరస్కరించారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి సిద్ధారామయ్య చాముండేశ్వరిలో దారుణంగా ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.
అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని, గవర్నర్ తొలుత అతి పెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. కన్నడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఫలితాలను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. అయినా కాంగ్రెస్ అధికారం కోసం సిగ్గులేకుండా పాకులాడుతోందని మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీకి ఇంతటి ఆశావాహ ఫలితాలను అందించిన కన్నడ ప్రజలకు యడ్యూరప్ప ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో నిరంతరం పాటు పడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌లకు కర్ణాటకను పాలించే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రజల తీర్పును కాలరాసేందుకు యత్నించడం గర్హనీయమంటూ విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment