గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలా
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ, 37 సీట్లతో తృతీయ పార్టీగా అవతరించిన జేడీఎస్ పార్టీలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాయి. తమకు జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు ఉందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్ ముందు ప్రకటించుకున్నారు. ఇక జేడీఎస్ నాయకుడు కుమారస్వామి తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని, తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ గవర్నరే. ఆయన విధుల్లో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగంలోని 361 అధికరణం కింద కోర్టులకు లేవు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే 1952లో మొదటిసారి స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్ విధులను నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా వర్తిస్తోంది. అయితే కోర్టులు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై తమ అభిప్రాయలను వ్యక్తం చేయవచ్చు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాల్లో ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన పార్టీకన్నా ఎక్కువ సీట్లు వస్తే, ఆ కూటమికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పలు సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. అలాలేని సందర్భాల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించడమే సమంజసమని, అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌దేనని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది.
1989లో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాజీవ్ గాంధీని అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించారు. 1996లో లోక్‌సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ ప్రభుత్వం ఏర్పాటుకు అటల్ బిహారి వాజ్‌పేయిని ఆహ్వానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి సంప్రదాయాన్నే కొనసాగించాల్సిందిగా బీజేపీ కోరవచ్చు. ఇక్కడే బీజేపీకి పెద్ద సమస్య వచ్చి పడింది. గోవాలో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీని కాదని, ఎన్నికల అనంతరం ఇతర పార్టీ సభ్యుల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నందున తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో 13 సీట్లే వచ్చాయి. కోర్టులో కూడా ఇదే వాదనలు వినిపించి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల అనంతరం ఏర్పడిన పార్టీల కూటమిని కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ విధి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వాదించారు.
గత ఏడాది జరిగిన మణిపూర్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లురాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్‌గా ఉన్న నజ్మా హెప్తుల్లా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 30 సీట్లకుపైగా మద్దతు ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 60 సీట్లుగల అసెంబ్లీలో ఇతర పార్టీల సభ్యులతో కలిపి బీజేపీకి 31 మంది సభ్యుల మద్దతు లభించింది. గోవా, మణిపూర్ అసెంబ్లీలను ఉదాహరణగా తీసుకుంటే కర్ణాటక గవర్నర్ కూడా జేడీఎస్–కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలి. అందుకని యడ్యూరప్ప తెలివిగా జేడీఎస్‌లోని ఓ వర్గం మద్దతు తనకుందని మెలిక పెట్టారు. ఆ వర్గాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment