సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో నయా జోష్ నింపాయి. దీంతో మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభినందన సభను నిర్వహించింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక ఫలితంపై ప్రధాని మోదీకి అమిత్‌షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానిలా కాకుండా ఓ కార్యకర్తలా పనిచేశారంటూ మోదీపై షా ప్రశంసలు గుప్పించారు.
వరుసగా విజయదుందుభి... ‘ఒక విజయం తర్వాత ఒక విజయం బీజేపీ సొంతం చేసుకుంటోంది. 2014 నుంచి వరుసగా 15 విజయాలు సాధించాం. ఇప్పుడు ఈ కర్ణాటక విజయం చాలా ప్రియమైంది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌లో పాలుపంచుకున్న ప్రజలకు, యెడ్యూరప్ప ఆధ్వర్యంలో పని చేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు. ప్రధాని సందేశాన్ని కార్యకర్తలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మోదీ కూడా స్వయంగా పర్యటించి ప్రభావం చూపారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓ ప్రధాని మాదిరి కాకుండా పార్టీ కార్యకర్తలా పని చేస్తున్నారు. ఆయనకు అభినందనలు’ అని షా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
మిమల్ని చిత్తుగా ఓడించారు... కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘మ్యాజిక్ ఫిగర్‌కు బీజేపీ కేవలం 7 స్థానాల దూరంలోనే నిలిచింది. వందకు పైగా సీట్లు(కాంగ్రెస్+జేడీఎస్) వచ్చాయంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, మిమల్ని ప్రజలు చిత్తుగా ఓడించారన్న విషయం గుర్తించండి. మీ సీఎం(సిద్ధరామయ్య) ఓ స్థానంలో ఓటమిపాలై, మరో స్థానంలో చావుతప్పి గెలిచారు. ఈ ఓటమితో మీకు భయం పట్టుకుంది. స్వాతంత్ర్యం తర్వాత పూర్తి స్థాయి మెజార్టీ ఏర్పడ్డ ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వమే. 2019లోనూ మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావటం తథ్యం. 2022లో న్యూ ఇండియా కలను బీజేపీ సాకారం చేస్తుంది’ అని షా చెప్పుకొచ్చారు.
వారికి ఇదో గుణపాఠం... ‘ఈ సందర్భంగా దేశానికి ఓ సందేశం ఇవ్వదల్చుకున్నా. దేశవ్యతిరేక కూటములతో కాంగ్రెస్ జతకట్టింది. లింగాయత్‌లకు మైనార్టీ హోదా అంటూ నాటకాలాడింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడయ్యాక ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని బీజేపీ రద్దు చేసిందంటూ ఓ అబద్ధపు ప్రచారం చేశారు. జాతులు, డబ్బు, బలప్రయోగాల ద్వారా గెలవాలని ప్రయత్నించారు. చివరకు నకిలీ ఓటర్ కార్డులు సృష్టించారు. కానీ, ఈవేవీ బీజేపీ గెలుపును అడ్డుకోలేకపోయాయి. ప్రజలు భారీగా ఓట్లేసి అభివృద్ధికి(బీజేపీ) పట్టం కట్టారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారికి ఇదో పాఠం. కుటిల యత్నాలు ఎన్ని చేసినా జనం పట్టించుకోరని గమనించండి’ అంటూ అమిత్ షా తన ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment