సాక్షి, హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలి తాల ప్రభావం జాతీ య స్థాయిలో ఎలా ఉంటుందనే దానిపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన, బెంగళూరు పర్యటన, జనతాదళ్ (ఎస్)కు మద్దతు ప్రకటించే నాటికి ముందు, తరువాత కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను సునిశితంగా విశ్లే షించే పనిలో పడ్డారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాకుండా.. జేడీఎస్‌పై ఆధారపడేలా ఫలి తాలు ఉంటాయన్న అంచనాలు నిజమయ్యా యని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కర్ణాటకలో ఎవరు సీఎం అయినా తెలంగాణ ఫలితాలపై పెద్దగా ప్రభావం ఉండదని.. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడమనేది మాత్రం ఇక్కడ టీఆర్‌ఎస్‌కు సానుకూల అంశమని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా సంకీర్ణ రాజకీయాల్లో జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి వస్తే.. ఫెడరల్ ఫ్రంట్‌కు కొంత ప్రయోజనమని పేర్కొన్నట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామి మరొకరు సీఎం అయ్యారనే సందేశం ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు కట్టడి పడినట్టే!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో వచ్చే ఎన్నికలపై ప్రభావం ఉండేదని కేసీఆర్ భావిస్తున్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్లు చాలా మాట్లాడేవాళ్లు. ఇప్పుడు మాట్లాడటానికి ఏముంటది? మాట్లాడాలంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు తప్పించుకుని పోవాల్సిందే..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఉంటే కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుందని.. బీజేపీకి తెలంగాణలో చేసేదేమీ ఉండదని పేర్కొన్నట్టు వెల్లడిస్తున్నారు.
మంత్రులు, సిట్టింగుల ఓటమిపై దృష్టి
కర్ణాటకలో 19 మంది మంత్రులు, మూడో వంతు సిట్టింగులు ఓడిపోవడంపై కేసీఆర్ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించినట్టు సమాచారం. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక సంక్షేమ పథకాలను అమలుచేసింది. అయినా ఓటర్లు ఎందుకు సంతృప్తి చెందలేదు, మంత్రులు, సిట్టింగులు ఓడిపోవడానికి కారణాలేమిటనే దానిపై లోతుగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని.. కొందరు పార్టీ ముఖ్యులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
ఓటర్ల మానసిక స్థితి, ఓటింగ్ ట్రెండు వంటివాటిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని.. కర్ణాటకలోని పరిస్థితులకు, తెలంగాణకు మధ్య చాలా తేడా ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment