న్యూఢిల్లీ: సంచలనాత్మక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విజయం అసామాన్యమైనదిగా, వ్యక్తిగతంగా ఎంతో అపూర్వమైనదిగా అభివర్ణించారు. ఎండకు వెరవకుండా.. కష్టాన్ని లెక్కచేయకుండా.. బీజేపీని అతి పెద్ద పార్టీగా నిలబెట్టడంలో అహర్నిశలూ శ్రమించిన కర్ణాటక కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని, కర్ణాటక సమగ్ర అభివృద్ధిలో బీజేపీ తన సంపూర్ణ పాత్రను నిర్వహిస్తుందని అన్నారు. ఢిల్లీ అశోకా రోడ్డులోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కార్యకర్తల చెమట చుక్కలతోనూ కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఉత్తరాది పార్టీ కానేకాదు: ‘‘బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర.. హిందీ మాట్లాడే రాష్ట్రం కాదు. అలాగే గుజరాత్, గోవా, ఈశాన్య భారతం.. ఇలా హిందీయేతర ప్రాంతాల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. అయినాసరే, బీజేపీని హిందీ రాష్ట్రాల పార్టీగానో, ఉత్తరాదికి చెందిన పార్టీగానో కొందరు ముంద్రవేస్తారు. అలాంటి వికృత ప్రయత్నాలు చేసేవాళ్లకు చెంపపెట్టులాంటిది.. నేటి కర్ణాటక ఫలితం! స్వాతంత్ర్యానంతరం దేశంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ అవేవీ దేశాన్ని ఒక్కటి చేయలేకపోయాయి. ఒక్క బీజేపీ మాత్రమే ఆ పనిచేయగలిగింది. అందుకే నలుమూలల్లోని ప్రజలు మనల్ని(బీజేపీని) ఆదరిస్తున్నారు’’ అని మోదీ చెప్పారు.
ఉత్తర-దక్షిణం, కేంద్రం-రాష్ట్రాలు అంటూ చిచ్చుపెడుతున్నారు: ప్రసంగంలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పుట్టుకొచ్చిన పార్టీల్లో కొన్ని ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, మరికొన్ని పార్టీలు కేంద్ర-రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలనుకున్నాయని ఆరోపించారు. వచ్చిపోయే ఎన్నికల కోసం దేశ మూలాలను దెబ్బతీసే ప్రయత్నాలు తగవని హెచ్చరించారు.
దేశం మోదీని అర్థం చేసుకుంటున్నది: ‘‘కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నాకు అక్కడి భాష రాదు. కానీ నేను చెప్పిన విషయాలన్నింటినీ వాళ్లు గ్రహించారు. వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతృప్తినిచ్చిన అంశమిది. భాషలకు అతీతంగా ఈ దేశం మోదీని అర్థం చేసుకుంటోందన్న ఆనందరం అనిర్వచనీయమైనది’’ అని మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర హింసను ఆయన ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment