సాక్షి, బళ్లారి: రాష్ట్ర బీజేపీలో, అందులోను ఉమ్మడి బళ్లారి కాషాయ దళంలో చీలికలు ప్రస్ఫుటమయ్యయి. ఒకనాటి ఆప్త మిత్రులు నేడు కత్తులు నూరడం గమనార్హం. మాజీ మంత్రులు శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డి మధ్య విమర్శలు తీవ్ర తరమయ్యాయి. శ్రీరాములు ఒకప్పుడు ఎక్కడ ఉండేవాడు, ఆయన రాజకీయంగా ఎదిగేలా చేసింది నేనే. బీజేపీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లని, కానీ నాపై ఆరోపణలు ఎందుకు చేయాలి? ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారన్నది ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కర్మ ఎవరిని వదలదని, తనను కూడా వదలదని, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందేనని వేదాంతధోరణిలో అన్నారు. శ్రీరాములుకు బీజేపీలో ఉండడం ఇష్టం లేకపోతే ఏ నిర్ణయమైనా తీసుకోనీ, నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. ఢిల్లీ నాయకుల సహకారంతోనే తాను మళ్లీ బీజేపీలోకి వచ్చానన్నారు.
40 ఏళ్ల కిందట పరిస్థితి ఏమిటి?
40 సంవత్సరాల క్రితం శ్రీరాములు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఆయన ఎదగడానికి తాను ఎంతో శ్రమించానని గత పరిణామాలను జనార్దనరెడ్డి ఏకరువు పెట్టారు. అప్పట్లో శ్రీరాములుపై ఓ మర్డర్ కేసు ఉండేదని, ఆయన్ను సన్మార్గంలోకి తీసుకుని వచ్చాను. ఎమ్మెల్యే, మంత్రి కావడానికి పాటుపడ్డాను. మొళకాల్మూరులో నిలబడినప్పుడు ఒక్క రోజు అయినా అక్కడ ప్రచారం చేశారా? మరి నేను అక్కడే మకాం వేసి గెలిపించలేదా అని అన్నారు. శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరే యత్నాల్లో ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోందని జనార్దనరెడ్డి చెప్పడం విశేషం. తాను నోరు విప్పితే విచారణ సంస్థలు వచ్చి తనిఖీ చేయాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.
శ్రీరాములుకు ఢిల్లీ పెద్దల పిలుపు
సండూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి శ్రీరాములు పనిచేయకపోవడమే కారణమని పార్టీ ఇన్‌చార్జి రాధామోహన్‌దాస్ అగర్వాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం, దీంతో శ్రీరాములు.. గాలి జనార్దనరెడ్డిపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ అధిష్టానం మేలుకుంది. గురువారం బళ్లారిలో ఉన్న శ్రీరాములుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా ఫోన్ చేసి మాట్లాడారు. మాటల యుద్ధం ఆపాలని, ఢిల్లీకి వచ్చి అంతా మాట్లాడాలని సూచించారు. వచ్చే వారంలో తాను ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలను కలిసి జరిగిన వాస్తవాలను వివరిస్తానని శ్రీరాములు బదులిచ్చినట్లు సమాచారం. అలాగే పలువురు రాష్ట్ర సీనియర్లతోనూ ఫోన్ చర్చలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment