బడుగులను ఓటు బ్యాంకుగా చూస్తోంది
సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీనవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తోందని బీజేపీ అధ్య క్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఈ వర్గాల పురోభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఎన్నికలకు ముందు ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీనిచ్చి వీటి అమల్లో పూర్తిగా విఫలమయిందన్నారు.
శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసుల్లో మార్పునకు సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ భిక్కునాథ్ నాయక్, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతా సాంబ మూర్తి, ఎస్.మల్లారెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, కిషన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.