పెరిగిపోతున్న శ్రమ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటంతో కార్మికవర్గం శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నదని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యూఎఫ్‌టీయూ) గౌరవాధ్యక్షుడు జార్జియోస్ మావ్రికోస్ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రపంచ ట్రేడ్ యూనియన్స్ ఉద్యమ చరిత్ర– ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు’ అనే అంశంపై సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ సంయుక్తంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వర్గం టెక్నాలజీ పేరుతో యువతరాన్ని దోపిడీ చేస్తోందని విమర్శించారు. ఈ దోపిడీపై కార్మికవర్గాన్ని చైతన్యపర్చాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపైనే ఉందని అన్నారు. పోరాటంతోనే హక్కుల సాధనదక్షిణ కొరియాలో కార్మికవర్గం ఐక్యంగా పోరాడి గొప్ప విజయాలు సాధించిందని మావ్రికోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వలస కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగం పెరగడంతో తక్కువ జీతాలతో కార్మికులు సామాజిక భద్రతను కోల్పోతున్నారని తెలిపారు. పోరాటం చేయకుండా ఏదీ సాధించలేమన్న విషయాన్ని కార్మికవర్గానికి అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.కార్మికవర్గ పోరాటాల చరిత్రను తెలుసుకోవడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగి, బహుళజాతి సంస్థలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని అభిప్రాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసినట్టు కనిపిస్తుందని, కానీ పాలస్తీనా వైపు నుంచి చరిత్రను అధ్యయనం చేస్తే ఆ దృష్టికోణం వేరుగా ఉంటుందని తెలిపారు. సామ్రాజ్యవాదం తనకు అనుకూలమైన వాదనను మాత్రమే యువతరానికి, ప్రపంచానికి పరిచయం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐయూటీయూసీ, ఏఐబీఈఏ నేతలు చుక్క రాములు, మహ్మద్ యూసుఫ్, పాలడుగు భాస్కర్, బాలరాజ్, రాజేంద్ర, బీఎస్ రాంబాబు, సీహెచ్ నర్సింగరావు, డబ్ల్యూఎన్టీయూ నేతలు స్వదేశ్ దేవాయ్, ఆర్కోచొంతియా అనస్థాసాకి పాల్గొన్నారు.