సాక్షి, చెన్నై : ఏర్కాడులోని డీఎండీకే ఓటు బ్యాంకు ఎవరికి దక్కుతుందోనన్న చర్చ మొదలైంది. ఆ పార్టీ మద్దతను కూడగట్టుకునేందుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తమ అధినేత కెప్టెన్ విజయకాంత్ మౌన ముద్రలో ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళానికి దారి తీస్తున్నది. ఏర్కాడులో డీఎండీకేకు కనీస ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు చుక్కలు చూపించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మానికి కట్టుబడి అన్నాడీఎంకే గెలుపునకు ఆ పార్టీ కృషి చేయడంతో పెరుమాల్ గట్టెక్కారు.
ప్రస్తుతం పెరుమాల్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఆ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండేందుకు కెప్టెన్ నిర్ణయించడంతో డీఎంకే, అన్నాడీఎంకే దృష్టి ఆ పార్టీ ఓటు బ్యాంక్ మీద పడింది. ఎన్నికల్ని బహిష్కరించిన తమ అధినేత విజయకాంత్ మద్దతును ఎవరికి ప్రకటిస్తారోనన్న ఎదురు చూపుల్లో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. ఎన్నికలను డీఎండీకే బహిష్కరించిందో లేదా తమకు మద్దతు ఇవ్వం డంటూ స్థానిక నాయకుల ఇళ్ల ముంగిట ఆది వారం ఉదయాన్నే డీఎంకే వర్గాలు వాలాయి.
ఆ నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు అధికార అన్నాడీఎంకే కసరత్తు చేస్తోంది. దీంతో డీఎండీకే ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు కుస్తీలు పడుతున్నాయి. అయితే తమ నేత విజయకాంత్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారో వారి గెలుపునకు కృషి చేస్తామంటూ కొందరు నాయకులు పేర్కొన్నారు. విజయకాంత్ మౌనంగా ఉండటంతో ఎవరి పక్క పనిచేయాలో, ఒక వేళ పని చేస్తే పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న ఆందోళన నేతల్ని వెంటాడుతోంది. కొందరు నేతలు అయితే, చాప కింద నీరులా అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపునకు సహకరించే పనిలో పడ్డారు.
రాయబారం పంపేందుకు డీఎంకే యత్నం
తమకు మద్దతు ఇవ్వాలంటూ విజయకాంత్ వద్దకు దూతను పంపించేందుకు డీఎంకే సిద్ధం అవుతోన్నది. ఇప్పటికే అన్ని పార్టీలకు రాసినట్టుగా విజయకాంత్‌కు డీఎంకే అధినేత కరుణానిధి మద్దతు లేఖ పంపించి ఉన్నారు. దీనికి ఇంత వరకు సమాధానం రాలేదు. ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్నందున, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్‌ను విజయకాంత్ వద్దకు పంపిం చేందుకు కరుణానిధి ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే ఓట్లు డీఎంకేకు కలసి వచ్చిన పక్షంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా మారడం తథ్యం. అయితే, అధికార అన్నాడీఎంకే తాయిలాలకు, ఒత్తిళ్లకు డీఎండీకే స్థానిక నాయకులు తలొగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
మద్దతు ఎవరికో...!
Published Mon, Nov 18 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement