గుజరాత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. కాగా, ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి.
ఇలాంటి తరుణంలో అధికార బీజేపీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుజరాత్ పీసీసీ చీఫ్ జగదీష్ ఠాకూర్.. మహేంద్రసింగ్ వాఘేలాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక, 2017 గుజరాత్ ఎన్నికలకు ముందు వాఘేలా బీజేపీలో చేరారు. అంతకుముందు, వాఘేలా 2012-2017 మధ్య ఉత్తర గుజరాత్‌లోని బయాద్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయితే, తిరిగి సొంత గూటికి చేరిన అనంతరం మహేంద్రసింగ్ వాఘేలా మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో ఇమడలేకపోయానని చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరినా గత ఐదేండ్లలో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నానని అన్నారు. ఇక కాంగ్రెస్ నేతగా పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తానని మహేంద్రసింగ్ వాఘేలా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మహేంద్రసింగ్ వాఘేలా సమాధానం ఇచ్చారు. అది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో వాటిని నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
మహేంద్రసింగ్ వాఘేలా, ఆయన తండ్రి శంకర్‌సింగ్ వాఘేలా, మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడానికి ముందు ఆగస్టు 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్‌ను వీడిన మూడు నెలల్లోనే మహేంద్రసింగ్ వాఘేలా బీజేపీలో చేరారు. ఇక, శంకర్ సింగ్ వాఘేలా మాత్రం ఇటీవలే ప్రజా జనశక్తి పార్టీని ప్రారంభించారు.
MLA Mahendrasinh Vaghela joins Congress in the presence of PCC Chief Jagdish Thakor and other senior leaders.pic.twitter.com/KqCcpwcut6
— Sarbojit Sinha (@Sarbojit_iyc) October 28, 2022
Comments
Please login to add a commentAdd a comment