కాంగ్రెస్‌ను వీడిన అల్కా లాంబా
కాంగ్రెస్‌ను వీడిన అల్కా లాంబా
Published Thu, Dec 26 2013 11:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ బ్రిగేడ్‌లో సభ్యురాలని భావించే అల్కాలాంబా కాంగ్రెస్‌ను వీడారు. 20 సంవత్సరాలుగా సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికానని, ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆమె వెల్లడించారు. ఆప్‌లో చేరే విషయమై ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌ను కూడా కలిశారు. ఆప్ మాత్రం ఆమె పార్టీలో చేరుతున్న విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అల్కాలాంబా 1995లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డూసూ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల తరువాత ఆమె ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్, ఏఐసీసీలో ఆమె కీలక పదవులు నిర్వహించారు. అయితే లాంబా ఇప్పుడు సొంత పార్టీపై అనాసక్తిని, ఆప్ పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో కొందరు వ్యక్తులు మూసిన తలుపుల వెనుక నిర్ణయం తీసుకుంటారని ఆరోపించారు.
ఆప్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రజలను సంప్రదిస్తుందని ప్రశంసించారు. తాను యోగేంద్ర యాదవ్‌ను కలిశానని, ఆప్‌కు మద్దతు ఇస్తానని చెప్పానని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ అట్టడుగు వర్గాలతో సంబంధం కొరవడినట్లుగా నాకు మొదటి నుంచి అనిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని సోనియా, రాహుల్ గాంధీకి కూడా చెప్పాను. కాంగ్రెస్ దుస్థితిని గురించి, మున్ముందు దానికి పట్టబోయే గతి గురించి లేఖలు రాశాను. అయినా ఏ ఒక్కరూ పిలిచి నాతో మాట్లాడలే దు’ అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి కూడా కార్యకర్తలనే బాధ్యులను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కొందరు నేతల పార్టీగా మారిపోయిందని అల్కాలాంబా ఆరోపించారు.
Advertisement
Advertisement