National Students Union of India
-
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ ధర్నా
బెంగళూరు: అవినీతికి పాల్పడుతున్న కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ధర్నాకు దిగారు. లలిత్ మోదీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాపాడే ధోరణిలో అమిత్ షా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, నగరానికి ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆదివారమిక్కడి కాంగ్రెస్ భవన్ ఎదుట ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ మహా సంపర్క అభియాన్‌ను నిర్వహించే ప్యాలెస్ గ్రౌండ్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్ఎస్యూఐ నేతలు మొదట భావించారు. అయితే ఆ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడంతో కాంగ్రెస్ భవన్ ఎదుట తమ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కాంగ్రెస్‌ను వీడిన అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ బ్రిగేడ్‌లో సభ్యురాలని భావించే అల్కాలాంబా కాంగ్రెస్‌ను వీడారు. 20 సంవత్సరాలుగా సభ్యురాలిగా ఉన్న కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికానని, ఆమ్ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆమె వెల్లడించారు. ఆప్‌లో చేరే విషయమై ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌ను కూడా కలిశారు. ఆప్ మాత్రం ఆమె పార్టీలో చేరుతున్న విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అల్కాలాంబా 1995లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డూసూ) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల తరువాత ఆమె ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్, ఢిల్లీ కాంగ్రెస్, ఏఐసీసీలో ఆమె కీలక పదవులు నిర్వహించారు. అయితే లాంబా ఇప్పుడు సొంత పార్టీపై అనాసక్తిని, ఆప్ పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో కొందరు వ్యక్తులు మూసిన తలుపుల వెనుక నిర్ణయం తీసుకుంటారని ఆరోపించారు. ఆప్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రజలను సంప్రదిస్తుందని ప్రశంసించారు. తాను యోగేంద్ర యాదవ్‌ను కలిశానని, ఆప్‌కు మద్దతు ఇస్తానని చెప్పానని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ‘20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ అట్టడుగు వర్గాలతో సంబంధం కొరవడినట్లుగా నాకు మొదటి నుంచి అనిపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని సోనియా, రాహుల్ గాంధీకి కూడా చెప్పాను. కాంగ్రెస్ దుస్థితిని గురించి, మున్ముందు దానికి పట్టబోయే గతి గురించి లేఖలు రాశాను. అయినా ఏ ఒక్కరూ పిలిచి నాతో మాట్లాడలే దు’ అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి కూడా కార్యకర్తలనే బాధ్యులను చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ కొందరు నేతల పార్టీగా మారిపోయిందని అల్కాలాంబా ఆరోపించారు. -
మోడీ ఇలాకాలో రాహుల్ పర్యటన
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మాదాబాద్‌లోని శబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆఫీస్ బేరర్లు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొని రాహుల్ ప్రసంగిస్తారు. అందులోభాగంగా విద్యార్థి నాయకులు, స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గతంలో పోటీ చేసిన రాజ్‌కోట్ శాసనసభ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు కార్యకర్తలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.