
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది.
నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు.
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం