Delhi University Elections
-
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
పూల్ పార్టీలు.. బర్గర్లతో లొంగదీసుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీని దారుణంగా మట్టికరిపించి సాధించిన గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఎన్‌ఎస్‌యూఐది నిజమైన గెలుపు కానే కాదని అంటోంది ఏబీవీపీ. తప్పుడు ప్రచారంతో వాళ్లు విజయం సాధించారని ఏబీవీపీ నేత, డీయూఎస్‌యూ కార్యదర్శి మహమేధా నగర్ ఆరోపిస్తున్నారు. ’ పూల్ పార్టీలు, బర్గర్లను విద్యార్థులకు ఆశగా చూపి లొంగదీసుకున్నారు. ప్రలోభాల పర్వంగా సాగిన ఈ ఎన్నికల్లో వారిది నైతిక విజయమే కాదు‘ అని ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో మహమేధా తెలిపారు. అయితే ఎన్ఎస్యూఐ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. విద్యార్థులు ఈసారి రాజకీయాలు కాదు.. మార్పును కోరుకున్నారు. పురోగతి కోసమే తమకు బాధ్యతలు అప్పజెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ కొత్త అధ్యకుడు రాఖీ టస్సీడ్ తెలిపారు. ఇక నిరుద్యోగ నిర్మూలనలో కేంద్రప్రభుత్వం విఫలం అయినందుకే ఈ ఫలితం వెలువడిందని ఆప్ చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఉంటుందని, బీజేపీపై వ్యతిరేకత మొదలైందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు.