Delhi University Students Union
-
ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్ఎస్యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్ఎస్యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
ప్రత్యేక అవకాశాన్ని పునరుద్ధరించాలి'
న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల జవాబుపత్రాల తిరిగి మూల్యాంకణానికి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ కారణాల వల్ల నిర్దేశించిన కాలానికి డిగ్రీ కోర్సులను పూర్తి చేయని విద్యార్థులకు మరో ‘ప్రత్యేక అవకాశం ఇవ్వాలని’ విద్యార్థి సంఘాలు వర్సిటీ అధికారులను కోరుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతరత్రా పరిస్థితుల వల్ల కోర్సును పూర్తి చేయని విద్యార్థులకు ఈ అవకాశం గొప్పసహాయకారిగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్‌యూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ అభిప్రాయపడ్డారు. పరీక్షల విభాగంపై అధిక ఒత్తిడి పడుతున్నదనే కారణంతో గతంలో ఉన్న ఈ ‘ప్రత్యేక అవకాశాన్ని’ వర్సిటీ రద్దు చేసిందని చెప్పారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు వర్సీటీ రూల్స్ ప్రకారం ప్రవేశం పొందిన తేదీ నుంచి (డిగ్రీని ఆరు సంవత్సరాల్లో, పీజీని నాలుగు సంవత్సరాల్లో )పూర్తి చేయాల్సి ఉంది. ‘ ప్రత్యేక అవకాశం కల్పించడం ద్వారా మధ్యలో చదువులు నిలిపేసిన విద్యార్థులు పెండింగ్ పరీక్షలు రాయడానికి వీలుకలిగింది. కానీ రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని డీయూ రద్దు చేసింది. ఈ విషయమై 32 మంది విద్యార్థులు ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల విజ్ఞప్తిని పరిశీలించి అవకాశం ఇవ్వాలని హైకోర్టు డీయూ అకాడమిక్ కౌన్సిల్‌కు సూచించింది. విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించడం చట్టవ్యతిరేకమని డీయూ నిబంధనల్లో ఎక్కడా లేదని గుర్తు చేసిందని డీయూ మీడియా కోఆర్డినేటర్, విద్యార్థుల సంక్షేమం జాయింట్ డీన్ మాలె నీరవ్ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి ‘ప్రత్యేక అవకాశాన్ని’ విద్యార్థులకు కల్పించామని డీయూ అధికారి పేర్కొన్నారు. మళ్లీ ఈ అవకాశాన్ని తిరిగి కల్పించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. -
ఇక దూసుకుపోదాం!
సాక్షి, న్యూఢిల్లీ:నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగాప్రకటించడంతోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం(డూసూ) ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ విజయం సాధించడంతో ఢిల్లీ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధ్యక్షుడు శుక్రవారం చేసిన ప్రకటనతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు మరింత మెరుగుపడతాయనే ఆశాభావాన్ని స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ముస్లిం ఓటర్లు పార్టీకి మరింత దూరమయ్యే ప్రమాదముందనే వాదనను అంగీకరిస్తున్నప్పటికీ మొత్తం మీద ఈ ప్రకటన ప్రభావం సానుకూలంగానే ఉంటుందంటున్నారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం, మోడీపై పార్టీ ప్రకటన తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఇదే ఉత్సాహంతో సెప్టెంబర్ 29న నరేంద్ర మోడీతో నిర్వహించే ర్యాలీని మరింత గొప్పగా నిర్వహిస్తామని చెబుతున్నారు. ర్యాలీ విధానసభ ఎన్నికల కోసం పార్టీ చేస్తోన్న సన్నాహాలకు మరింత ఊపు తీసుకొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ‘లిట్మస్ టెస్ట్’గా పరిగణించే ఢిల్లీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం సాధించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉండనుందో ముందుగానే చెప్పిందంటున్నారు. డూసూ ఎన్నికల ప్రచారం కోసం ఏబీవీపీ నరేంద్ర మోడీ పోస్టర్లను ఉపయోగించిన వైనాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. డూసూ ఎన్నికలలో ఏబీవీపీ ఓటమిని మోడీ ఓటమిగా అభివర్ణించిన ఎన్ఎస్యుఐ తాజా పరిణామంతో మట్టికరిచిందని, ఏబీవీపీ గెలిపించి విద్యార్థులు మోడీని గెలిపించారని అభివర్ణిస్తున్నారు. నరేంద్ర మోడీ యువతకు నేత అని డూసూ ప్రెసిడెంట్‌గా గెలిచిన అమన్ అవానా, ఉపాధ్యక్షుడుగా గెలిచిన ఉత్కర్ష్ చౌదరి, జాయింట్ సెక్రటరీగా గెలచిన రాజు రావత్ అభిప్రాయపడ్డారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచినట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమాగా చెబుతున్నారు. కాగా 2014 సాధారణ ఎన్నికల కోసం ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించినందున రానున్న విధానసభ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాల్సిన ఆవరముందని స్థానిక బీజేపీ నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఢిల్లీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంపై ఆర్ఎస్ఎస్ మేధోమథన సమావేశం జరిపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నాలుగు రాష్ట్రాల్లో ఒక్క ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థులను పార్టీ ప్రకటించిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు గుర్తుచేశారు. ఢిల్లీ ఎన్నికల కోసం ‘టీమ్ బీజేపీ’గా ప్రజల ముందుకు వెళ్లాలని పార్టీ గతంలో నిర్ణయించినప్పటికీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఢిల్లీలో పరిస్థితి మారిపోయిందన్నారు. అవినీతి మచ్చలేని నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి వెనుక ఆర్ఎస్ఎస్ తెచ్చిన ఒత్తిడిని పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీలో అవినీతి మచ్చ అంటని నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ హర్షవర్ధన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోందని కూడా చెబుతున్నాయి.