ఇక దూసుకుపోదాం!
Published Sat, Sep 14 2013 11:31 PM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM
సాక్షి, న్యూఢిల్లీ:నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగాప్రకటించడంతోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం(డూసూ) ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ విజయం సాధించడంతో ఢిల్లీ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధ్యక్షుడు శుక్రవారం చేసిన ప్రకటనతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు మరింత మెరుగుపడతాయనే ఆశాభావాన్ని స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ముస్లిం ఓటర్లు పార్టీకి మరింత దూరమయ్యే ప్రమాదముందనే వాదనను అంగీకరిస్తున్నప్పటికీ మొత్తం మీద ఈ ప్రకటన ప్రభావం సానుకూలంగానే ఉంటుందంటున్నారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం, మోడీపై పార్టీ ప్రకటన తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఇదే ఉత్సాహంతో సెప్టెంబర్ 29న నరేంద్ర మోడీతో నిర్వహించే ర్యాలీని మరింత గొప్పగా నిర్వహిస్తామని చెబుతున్నారు.
ర్యాలీ విధానసభ ఎన్నికల కోసం పార్టీ చేస్తోన్న సన్నాహాలకు మరింత ఊపు తీసుకొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ‘లిట్మస్ టెస్ట్’గా పరిగణించే ఢిల్లీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం సాధించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉండనుందో ముందుగానే చెప్పిందంటున్నారు. డూసూ ఎన్నికల ప్రచారం కోసం ఏబీవీపీ నరేంద్ర మోడీ పోస్టర్లను ఉపయోగించిన వైనాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. డూసూ ఎన్నికలలో ఏబీవీపీ ఓటమిని మోడీ ఓటమిగా అభివర్ణించిన ఎన్‌ఎస్‌యుఐ తాజా పరిణామంతో మట్టికరిచిందని, ఏబీవీపీ గెలిపించి విద్యార్థులు మోడీని గెలిపించారని అభివర్ణిస్తున్నారు. నరేంద్ర మోడీ యువతకు నేత అని డూసూ ప్రెసిడెంట్‌గా గెలిచిన అమన్ అవానా, ఉపాధ్యక్షుడుగా గెలిచిన ఉత్కర్ష్ చౌదరి, జాయింట్ సెక్రటరీగా గెలచిన రాజు రావత్ అభిప్రాయపడ్డారు.
డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచినట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమాగా చెబుతున్నారు. కాగా 2014 సాధారణ ఎన్నికల కోసం ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించినందున రానున్న విధానసభ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాల్సిన ఆవరముందని స్థానిక బీజేపీ నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఢిల్లీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ మేధోమథన సమావేశం జరిపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నాలుగు రాష్ట్రాల్లో ఒక్క ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థులను పార్టీ ప్రకటించిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు గుర్తుచేశారు. ఢిల్లీ ఎన్నికల కోసం ‘టీమ్ బీజేపీ’గా ప్రజల ముందుకు వెళ్లాలని పార్టీ గతంలో నిర్ణయించినప్పటికీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఢిల్లీలో పరిస్థితి మారిపోయిందన్నారు. అవినీతి మచ్చలేని నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ తెచ్చిన ఒత్తిడిని పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీలో అవినీతి మచ్చ అంటని నేతగా గుర్తింపు పొందిన డాక్టర్ హర్షవర్ధన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆర్‌ఎస్‌ఎస్ ఒత్తిడి తెస్తోందని కూడా చెబుతున్నాయి.
Advertisement
Advertisement