అసలు ఓటమి భారతీయతదే! | Yogendra Yadav writes on nationality | Sakshi
Sakshi News home page

అసలు ఓటమి భారతీయతదే!

Published Sun, Feb 19 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

అసలు ఓటమి భారతీయతదే!

అసలు ఓటమి భారతీయతదే!

సందర్భం
జేఎన్‌యూలో జరిగిన ఫిబ్రవరి 9 సంఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాకు ఇందోర్‌ నుంచి వచ్చిన ఒక టెలిఫోన్‌ కాల్‌ గుర్తుకొచ్చింది. ఆ రోజుల్లో దేశమంతటా దేశభక్తులకూ, దేశద్రోహులకూ ముద్రలు వేసే క్రమం జోరుగా సాగుతోంది. జేఎన్‌యూయైట్లూ, భుజానికి జోలెసంచీలు వేలాడేసుకునేవాళ్లూ, గడ్డం కలిగి ఉన్న వాళ్లూ వేధింపులకు గురవుతున్న రోజులవి. నేను కూడా టీవీ చర్చల్లో పాల్గొన్నాను. రెండు బృందాలకు విడిగా మూడో దృక్పథాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే ఆ కాల్‌ వచ్చింది.

‘నేను మిమ్మల్ని బాగా గౌరవిస్తాను. మీరు చాలా అర్థవంతంగా, గంభీ రంగా మాట్లాడుతారు. మీరు ఏదో ఒక పార్టీ పక్షం వహించడానికి బదులు దేశ ప్రయోజనాలనే పరమావధిగా భావిస్తారు. కానీ జేఎన్‌యూ సమస్యలో మీరు దేశద్రోహుల వైపు ఎందుకు నిలబడ్డారు?‘ ఇదీ అటువైపు నుంచి వచ్చిన ప్రశ్న. కాలర్‌ నిజంగానే బాధలో ఉన్నారు. నేను ఈ సమస్యకు సంబంధించిన వాస్త వాల్ని ఆయనకు తెలిపాను. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిందని చెబుతున్న వాటి పట్ల అంత గట్టి నమ్మకంతో ఎందుకున్నారని ప్రశ్నించాను. కోర్టు ఆవ రణలో కన్హయ్యకుమార్‌పై దాడి చేసి కొట్టిన సంఘటన గురించి అడిగాను. అట్లాగే జాతీయవాదం విషయంలో జేఎన్‌యూకు చెందిన చాలా మంది అభిప్రాయంతో నాకు ఏకీభావం లేదని కూడా స్పష్టం చేశాను. అయితే ఆ సంఘటనలకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా నేను వాళ్లతో ఏకీభవి స్తాను. ఏం చెప్పినా నా మాటలు కాలర్‌ను సంతృప్తి పర్చలేకపోయాయి. ఎందుకంటే అప్పుడాయన వాస్తవాలను పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ‘ఒకవైపు భారతమాతకు అవమానం జరుగుతుంటే మీరు అవీ ఇవీ చెబు తున్నారు. అసలు ప్రశ్నపై మీరే వైపు నిలబడి ఉన్నారు?‘ అని సూటిగా అడిగారాయన. ఆయన ఆవేశంతో ఉన్నట్టుగా అనిపించింది. మరెప్పుడైనా శాంతంగా మాట్లాడుకోవచ్చని భావించాను.

ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆయనతో సంభాషణ జరగలేదు. ఇందోర్‌ గుర్తుంది కానీ ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు గానీ, అతని ఫోన్‌ నంబరు గానీ ఏవీ నా దగ్గర లేవిప్పుడు. ఇప్పుడు, ఈ సంఘటన జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నేను మనసులోనే ఆయనతో సంభాషిస్తున్నాను. అదేమిటో మీరూ వినండి.

నిరుడు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా ఆవేశంగా ఉన్నారు కదా. కానీ జేఎన్‌యూలో జరిగిన పరిణామాల్లో చివరకు వెల్లడైన వాస్తవాలేమిటో చూడండి. మీరు ఏ వీడియో టేపు గురించి చాలా ఆవేశంగా మాట్లాడారో, చివరకు ఆ టేపు అసలైంది కాదనీ, నకిలీదనీ తేలిపోయింది. దానిని తారుమారు చేసి అందులో రెచ్చగొట్టే మాటల్ని జొప్పించారు. ఇప్పటికి సంవత్సర కాలం గడచిపోయింది కదా. జేఎన్‌యూ విద్యార్థి నేతలు నిజంగానే భారత్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేసినట్టయితే పోలీసులు వాటికి సంబంధించిన సాక్ష్యాలను ఇంకా కోర్టుకు ఎందుకు సమర్పించలేకపోయారో మీరే ఆలోచించండి. మరో వైపు, కన్హయ్యకుమార్‌పై కోర్టు ఆవరణలో పట్టపగలే దాడి చేసి కొట్టారు కదా. సంవత్సరం గడచినా పోలీసులు నేరస్థులపై కేసు నమోదు చేయడానికి కూడా సిద్ధపడడం లేదు. అందుకే ఇదంతా మీ లాంటి వారిలో భావావేశాలను రెచ్చగొట్టడం కోసమే ఒక చిన్న విషయాన్ని అనవసరంగా ఒక పెద్ద వివాదంగా సృష్టించారేమో ఆలోచించండి. వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేశారేమో?

ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను లేవనెత్తడం ద్వారా నేను విష యాన్ని పక్కదారి పట్టిస్తున్నానని మీరు భావించవద్దు. విషయం కేవలం వాస్తవ సంఘటనలకు మాత్రమే పరిమితమైంది కాదని మీరన్న మాటలు నాకు గుర్తు న్నాయి. దీన్ని నేను అంగీకరిస్తాను. మీ దృష్టిలో ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం కూడా కాదు. ప్రస్తుత పరిస్థితిలో బాహాటంగా చేసే దేశ వ్యతిరేక నినాదాలను పట్టించుకోకుండా ఉండగలిగే స్థితిలో మనం లేమన్న విష యాన్ని నేనూ అంగీకరిస్తాను. ఒక పెద్ద దేశం.. ఆత్మవిశ్వాసం తొణకిసలాడే దేశం ఇలాంటి చర్యల పట్ల ఊరకే నవ్వేసి ఉండిపోగలుగుతుంది. కానీ మన మింకా అక్కడి వరకు చేరుకోలేదు. మనం జాతి పట్ల విధేయంగా ఉన్నామా, లేదా అన్నదే అసలు సమస్య అని మీరన్నారు. ఇదే ప్రశ్నను నేను మరో విధంగా అడుగుతాను–జాతి పట్ల మనం ఏ భావాన్ని కలిగి ఉండాలి? దేశంపట్ల అభి మానానికి ఉండాల్సిన ధర్మాలేమిటి?

నా అభిప్రాయాలను గౌరవిస్తానని మీరన్నారు. కాబట్టి వాటిని ఒప్పు కున్నా, ఒప్పుకోకున్నా కనీసం వాటిని శ్రద్ధగా విననైతే వింటారుగా! నిజానికి గత సంవత్సరం జేఎన్‌యూ చర్చలో భాగమైన రెండు సమూహాలూ దేశీయ లక్షణాలు కలిగినవి కావు. తమను తాము జాతీయవాదులుగా ప్రకటించుకున్న వాళ్లదీ, జాతివ్యతిరేకులనే ముద్ర పడిన వాళ్లదీ ఇద్దరివీ అరువు తెచ్చుకున్న భావ జాలంపై ఆధారపడినవే. జాతి గురించి డబ్బాకొట్టుకున్న వాళ్లు చెబుతున్న జాతీయవాదపు అవగాహన యూరప్‌ భావజాలానికి నకలు మాత్రమే. జాతీయ   వాదంపై సాగిన ఈ చర్చలో భారతీయత అన్నది పూర్తిగా కనిపించకుండా పోయింది.

నిజానికి దేశభక్తులు లేదా జాతీయవాదుల బృందం అంధ భక్తిని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. నా దేశం సరైందేనా, కాదా అన్న ప్రశ్ననే లేవనెత్తగూడదు. దేశం పట్ల అభిమానం అంటే జాతికి సంబంధించిన ఏ విమర్శనైనా వ్యతిరేకించడమే. నా దేశం గొప్పది, ఎందుకంటే ఇది నాది కాబట్టి. భారతదేశాన్ని మాతృ భూమిగా, పితృభూమిగా, శ్రేష్ఠభూమిగా అంగీకరించేవాళ్లే దేశానికి యజమా నులు. మిగిలిన వాళ్లంతా కిరాయికి ఉంటున్న వాళ్లే. నిరుటి చర్చలో ఈ సమూ హం చాలా దూకుడుతనాన్ని ప్రదర్శించింది. గెలుపు తనదేనన్న తీరులో వ్యవహ రించింది. మిగిలిన వారందరి దేశభక్తినీ అది పరీక్షకు పెట్టింది.

మరో సమూహానికి అసలు ఏ పేరూ లేదు. దానిని ఓసారి సెక్యులర్‌ అని పిలిచారు. మరోసారి వారు తమను తాము లిబరల్స్‌ (ఉదారవాదులు) అని చెప్పుకున్నారు. మొదటి సమూహం వీరిని జాతిద్రోహులని అన్నది. కానీ వారిని జాతి అలీనులు అనడం సరిగ్గా ఉంటుంది. వాళ్ల అభిప్రాయం ప్రకారం జాతి అనేది మన అపరిమిత విధేయతకు హక్కుదారేమీ కాదు. కుటుంబం నుంచి విశ్వాంతరాల దాకా మనమంతా వేర్వేరు విభాగాల్లో సభ్యులం మాత్రమే. ప్రతి స్థాయిలోనూ మనపై బాధ్యతలుంటాయి. ఏదో ఒక విభాగాన్ని మాత్రమే కళ్లు మూసుకొని గుడ్డిగా సమర్థించడమేంటి? ఈ సమూహానికి జాతి పట్ల వ్యతిరేకత ఏమీ లేదు కానీ దానిలో గందరగోళం లేదా సంకోచం ఉందని చెప్పొచ్చు. గత సంవత్సరం జరిగిన చర్చలో ఈ సమూహం ఆత్మరక్షణాయుతంగా, ఓటమికి గురైనట్టుగా వ్యవహరించింది.

అయితే జాతీయవాదంపై ఈ రెండు బృందాల అవగాహనా యూరప్‌ నుంచి అరువు తెచ్చుకున్నదే. 19, 20 శతాబ్దాల్లో జాతీయవాదం అనేది ఒక సంకుచిత భావజాలంగా ఉండింది – ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక భాష, ఒక మతం, ఒక రేస్‌. యూరప్‌కు జాతీయ సమైక్యత అంటే ఏకరూపకత మాత్రమే. నిరుటి చర్చలో తమను తాము జాతీయవాదులుగా చెప్పుకున్న వాళ్లు జర్మనీ, ఇటలీలకు చెందిన ఈ సంకుచిత జాతీయవాదాన్నే భారతదేశంలో కాపీ కొట్టా లని భావించారు. నిరుడు జాతీయవాదాన్ని వ్యతిరేకించిన బృందం జాతీయ వాదం తప్పనిసరిగా సంకుచితత్వమే అవుతుందని భావించింది. ఈ రెండు బృందాలూ అరువు తెచ్చుకున్న భావజాలం, అనారోగ్యకరమైన మనస్తత్వానికి చెందిన రెండు ముఖాలు మాత్రమే.

నిజమైన జాతీయ లక్షణాలను అర్థం చేసుకోవడానికి మనం యూరప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి చెందిన జాతీయ వాదం దేశాభిమానంపై మనకు మెరుగైన అవగాహనను అందిస్తుంది. ఈ జాతీయవాదంలో జాతీయ సమైక్యత అంటే అర్థం ఏకరూపకత కాదు. మన జాతీయవాదం యూరప్‌కు చెందిన అవగాహన నుంచి వైదొలగుతూ బహు ళత్వానికి పెద్ద పీట వేసింది. భిన్నత్వంలో ఏకత్వం అనే తత్వాన్ని అందించింది. భారతీయ జాతీయవాదం జాత్యహంకారపూరితమైంది కాదు. అది తెల్ల చర్మాన్ని లేదా బైటివారిని వ్యతిరేకించలేదు. అందుకు భిన్నంగా మన జాతీయవాదం మనల్ని ఆఫ్రికా, ఆసియా, మిగతా ప్రపంచంలో బానిసత్వంలో మగ్గుతున్న వారితో జోడించింది. మన జాతీయవాదం మనల్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా నిలబెట్టేది కాదు, దేశం లోపలే ఉన్న వేర్వేరు కులాలను, ప్రాంతాలను, మతా వలంబికులను జోడించేది.

నేను ఈ మొత్తం చర్చతో ఏకీభవించడం లేదన్న విషయాన్ని మీతో ఫోన్‌లో చెప్పింది గుర్తుండే ఉంటుంది. నేనలా ఎందుకన్నానో ఈపాటికి మీకు అర్థమై ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. గత సంవత్సరం జరిగిన జేఎన్‌యూ చర్చలో దేశభక్తులు గెలవనూ లేదు, దేశద్రోహులు ఓడిపోనూ లేదు. నిజానికి యూరప్‌ జాతీయవాదం గెలిచింది. భారత జాతీయవాదం ఓడిపోయింది.
నా దగ్గర మీ పేరు గానీ, ఫోన్‌ నంబరు గానీ ఏవీ లేవు. కానీ దేశాభిమానం అనేది ఊరూ పేరూ తెలియని వ్యక్తుల కలయికతోనే నిర్మితమవుతుంది కదా!


- యోగేంద్ర యాదవ్‌

మొబైల్‌ : 98688 88986
Twitter : @_YogendraYadav

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement