ఈ విజయం... నూతన శుభోదయం | Yogendra Yadav Article On Indian Hockey Teams Performance Tokyo Olympics | Sakshi
Sakshi News home page

ఈ విజయం... నూతన శుభోదయం

Published Sat, Aug 7 2021 12:20 AM | Last Updated on Sat, Aug 7 2021 12:20 AM

Yogendra Yadav Article On Indian Hockey Teams Performance Tokyo Olympics - Sakshi

ప్రపంచ క్రీడారంగంలో ఎన్నో ఆశలతో అడుగుపెడుతున్న దుర్బలులకు 1970లలో హాకీ, 1980ల వరకు క్రికెట్‌ ఓ గర్వకారణంగా, ఒక సామాజిక హోదాగా ప్రాతినిధ్యం వహించేవి. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. ప్రస్తుతం క్రికెట్‌ చుట్టూ అలుముకుంటున్న జనబాహుళ్యపు ఉన్మాదం మన సాంస్కృతిక మొరటుదనానికి ప్రతీకగా ఉంటోంది. అవమానాల పాలైన భారతీయులకు – నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా అప్పట్లో క్రికెట్‌ హీరోలు రంగంమీది కొచ్చారు. కానీ నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు భారతీయ హాకీ సాధించిన ఈ పునరుజ్జీవనం... మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోందని అందరికీ హామీనిచ్చింది. మరుగునపడి ఉండవచ్చు కానీ అది మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు. 

సాధారణంగా నేను పెందలకడనే లేచే వ్యక్తిని కాదు. కానీ ఈ మంగళవారం ఉదయం నాకు భిన్నంగా కనిపించింది. ఒలింపిక్‌ హాకీ సెమీ ఫైనల్లో భారత్‌–బెల్జియం మ్యాచ్‌ చూడటం కోసం నేనూ నాతోపాటు కుటుంబం మొత్తంగా త్వరగా నిద్రలేచాం. ఇరు జట్లమధ్య జరిగిన పోటీ అసంఖ్యాక భారతీయ అభిమానులకు లాగే మమ్మల్ని కూడా పరవశం నుంచి, ఆందోళన, బాధవరకు అనేక అనుభూతులతో కదిలించివేసింది. నిజానికి భారత హాకీ జట్టు గొప్పగా ఆడింది. కానీ ఆ పోటీలో ఓడిపోవడం మాకు అవమానం కలిగించలేదు. అంతకుముందు హార్దిక్‌ సింగ్‌ బ్రిటన్‌ జట్టుపై చేసిన ఏకైక, అద్భుతమైన గోల్‌ను చూస్తున్నప్పుడు కలిగిన ఆ మొదటి ఆనందం ఇప్పటికీ మనసులోంచి తొలిగిపోలేదు. లేదా మన మహిళల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు కలిగిన చక్‌ దే మూమెంట్‌ గర్వాతిశయాన్ని కూడా మర్చిపోలేదు.

ఆ ఘటన నాకు దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి నా పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చింది. నేను చదువుకున్న శ్రీ గంగానగర్‌ లోని ఎస్‌జీఎన్‌ ఖల్సా హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో గ్రామీణ సిక్కు అబ్బాయిలు ఎక్కువగా ఉండి ఆటలకు ఎంతో పేరుపొందింది. ఆ రోజుల్లో రాజస్తాన్‌ తరపున ఆడుతున్న 11 మందిలో 6 నుంచి 8 మంది సభ్యులు మా స్కూలుకి చెందినవారే. తర్వాత నేను చదివిన ఎస్‌జీఎన్‌ ఖల్సా కాలేజీ కూడా హాకీ, అథ్లెటిక్స్‌లో అదే రకమైన పేరు కలిగి వుండేది. నా తోటివారి లాగే నేను కూడా అప్పట్లో హాకీకి పెద్ద అభిమానిగా ఉండేవాడిని. అప్పటికే భారతీయ హాకీ తన స్వర్ణ యుగాన్ని దాటేసింది కానీ అంతర్జాతీయ ప్రతిష్ట, గుర్తింపు నుంచి ఇంకా దూరం కాలేదు. 1975లో కౌలాలంపూర్‌ ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్లో భారత జట్టు విజయం సాధించిన గేమ్‌లో అస్లామ్‌ షేర్‌ ఖాన్‌ చివరి నిమిషంలో చేసిన గోల్‌ మన హాకీ వైభవాన్ని నిర్వచించిన ఘటనగా మిగి లిపోయింది. ఆనాటి భారతీయ హాకీ మా తరానికీ, మన జాతీయ గర్వానికీ ప్రతీకగా నిలిచి ఉండేది. అలాగని మన జట్టు కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం కానీ దానికి ఒక ప్రతిష్ట అంటూ ఉండేది.

నా తరంలో చాలామందికి లాగే, హాకీ పట్ల నా అనురక్తి మెల్లగా క్రికెట్‌ వైపుకు మళ్లింది. 1974–75 శీతాకాలం సీజన్‌లో క్లైవ్‌ లాయిడ్‌ జట్టు భారత్‌కు రావడంతో అది మొదలైంది. ఈ సీరీస్‌లోనే గార్డన్‌ గ్రీనిడ్జ్, వివియన్‌ రిచర్డ్స్, ఆండీ రాబర్ట్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడారు. నాకు వ్యక్తిగతంగా జి. విశ్వనాథ్, బ్రిజేష్‌ పటేల్, బీఎస్‌ చంద్రశేఖర్‌ అంటే చాలా ఇష్టం. వీరంతా కర్ణాటకకు చెందినవారే. ఆ పోటీలో భారత్‌ సిరీస్‌ కోల్పోయింది కానీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 1976 ఒలింపిక్స్‌లో ఆస్ట్రో టర్ఫ్‌ని ప్రవేశపెట్టడంతో భారతీయ హాకీ ప్రాభవం మళ్లీ పుంజుకోలేనంతగా పతనమార్గం పట్టింది. 1980 నాటి మాస్కో ఒలింపిక్స్‌లో సులభంగా మన జట్టు స్వర్ణం సాధించిం దనుకోండి. ఆ సమయంలోనే క్రికెట్‌ ఆటకు ప్రాచుర్యం పెరగడం, 1983 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్‌ జట్టు డ్రీమ్‌ విక్టరీ సాధించడం కాకతాళీయంగా జరిగిపోయింది.

మా స్నేహితులు కొందరు ముందుకొచ్చి స్థానిక క్రికెట్‌ టీమ్‌ను నెలకొల్పారు. దానికి ఎలెవన్‌ స్టార్‌ క్లబ్‌ అని మహా గొప్ప పేరుండేది. అప్పటికింకా ప్రారంభించని నూతన ఏపీఎంసీ మైదానం మా క్రికెట్‌ గ్రౌండ్‌గా ఉండేది. క్రమంగా క్రికెట్‌ స్టార్లు (ఈ జాబితాలో నేను కపిల్‌ దేవ్‌ను చేర్చాను) కొత్త జాతీయ హీరోలు అయ్యారు. భారతజట్టు అప్పటికీ ప్రాధాన్యత లేని జట్టుగానే ఉండేది. ప్రత్యర్థులను అçప్పుడప్పుడూ ఓడిస్తూ మన గర్వాన్ని కాస్త పెంచుతూ వచ్చేది. భారత్‌ ఆడనప్పుడు నేను వెస్టిండీస్‌కి చెందిన వివియన్‌ రిచర్డ్స్, పాకిస్తాన్‌ ఆటగాడు జహీర్‌ అబ్బాస్‌ను ఆరాధించేవాడిని. మూడో ప్రపంచ దేశాలకు, అలీనోద్యమానికి సంఘీభావం తెలుపుతున్న రోజులవి.

ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నేను క్రీడా ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాను. క్రికెట్‌ పట్ల నా ఆసక్తిని నా వృత్తిపట్ల అనురక్తి కనుమరుగు చేస్తూ వచ్చింది. హాకీ గతించిన జ్ఞాపకంలా ఉండేది. అలాంటి సమయంలో ‘లగాన్‌’ మళ్లీ ప్రేరణ కలిగించింది కానీ క్రికెట్‌ పట్ల నా ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ‘చక్‌ దే! ఇండియా’ భారత్‌ని ఆనందభాష్పాలతో ముంచెత్తింది కానీ వాస్తవ ప్రపంచంలో అలాంటిది ఏదీ మిగలలేదు. 

ఆ తర్వాత నా కుమారుడు కొన్నేళ్ల క్రితం నాలోని క్రీడాసక్తిని తిరిగి వెలిగించిన సమయానికి క్రికెట్‌ కొత్త గేమ్‌గా అవతరించింది. ట్వంటీ 20 టెస్ట్‌ క్రికెట్‌ ఫార్మాట్‌ని, పేస్‌ని కూడా మార్చేసింది. ఈ సరికొత్త మార్పులను నేను చిన్నచూపు చూడలేదు. టీ20 మ్యాచ్‌లంటే నాకు ఇష్టం. సిక్సర్ల విందును మనం ఎందుకు ఆస్వాదించకూడదు? బ్యాట్స్‌మన్‌ల కోసం రూపొందిన ఒక ఫార్మాట్‌ ఇప్పుడు బౌలర్లకు స్వర్గధామం కావడం చూసి ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు భారతీయ క్రికెట్‌లోని ఈ టాలెంట్‌ పూల్‌ని చూసి నిజంగానే దిగ్భ్రాంతి చెందుతున్నాను. 

ఇప్పుడు క్రికెట్‌ ఒక విస్తరించిన వినోద పరిశ్రమగా మారిపోయింది. మనం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ హబ్‌కి చెందినవారమని నాకు తెలుసు. కానీ నా జాతీయ స్వీయగౌరవానికి అది అదనంగా దేన్నీ జోడించదు. ముఖానికి రంగు పూసుకుని, టీషర్టులు ధరించి ఇంటా బయటా క్రికెట్‌ చూస్తున్న భారతీయ అభిమానులను చూస్తుంటాను. కానీ వారి ఆనందపు అరుపులు, హోరుకేకల్లో నేను భాగం కాలేదు. 2007లో టీ20 ప్రపంచ కప్‌లో మన విజయం 1983 ప్రపంచకప్, 1975 ప్రపంచ హాకీ కప్‌ విజయంతో సమానమైంది కాదని నా అభిప్రాయం. 

ఈసారి ఒలింపిక్స్‌లో మన హాకీ జట్లపై కూడా నా అభిప్రాయం ఇదే. హాకీ కూడా మారిందనడంలో సందేహమే లేదు. నాలుగు క్వార్టర్ల ఫార్మాట్, గేమ్‌ తీరు, కొత్త నిబంధనలు చోటు చేసుకున్నప్పటికి మౌలికంగా అది ఒకనాటి క్రీడనే తలపిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టు నెగ్గినప్పుడు 46 ఏళ్ల క్రితం అజిత్‌ పాల్‌ సింగ్‌ నేతృత్వంలోని జట్టు సాధించిన విజయానుభూతులను మళ్లీ గుర్తుకు తెచ్చాయి. ఇప్పటి మన మహిళా హాకీ ప్లేయర్ల విజయగాథలు 1970ల నాటి భారతీయ హాకీ క్రీడాకారుల విజయగా«థలకు తీసిపోవు. ఒలింపిక్‌ పతకాలు మనవాళ్లు గెలవకపోయినా నేను లెక్క చేయను. (భారత పురుషుల హాకీ టీమ్‌ కాంస్యం దక్కించుకోగా, శుక్రవారం గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోటీలో మన మహిళల టీమ్‌ తృటిలో కాంస్యం చేజార్చుకుంది.). ఒకటి మాత్రం నిజం మన పురుషులు, మహిళల హాకీ టీమ్‌ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇప్పుడు మన జాతీయ సంకేతాలుగా నిలుస్తారు.

ఇది నా కథ మాత్రమే కాదు. వలస పాలనానంతర జాతీయవాదం నుంచి కఠినమైన అల్ట్రా జాతీయవాదం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఒక తరం గాథ కూడా. క్రికెట్‌ చుట్టూ వలసవాద రాజకీయాల కథపై రాసిన ఆశీష్‌ నంది మనకో విషయం గుర్తుచేశారు. ‘మూలాలు మర్చిపోయిన, అవమానాల పాలైన, సంస్కృతి కోల్పోయిన భారతీయులకు– నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశం పొందుతూ వచ్చిన అన్ని వైఫల్యాలకు చికిత్సలాగా క్రికెట్‌ హీరోలు రంగంమీదికొచ్చారు’. ఈ నేపథ్యంలో భారతీయ హాకీ పునరుజ్జీవనం మరొక ప్రగాఢమైన, సానుకూల జాతీయవాదం మనలో ఇప్పటికీ మనగలుగుతోం దని నాకు హామీ ఇస్తోంది. అది మరుగున పడి ఉండవచ్చు కానీ మన జాతీయ చైతన్యం నుంచి మాత్రం తొలగిపోలేదు.


యోగేంద్ర యాదవ్‌ 
వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ సంస్థాపకులు
(‘ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement