సంకల్పం... మనిషిని ఉన్నత శిఖరాలకు మోసుకువెళ్ళే ఐరావతం. నమ్మకం... కోరిన విజయాన్ని అందించే కల్పవృక్షం. భారత హాకీ స్త్రీ, పురుష జట్లు రెండూ తాజా టోక్యో ఒలింపిక్స్‌లో అది మరోసారి రుజువు చేశాయి. జాతీయక్రీడ హాకీలో భారత్‌ది వట్టి గత వైభవం కాదని ప్రపంచ వేదికపై చాటాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అనేక దేశాలు బహిష్కరించిన 1980 మాస్కో ఒలింపిక్స్‌లో హాకీలో మనకు స్వర్ణం వచ్చింది. మళ్ళీ 41 ఏళ్ళ తర్వాత మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని పురుషుల జట్టు ఈసారి కాంస్యంతో ఒలింపిక్ పతకాల పట్టికనెక్కడం చిరస్మరణీయం. రాణీ రామ్‌పాల్ కెప్టెన్సీలోని మహిళల హాకీ జట్టు వెంట్రుక వాసిలో పతకం చేజార్చుకున్నా, హోరాహోరీ పోటీలలో సత్తా చాటి, ప్రజల మనసు గెలుచుకోవడం మరో చరిత్ర. ధ్యాన్‌చంద్ లాంటి దిగ్గజాల ఆటతో 8 ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన ప్రాభవం ఒకప్పుడు మన హాకీ జట్టుది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించుకోలేక, అభిమానుల్ని క్రమంగా క్రికెట్‌కు కోల్పోయిన మన పురుషుల జట్టు 2016 నుంచి పుంజుకున్న తీరు ప్రశంసనీయం. రియో ఒలింపిక్స్‌లో 12వ స్థానంలో నిలిచి, ఘోర పరాభవం పాలైన మహిళల జట్టు ఇప్పుడు ఏకంగా విశ్వవేదికపై నాలుగో స్థానంలో నిలవడం గణనీయమైన పురోగతి. భారత హాకీ చరిత్రలో ఇది ఓ కొత్త శకం. ఒక దశలో అంపశయ్యపై ఉందని భావించిన భారత హాకీకి ఇప్పుడు మళ్ళీ స్వర్ణయుగం వస్తున్నట్టు కనిపిస్తోంది.
ఆ సువర్ణ స్వప్నం నిజం కావాలంటే, చేయాల్సింది చాలా ఉంది. కానీ, ఈ లోగా తాజా క్రీడా విజయాలను సర్కారు రాజకీయంగా వాడుకొనేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలొస్తున్నాయి. ఆగస్టు 5న భారత పురుషుల హాకీ జట్టు కాంస్య విజయాన్ని సందర్భంగా తీసుకొని, ఓ ఉత్తరప్రదేశ్ సభలో మోదీ చేసిన వర్చ్యువల్ ప్రసంగమే అందుకు తార్కాణమంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రెండేళ్ళ క్రితం ఆగస్టు 5నే రద్దు అయిందనీ, సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామాలయానికి భూమిపూజ చేసిందీ, ఇప్పుడు హాకీ పతకం వచ్చిందీ అదే తేదీన అంటూ, భారత నవోదయానికి ఇది నాంది అన్నట్టు మోడీ మాట్లాడడాన్ని విమర్శకులు తప్పుబట్టారు. 85 ఏళ్ళ క్రితం 1936లో ఇదే తేదీన బెర్లిన్ ఒలింపిక్స్‌లో ఆఫ్రికన్ – అమెరికన్ అథ్లెట్ జెస్సీ ఓవెన్స్ గెలిచారు. ఆర్యులే గొప్ప అని చాటాలనుకున్న హిట్లర్ ఆశల్ని తుంచేశారు. మరి, ఆ సంగతి మోదీ మర్చిపోయారా అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. ఇక, క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం పేరును ‘రాజీవ్ ఖేల్ రత్న’ నుంచి ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’గా మార్చాలన్న మోదీ తాజా నిర్ణయం మరో వివాదమైంది. ఇది ‘రాజకీయ ప్రతీకార చర్య’ అని ప్రతిపక్షం నిరసిస్తోంది. నిజానికి, పార్టీలకు అతీతమైన క్రీడలకు ఇలా రాజకీయ రంగులు అద్దడం ఏ ప్రభుత్వం చేసినా అది తప్పే!
‘చక్ దే’ లాంటి కలల్ని వెండితెరపై విక్రయించడమే తప్ప, వాస్తవంలో ఐపీఎల్ లాంటి లాభసాటి క్రికెట్ వ్యాపారాల వైపే మన దేశంలో షారుఖ్ ఖాన్ సహా సోకాల్డ్ తారల మొగ్గు. ఇలాంటి చోట పాలకులు ఏం చేయాలన్నదానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ ఉదాహరణ. హాకీ జట్టుకు స్పాన్సరర్ బాధ్యత నుంచి 2018లో ‘సహారా’ సంస్థ తప్పుకున్నప్పుడు, ఆయన అండగా నిలిచిన వైనాన్ని దేశమంతా ఇప్పుడు వేనేళ్ళ ప్రశంసిస్తోంది అందుకే! స్వయంగా హాకీ మాజీ గోల్ కీపరైన నవీన్ తమ ప్రభుత్వ పక్షాన భారత హాకీ జట్ల కోసం వంద కోట్ల పైనే వినియోగించిన వైనం ఇప్పుడు ఓ ఆసక్తికర స్ఫూర్తిగాథ. ఇలాంటి అవిరళ కృషే ఇవాళ హాకీలో మన కొత్త శకానికి శుభారంభం పలికింది. 2023లో పురుషుల హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడానికి సైతం ఒడిశా సర్కారు సిద్ధమవుతోంది. రూర్కేలాలో అంతర్జాతీయ స్టేడియమే కడుతోంది. స్వార్థం చూసుకోకుండా పాలకులు శ్రద్ధ పెడితే, ఏ రంగంలోనైనా ప్రతిభా పురోగమనం సాధ్యమనడానికి ఇవన్నీ సాక్ష్యాలు.
పాలకుల సహకారం మాటెలా ఉన్నా, ప్రతిభావంతుల ప్రయత్నాలు ఆగలేదు. టోక్యో ఒలింపిక్స్‌తో ఆ విషయం స్పష్టమైంది. దుర్భర దారిద్య్రం, లింగ, కుల వివక్ష, పక్షపాతం, కనీస వసతుల లేమి లాంటి ఎన్నో ఆటంకాలు ఉన్నా, పట్టుదల ఉంటే ప్రపంచ వేదికపై రాణించగలమని మన గ్రామీణ క్రీడాకారులు నిరూపించారు. పతకాల వేటలో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నామని భావిస్తున్న వేళ దేశం నలుమూలల నుంచి మట్టిలో మాణిక్యాలెన్నో మెరిశాయి. నిజానికి, ఈసారి కూడా మన దేశానికి పతకాల సంఖ్య గణనీయంగా ఏమీ పెరగలేదు. కానీ, మనవాళ్ళు విశ్వక్రీడా సంరంభంలో పోటాపోటీ ప్రతిభ చూపడం, భవిష్యత్తుపై ఆశలు రేపడం కచ్చితంగా విశేషమే!
హాకీ సహా అనేక ఆటల్లో వెల్లువెత్తిన ఈ కొత్త ఉత్సాహం ఆసరాగా, రాగల కాలంలో బలమైన క్రీడాశక్తిగా భారత్ అవతరించడానికి ఇదే సరైన తరుణం. అయితే, ఇప్పుడిక తగిన దిశానిర్దేశంతో ప్రభుత్వాలు, క్రీడాసంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికా రచన చేయాలి. క్రికెట్‌లో ఐపీఎల్ లాగా హాకీలో జాతీయస్థాయి లీగ్ లాంటివి మొదలుపెట్టడం లాంటివి చేయవచ్చు. అన్నిటి కన్నా ముఖ్యంగా చదువుతో పాటు ఆటల్ని అంతర్భాగం చేసే మంచి పద్ధతుల్ని పునఃప్రతిష్ఠించాలి. శిక్షణ నిమిత్తం నగరాలకు వెళ్ళలేని ప్రతిభావంతులైన గ్రామీణుల కోసం స్థానిక స్థాయిలో, వీలుంటే ప్రతి జిల్లాలో క్రీడా సముదాయాలు నెలకొల్పాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు తగిన తర్ఫీదు నివ్వాలి. ఇలా కింది స్థాయి నుంచి దృఢసంకల్పంతో కృషి మొదలుపెట్టి, ఆటగాళ్ళలో నమ్మకం పెంపొందిస్తే – ఒక్క హాకీలోనే కాదు... అనేక క్రీడల్లో అంతర్జాతీయ యవనికపై మన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. మెడలో పతకాల హారంతో దేశం మెరిసిపోతుంది, మురిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment