
ఒక్క కప్పు టీ ఖరీదు రూ. 5000
రాజకీయులందరూ ఇప్పుడు 'చాయ్ చమక్కులే చూడరా భాయ్' అని పాడుకుంటున్నారు. నమో పుణ్యమా అని చాయ్ కి ఈ సారి ఎన్నికల్లో గిరాకీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టీ పార్టీలు ఇవ్వబోతోంది. అయితే ఒక్కటే తేడా. నమో చాయ్ ఓటు కోసం, ఆప్ చాయ్ నోటు కోసం.
పార్టీకి నిధులు సేకరించే ప్రయత్నంలో భాగంలో మార్చి 29న హర్యానాలోని గుర్గావ్ లో టీ పార్టీ పెడుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఒక కప్పు చాయ్ ధర రూ. 5000. పార్టీ సీనియర్ నేత యోగేంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి. ఆమ్ ఆద్మీలు (మామూలు మనుషులు) రావడానికి వీల్లేకుండా ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఎవరెంత ఇచ్చిందీ పార్టీ వెబ్ సైట్ లో పెడతామని, ఇందులో దాపరికం ఏమీ లేదని యోగేంద్ర యాదవ్ చెబుతున్నారు. ఇలా నిధులు సేకరించడంలో తప్పేమీ లేదని కూడా ఆయన అంటున్నారు.