హర్యానా ఎన్నికలు సవాలే!
Published Mon, Dec 16 2013 11:27 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
గుర్గావ్: హర్యానాలో గెలవడం ఢిల్లీ కన్నా సవాల్‌తో కూడుకున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. ఇప్పటికే తమ పార్టీపై అనేక అంచనాలు ఉండటంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో 28 సీట్లు గెలిచి అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆప్ తొలిసారిగా గుర్గావ్‌లో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ‘హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మాకు సవాల్‌తో కూడుకున్నవి. ఎందుకంటే ఈసారి పార్టీ ప్రదర్శనపై అంచనాకు మించిన ఆశలు ఉన్నాయ’ని అన్నారు. క్షుద్ర రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిన గుర్గావ్ జిల్లా ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి రహిత రాజకీయం కావాలనుకుంటున్నారని చెప్పారు. గుర్గావ్‌లో పుట్టినందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని తెలిపారు. ఇక్కడ అనేక మార్పులు జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. గతేడాది సమావేశం నిర్వహించినప్పుడు కేవలం 50 మంది సభ్యులం మాత్రమే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఈసారి ఆ సంఖ్య రెండింతలు అయిందన్నారు. హర్యానాలో కలసికట్టుగా పనిచేయాలనుకుంటున్నామన్న యోగేంద్ర అన్ని కాలనీల్లో ఆప్ విభాగాలను పటిష్టం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తమ పార్టీ తరఫున ఓటరు నమోదు కార్యక్రమం కూడా ప్రారంభించామని చెప్పారు.
గతంలో ఓటర్ జాబితాలో ఉన్న అనేకమంది పేర్లు ఈసారి కనిపించకుండా పోయాయని అన్నారు. కావాలనే వారి పేర్లు తొలగించడం జరిగిందని, వాటిపై ఆప్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఢిల్లీకి ముందు ఉన్న వాతావరణమే హర్యానాలో కూడా కనబడుతుందన్నారు. అనేక ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పునాదులను కదలించేందుకు ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకునేందుకు కలసికట్టుగా కృషి చేయడంలో సఫలమయ్యామన్నారు. హర్యానాలో పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న అధికార పార్టీతో ఆప్ తలపడాల్సి ఉందని తెలిపారు. అయితే ఆప్ తరఫున ఎంతమందిని బరిలోకి దింపాలనే దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి అశోక్ కెమ్కాను ప్రకటించడంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదన్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గుర్గావ్‌కు చెందిన వాలంటీర్లు హర్యానాలోనూ కీలకపాత్ర పోషిస్తారని జాతీయ మండలి సభ్యుడు రమేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హర్యానాలో ఆప్‌ని గెలిపించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఇలాంటి సమావేశాలనే మీవట్, రేవరిలో కూడా నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేస్తామన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోసం నిధుల సేకరణను పార్టీ ప్రారంభించిందని హర్యానా ఆప్ కన్వీనర్ యశ్వంత్ గుప్తా చెప్పారు. నమ్మకమున్న వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకొని ఎన్నికలు గెలవవచ్చని తమ పార్టీ నిరూపించిందన్నారు. హర్యానాలో దాన్నే పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సృష్టించిన సంచలనాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పునరావృతం చేయాలని ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా కోరారు. ఈ బహిరంగ సభలో భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement