
కేజ్రీవాల్‌కు దాడుల బెడద
సాక్షి, న్యూఢిల్లీ: ఇది వరకే పలు ప్రాంతాల్లో దాడులను ఎదుర్కొన్న ఆప్ అగ్ర నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఇలాంటిదే మరో అనుభవం ఎదురయింది. దక్షిణ ఢిల్లీలో రోడ్ షో జరుపుతుండగా దాడి జరిగింది. ఇటీవల జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ముఖానికి సిరా పూయడం తెలిసిందే.
దక్షిణపురిలో ఓపెన్ జిప్సీలో రోడ్‌షో జరుపుతున్న ఆయనపై హఠాత్తుగా ఓ వ్యక్తి దాడిచేశాడు. రోడ్‌షో సమయంలో కేజ్రీవాల్‌పై దాడు లు చేయడం ఇటీవల తరచుగా జరుగుతోంది. కొన్నిరోజుల కిందట హర్యానా భివానీలో తననో వ్యక్తి కొట్టాడని కేజ్రీవాల్ చెప్పారు.
వాహనంపై ఇనుపరాడ్లతో దాడిచేసి గ్లాసులు పగుల గొట్టారని కేజ్రీవాల్ శుక్రవారం నాటి రోడ్‌షోకు ముందే చెప్పారు. ఇటీవల వారణాసిలో కూడా రోడ్ షో సమయంలో ఆయనపై సిరా చల్లారు. ఇక దక్షిణ పురిలో కేజ్రీవాల్ ప్రసంగం ముగించి ప్రజలతో కరచాలనం చేస్తుండగా ఓ యువకుడు జీపుపై ఎక్కి ఆయన వీపుపై పిడికిలితో గట్టిగా గుద్దాడు.
చెంప దెబ్బ కొట్టేందుకూ ప్రయత్నించాడు. ఆప్ కార్యకర్తలు అతణ్ని పట్టుకొని దాడి చేయగా, వద్దంటూ కేజ్రీవాల్ వారించారు. దక్షిణపురి పోలీసులు అతన్ని ప్రశ్నించగా, పేరు అబ్దుల్ వాహిద్ అని, తాను జామియానగర్ వాసినని, ఆప్ కార్యకర్తనని చెప్పాడు. దీనిపై ఆప్ పిర్యాదు దాఖలు చేయలేదు.
బీజేపీ పనే : ఆప్
సదరు తనను గట్టిగా గుద్దాడని కేజ్రీవాల్ విలేకరులకు చెప్పారు. ‘కార్యకర్తలు అతడిని కొట్టి ఉండాల్సింది కాదు. ప్రధానమంత్రి కావడం కోసం కొందరు ఏదైనా చేయడానికి వెనుకాడడం లేదు. ఆ వ్యక్తి తన పని తాను చేశాడు. మాది అహింసాత్మక ఉద్యమం. దాడి చేసినవారిపై ఎదురుదాడికి దిగితే ఉద్యమమే సమాప్తమవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. దాడి వెనుక బీజేపీ ఉన్నట్లు ఆప్ ఆరోపించినప్పటికీ, ఈ పని చేసింది ఆప్ మద్దతుదారుడేనని పోలీసులు వెల్లడించారు. అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ కేజ్రీవాల్ రోడ్ షో జరుపుతున్నారని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆయనకు జ్వరంగా ఉందని వారు చెప్పారు.