యోగేంద్ర యాదవ్ కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: యోగేంద్ర యాదవ్ నేతృత్వంలోని స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి ఉమ్మడి గుర్తు ఇవ్వాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంటాయని, ఉమ్మడి గుర్తు లేనంత మాత్రానా ఎటువంటి నష్టం జరగదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
గుర్తింపులేని నమోదిత పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో స్వరాజ్ ఇండియా పార్టీకి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏప్రిల్ 22న జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృతుడైన యోగేంద్ర యాదవ్.. ప్రశాంత్ భూషణ్ తో కలిసి స్వరాజ్ ఇండియా పార్టీని స్థాపించారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై విమర్శలు చేయడంతో వీరిద్దరూ బహిష్కరణకు గురయ్యారు.