ప్రజలకే అధికారం: ఆమ్ ఆద్మీ పార్టీ
తాము అధికారంలోకి వస్తే అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలకే అధికారం కట్టబెడతామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) న్యూఢిల్లీ నగర వాసులకు ప్రమాణం చేసింది. అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని, లోక్పాల్ బిల్లును అమలు పరుస్తామని వెల్లడించింది. న్యూఢిల్లీ శాసనసభకు డిసెంబర్ 4వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ... రాజధాని నగరంలోని కాలనీల్లో అధికార వికేంద్రీకరణ పేరిట ప్రతి ఏటా 'కాలనీ అసెంబ్లీ' సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది. కాలనీల్లో అవసరమైన పనులపై కాలనీ వాసులే సొంతగా నిర్ణయం తీసుకుని అవసరమైన పనులను చేపట్టవచ్చిని వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులు స్వయంగా అందజేస్తామని వివరించారు. ఆ అంశంలో రాజకీయ నాయకులు, అధికారులు జోక్యం ఎంత మాత్రం ఉండదని తెలిపారు.
అలాగే షీలా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి న్యూఢిల్లీ వాసుల నడ్డి విరిచిందని ఆయన ఆరోపించారు. తాము విద్యుత్ ఛార్జీలను సగానికి సగం తగ్గించి నగర ప్రజలపై పడిన భారాన్ని తగ్గిస్తామని వివరించారు. న్యూఢిల్లీ పరిధిలోని విద్యుత్ పంపిణి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలోని పోలీసులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నారని, తాము అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను న్యూఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తామని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.